Breaking News

26/02/2019

సాగుకు సెలవు.. అతిథులకు నెలవు(కృష్ణాజిల్లా)

కైకలూరు, ఫిబ్రవరి 26  (way2newstv.in):  
కొల్లేరులోని నీరు ఉప్పుమయంగా మారడంతో కృత్రిమ సాగుకు స్థానికులు ఈ ఏడాది సెలవు ప్రకటించడంతో అందమైన అతిథులకు ఆహ్లాదంగా మారింది. ఫిబ్రవరి నెలలో లక్షల సంఖ్యలో పక్షులు కొల్లేరులో ఆహారాన్ని వేటాడుకుంటూ స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. సాగులేకపోవడంతో జనసంచారం తగ్గింది. దీంతో పక్షుల సంచారానికి ఆటంకాలు తొలగిపోయాయి. కొల్లేరు ప్రాంతమంతా విహంగాల వేడుకలా మారింది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా గూడబాతులు, కొంగలు, పరజలు కనువిందు చేస్తున్నాయి. స్వేచ్ఛగా  కలియతిరుగుతూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 
జిల్లాలోని కైకలూరు, గుడివాడ నియోజకవర్గాలలో ఉప్పునీటి రొయ్యల సాగు నాలుగేళ్లుగా ఊపందుకుంది. సాగు తర్వాత పెద్దఎత్తున ఉప్పు నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. 64 డ్రెయినేజీల ద్వారా సరస్సులోకి వచ్చి చేరుతున్న మురుగు నీటిలో అధిక భాగం ఉప్పునీరే ఉంటుంది. ఫలితంగా కొల్లేరులో ఉప్పునీటి ఉద్ధృతి పెరిగింది. కృత్రిమ సాగు చేస్తున్న రైతులకు ఇటీవల ఉప్పునీటి వల్ల తీవ్ర నష్టాలు తప్పడం లేదు. రూ.లక్షల్లో వేలం పాడుకుని సాగు చేస్తున్నా నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో ఈ ఏడాది కొల్లేరు ప్రాంతంలో కృత్రిమ సాగుకు విరామాన్ని ప్రకటించారు. 


 సాగుకు సెలవు.. అతిథులకు నెలవు(కృష్ణాజిల్లా)

నాలుగేళ్లుగా జనవరి నెలలోనే సరస్సులో నీరు పూర్తి ఎండిపోయేది. ఇందుకు ప్రధాన కారణం- కృత్రిమ సాగే. కొల్లేరులో మిగిలిన ప్రాంతాల్లోని నీటిని పెద్దఎత్తున డీజిల్ ఇంజన్లతో కృత్రిమ సాగు చేస్తే చెరువుల్లోనికి తోడుకుని నిల్వ చేసేవారు. పూర్తిగా ఎండిపోయి జనవరిలోనే నెర్రలు కమ్మేది. కాని ఈ ఏడాది కృత్రిమ సాగు లేకపోవడంతో ఎక్కడ నీరు అక్కడ ఉంటూ పక్షులకు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఆహారాన్ని అందిస్తుంది. మండవల్లి, కైకలూరు మండలాల్లో ఏటా 2,500 ఎకరాల్లో కృత్రిమసాగు సాగేది. ఈ ప్రాంతాలలో నిత్యం ప్రజలు తిరుగుతూ ఆహారం కోసం వచ్చే పక్షులను చెరువులకు రాకుండా బాణసంచా, పెద్ద శబ్దాలతో బెదిరింపులకు గురిచేసేవారు. దీంతో ఆ ప్రాంతంలో పక్షులు తిరగకుండా ఎగిరిపోయేవి. జనవరి నెలలోనే తిరుగు ప్రయాణం కావాల్సిన పరిస్థితి ఉండేది. ఈ ఏడాది ఆ పరిస్థితి తప్పిపోయింది. 
ఎండలు ముదురుతున్నా ఈసారి కొల్లేరులో నీరు ఉండడంతో పెద్ద ఎత్తున పక్షులు కనువిందు చేస్తున్నాయి. తూర్పు ఐరోపా, ఉత్తరాసియా ప్రాంతాలనుంచి ఏటా పెద్దఎత్తున పక్షులు వచ్చి సంతానోత్పత్తిని చేసుకుంటాయి. కొల్లేరులో సుమారు 150 జాతుల వరకు నివసిస్తుంటాయి.  ముఖ్యంగా ఇక్కడే పెరిగే గ్రేపెలికాన్లు, ఆసియా ప్రాంతపు ఓపెన్‌ బిల్లుడ్‌ స్టార్క్ప్‌, రంగురంగుల స్టార్క్ప్‌, గ్లోసీ ఇబిసెస్‌, తెల్లటి ఇబిసెస్‌, టేల్స్‌, పిన్‌టైల్స్‌, షోవేలార్స్‌ తదితర రకాలు, ఇతర దేశాలనుంచి వచ్చే వలస పక్షులు రెడ్‌ క్రెస్టెడ్‌ పాచార్డ్స్‌, నలుపు రెక్కలుంటే స్టిల్ట్స్‌, అవోసెట్స్‌, కామన్‌ రెడ్‌ షాంక్స్‌, నైజియన్స్‌, గద్వాల్‌, కార్మోరెంట్స్‌, గార్గ్‌నీస్‌, హెరాన్స్‌, ఫ్లెమింగోలు కనువిందు చేస్తుంటాయి. ఏటా అక్టోబరు నుంచి జనవరి వరకు కనిపించే పక్షులు ఈసారి మార్చి, ఏప్రిల్‌ వరకు ఉండేలా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం కొల్లేరులో ఏటా రెండు లక్షల పక్షులు ఇక్కడకు వస్తూ ఉంటాయని ఒక అంచనా. 
కొల్లేరులో ఆక్రమణలను, కృత్రిమ సాగును అడ్డుకోగలిగితే వన్యప్రాణుల భవిష్యత్తు మనుగడ కొనసాగుతుంది. కృత్రిమ సాగు, నిబంధనల విరుద్ధంగా చొచ్చుకొస్తున్న చెరువులతో అభయారణ్యంలో పక్షుల మనుగడే ప్రమాదకరంగా మారే పరిస్థితి నెలకొంటుంది. సరస్సు తీరప్రాంతంలోని ప్రజలు దీనిపై దృష్టిని సారించాల్సిన అవసరముంది. దేశ జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కొల్లేరులో జీవవైవిధ్యం క్రమం తప్పుతోంది. కొన్ని రకాల పక్షులు, నల్లజాతి అరుదైన చేపలు అంతరించిపోతే దశకు చేరుకున్నాయి. కృత్రిమ సాగుకు విరామాన్ని ప్రకటించిన రైతులు కొల్లేరు పూర్వవైభవానికి పాటుపడాలని పర్యావరణ వేత్తలు, పక్షుల ప్రేమికులు కోరుకుంటున్నారు.

No comments:

Post a Comment