విజయవాడ, ఫిబ్రవరి 15, (way2newstv.in)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సెన్సేషన్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. తనకంటూ ప్రత్యేకతను చాటుతూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాల పరంగానే కాదు.. కొద్ది సంవత్సరాల క్రితం ఆయన ఏర్పాటు చేసిన జనసేన పార్టీకి వాళ్లే అండగా ఉన్నారు. తమ అభిమాన నటుడు, రాజకీయ నేతను ఎలాగైనా ముఖ్యమంత్రిని చేయాలని ఎంతో పట్టుదలగా ఉన్నారు. అందుకే జనసేనాని పిలుపునిస్తే ఎక్కడికైనా వచ్చేస్తున్నారు. పవన్ కూడా వాళ్లను ప్రభావితం చేసేందుకు ఎన్నో నీతులు చెబుతూ ఉంటాడు. ఎన్నో బహిరంగ సభల్లో అభిమానులకు సందేశాలు కూడా ఇచ్చాడు. జనసేన సిద్ధాంతాలు అని కొన్నింటిని పెట్టుకున్నారు.
అంతుచిక్కని పవన్ స్ట్రాటజీ
అయితే, వాటిని మాత్రం పవన్ పాటించరు. తాజాగా జరిగిన పరిణామమే దీనికి ప్రత్యేక ఉదాహరణ అని చెప్పవచ్చు. తమిళనాడులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆ రాష్ట్ర మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సోమవారం జనసేనలో చేరారు. దీంతో జనసేనాని వెంటనే ఆయనను తన రాజకీయ సలహాదారుగా నియమించారు. ఈ పరిణామం తర్వాత పవన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఆయన గతంలో లోకేష్‌పై చేసిన కామెంట్లే.గత సంవత్సరం జరిగిన జనసేన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో దేశంలోనే సంచలనం రేకెత్తించిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి కేసులో లోకేష్ పాత్ర ఉందంటూ బాంబు పేల్చారు. ‘‘మీ అబ్బాయి గారి అవినీతి మీ దాకా చేరిందో లేదో నాకు తెలియదు గానీ, పొలిటికల్ వర్గాల్లో మాత్రం పుంకాలు పుంకాలుగా చెప్పుకుంటున్నారు, శేఖర్ రెడ్డి కేసుతో లోకేష్ సంబంధం ఉందంటున్నారు, ఇవన్నీ వింటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది’’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. దీని తర్వాత శేఖర్ రెడ్డి కూడా స్పందించారు. పవన్ తన గురించి చెప్పినవన్నీ అబద్దాలేనని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను తన జీవితంలో ఎప్పుడూ కలుసుకోలేదని, అసలు లోకేష్‌ను ఇప్పటి వరకు చూడనే లేదని శేఖర్ రెడ్డి చెప్పారు. తనతో లోకేశ్‌కు సంబంధాలున్నాయని, దానికి సంబంధించి ప్రధాని మోదీ వద్ద సమాచారం ఉందని, అందుకే చంద్రబాబు భయపడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని శేఖర్ రెడ్డి తెలిపారు. దీంతో పవన్ కూడా తన వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారు.అదే శేఖర్‌రెడ్డి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావును జనసేనలో చేర్చుకున్నారు పవన్. శేఖర్‌రెడ్డి గురించి తెలిసిన వ్యక్తికి అదే కేసులో కొన్ని లక్షల రూపాయలతో పట్టుబడిన రామ్మోహన్ గురించి తెలియదా అని అంతా ప్రశ్నిస్తున్నారు. ఆయనను జనసేనలో చేర్చుకున్న క్రమంలో ‘‘అన్నాడీఎంకే ప్రభుత్వం హయాంలో తమిళనాడు ప్రభుత్వ సీఎస్‌గా రామ్మోహన్ రావు పనిచేశారు. అప్పటి సీఎం జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపారు. అలాంటి గొప్ప వ్యక్తి పార్టీపైన, నాపైన నమ్మకంతో అండగా నిలబడ్డానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన విలువైన సలహాలు, సూచనలతో ఏపీకి బంగారు భవిష్యత్తును అందిస్తాం’’ అని ఆయన కామెంట్స్ చేయడం చూస్తే పవన్‌లో పొలిటికల్ యాంగిల్ బయటపెడుతున్నట్లు అనిపిస్తోంది. ఈ పరిణామం తర్వాత పవన్ వ్యక్తిత్వంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేరే పార్టీలో ఉన్న వాళ్లు తప్పుడు వారు.. తన పార్టీలోకి వచ్చే సరికి గొప్పవారు అన్నట్లు పవన్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యకరమైనదే..!
No comments:
Post a Comment