Breaking News

26/02/2019

ఇక స్మార్ట్ కేంద్రాలు (గుంటూరు)

గుంటూరు, ఫిబ్రవరి 26 (way2newstv.in): 
అంగన్‌వాడీ కేంద్రాలకు సాంకేతిక విజ్ఞానం చేరువవుతోంది. ఇకపై కేంద్రాల నిర్వహణ సమాచారం పూర్తిగా చరవాణిల్లోనే నిక్షిప్తం చేయనున్నారు. సాంకేతిక సేవలతో కేంద్రాల్లో జరిగే అక్రమాలకు చెక్‌ పెట్టనున్నారు. దీనికోసం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఆండ్రాయిడ్‌ ఫోన్లు పంపిణీ చేశారు. అమలుపై సీడీపీవోలు, పర్యవేక్షణాధికారులకు శిక్షణ తరగతులు పూర్తి చేశారు. ఇప్పటికే అంగన్‌వాడీ కార్యకర్తలకు వీటి వినియోగంపై తర్ఫీదు ఇచ్చారు. ఈ నెల నుంచి పథకం అమలు చేస్తున్నారు.
ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పోషకాహారం అందించేందుకు రూ.కోట్లు వ్యయం చేస్తోంది. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం అంగన్‌వాడీ కేంద్రాలతో ముడిపడి ఉంది. అందుకే వీటి బలోపేతానికి అనేక చర్యలు చేపడుతున్నా ఆశించిన మేర ప్రయోజనం ఉండడం లేదు. ఏటా కేంద్రాల నిర్వహణకు భారీగా నిధులు వెచ్చిస్తున్నా పుస్తకాల్లో కనిపించే లెక్కలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. దీంతో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కేంద్రాలు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అనేది తేల్చనున్నారు. తద్వారా ప్రభుత్వంపై అదనంగా పడుతున్న భారాన్ని తగ్గించనున్నారు. 


ఇక స్మార్ట్ కేంద్రాలు (గుంటూరు)

ఇందు కోసం జిల్లాలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి స్మార్ట్‌ ఫోన్‌ అందించారు.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వివిధ పథకాల కింద కోడిగుడ్డు, పాలు, నూనె ప్యాకెట్లతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. అయినా రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు వారిని వెంటాడుతూనే ఉంటున్నాయి. ఇక దస్త్రాల్లోని పిల్లల పేర్లకు, హాజరవుతున్న వారి సంఖ్యకూ తేడా ఉంటోంది. ఇలాంటి అక్రమాల భారం జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలో ఉంటోంది. వీటిని అరికట్టేందుకు ఏ రోజుకారోజు హాజరవుతున్న పిల్లల సంఖ్యను, వారి ఫొటోలను సెల్‌ఫోన్లో తీసి తప్పనిసరిగా ఉన్నతాధికారులకు పంపించాలి. అంతేగాక  పోషకాహారం, పాలు, గుడ్లు, వ్యాధి నిరోధక టీకాలు, ఆహార లోపం, సర్వే, గ్రోత్‌ రిజిస్టర్‌, స్టాక్‌ ఇలా ప్రతి అంశాన్ని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల నిత్యం అంగన్‌వాడీలకు వచ్చే చిన్నారుల జాబితాను రాష్ట్రస్థాయిలో ప్రత్యేక విభాగం పరిశీలిస్తుంది. దీంతో నెలవారీ గణాంకాలు తేలనుండగా తప్పుడు జాబితాలకు అవకాశం ఉండదు. పిల్లల సంఖ్య ఆధారంగా సరకుల సరఫరా జరుగుతుంది.
జిల్లాలో 4405 అంగన్‌వాడీల పరిధిలోని అధికారులకు, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు పూర్తి చేశారు. చరవాణి వినియోగంతోపాటు కేంద్రం పరిధిలో సర్వే ద్వారా సేకరించిన సమాచారం అందుబాటులో ఉంచనున్నారు. కేంద్రాల్లో నిర్వహిస్తున్న పనులు, పిల్లల పేర్లు, కుటుంబ సభ్యుల సమాచారం తప్పనిసరిగా ఫోన్‌లో కనిపించేలా చూడనున్నారు. ఆధార్‌  అనుసంధానంతో ఇతర వివరాలు నమోదు చేసే విధానాన్ని వివరించారు. ప్రతిరోజూ సరఫరా చేసే పౌష్టికాహారం వివరాలతోపాటు ఇతర సమాచారం మొత్తం సెల్‌ఫోన్లో నిక్షిప్తం చేసే వివరాలను శిక్షణ తరగతుల్లో వివరించారు. ఇకపై గతంలో మాదిరిగా పుస్తకాల కట్టలు పట్టుకుని సమావేశాలకు రానవసరం లేదు. సెల్‌ఫోనుతో వస్తే సరిపోతుంది.

No comments:

Post a Comment