Breaking News

22/02/2019

నింబంధనలెక్కడ..? (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 22 (globelmedianews.com):..జిల్లాలో అపార్ట్ మెంట్లు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఎటు చూసినా భవనాలే కనిపిస్తున్నాయి.  కానీ వాటిలో అగ్నిప్రమాదం సంభవిస్తే అవసరమైన రక్షణ చర్యలు లేని పరిస్థితి.. ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మించడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటే పెద్ద మొత్తంలో నష్టం జరుగుతోంది.. కనీసం ప్రమాదం జరిగితే మంటలు ఆర్పేందుకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసుకోవడం లేదు.. ఆస్పత్రులు.. పాఠశాలలు.. దుకాణ సముదాయాలలో అగ్నిప్రమాదం జరగకుండా, జరిగితే చేపట్టాల్సిన రక్షణ చర్యలపై దృష్టి పెట్టడం లేదు..


నింబంధనలెక్కడ..? (మహబూబ్ నగర్)

మహబూబ్‌నగర్‌, నారాయణపేట పురపాలిక పరిధిలో 180కి పైగా అపార్టుమెంట్లు ఉన్నాయి. ఇందులో అయిదు అంతస్తులలోపు ఉన్న భవనాలు ఎక్కువగా ఉండగా, కొన్ని మాత్రమే అయిదు అంతస్తులకు మించి ఉన్నాయి. వీటికి తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కాని ఒక్కరు కూడా అనుమతి తీసుకోవడం లేదు. ఇక అపార్టుమెంట్‌ నిర్మాణం సమయంలో స్థలం వైశాల్యం బట్టి 1.5 మీటరు నుంచి 7 మీటర్ల వరకు సెట్‌ బ్యాక్‌ తీసుకోవాలి. కాని ఎవరూ తీసుకోవడం లేదు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి వాహనం వచ్చి మంటలు ఆర్పేందుకు వీలుగా ఉండాలనే ఆలోచనతో ఈ నిబంధన పెట్టారు. కాని ఒక్కరంటే ఒక్కరు కూడా సెట్‌బ్యాక్‌ తీసుకొని నిర్మాణాలు చేయలేదు. జిల్లా కేంద్రంలోని మోడ్రన్‌ బేకరీలో ఇటీవల ప్రమాదం జరిగిన సమయంలో ఇలాంటి సమస్య ఉత్పన్నం కావడంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇక అయిదు అంతస్తుల అపార్టుమెంట్లలోనూ మంటలు వస్తే ఆర్పేందుకు పరికరాలు పెట్టుకోవడం లేదు.
 వ్యాపార సముదాయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లా కేంద్రంతో పాటు నారాయణపే ప్రాంతాల్లో రహదారి పొడవునా పెద్ద సంఖ్యలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. చాలా వరకు జీ+4 అంతస్తుల భవనాలు ఉంటాయి. అయితే వీటికి సెల్లార్‌ తప్పనిసరిగా ఉండాలి. కాని ఒక్క చోట కూడా వాహనాలు నిలిపేందుకు సెల్లార్‌ ఉండదు. వాహనాలు నిలిపే సెల్లార్‌లలో కూడా దుకాణాలు నిర్మించి  అద్దెకు ఇస్తున్నారు. వీటిని పరిశీలించాల్సిన మున్సిపల్‌ అధికారులు చూసీ చూడనట్లు ఉంటున్నారు. వీటిపై పరిశీలన చేసి చర్యలు తీసుకునేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు వెళితే మున్సిపల్‌ అధికారులకు లేని ఇబ్బంది మీకెంటని, మున్సిపల్‌ అనుమతి ఉంటేనే నిర్మాణం చేశామని చెప్పడంతో పాటు రాజకీయంగా ఒత్తిడి తీసువస్తున్నారు. ఫలితంగా అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారు. కాంప్లెక్స్‌లలోని దుకాణాల్లో మంటలు వస్తే ఆర్పేందుకు పరికరాలు సైతం లేవు.
 జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం విధించిన నిబంధన కలిసి వచ్చింది. ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులు జీ+4 అంటే 15 మీటర్లకు మించి ఎత్తు ఉంటే అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవాలి. కాని జిల్లాలో ఇలా ఉన్న ఆస్పత్రులు కేవలం నాలుగు మాత్రమే. మిగతా ఆస్పత్రులు 15 మీటర్ల ఎత్తు కంటే తక్కువగానే ఉంటాయి. దీంతో అగ్నిమాపకశాఖ అనుమతి తీసుకోవడం లేదు. ప్రమాదాలు జరిగితే తక్షణం స్పందించేలా రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. చాలా ప్రైవేటు ఆస్పత్రులు ఇరుకు గదులు, చిన్న చిన్న ఇళ్లలో ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. వాటిలో కరెంట్‌ వైరింగ్‌, ఇతర సదుపాయలు సరిగ్గా ఉండవు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే బయటికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొన్ని ఆస్పత్రులైతే వాహనాలు నిలిపే సెల్లార్‌లలో సైతం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది.
 ఏదైనా భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చే సమయంలో నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని పురపాలిక అధికారులు పరిశీలించడం లేదు. దీంతో ఇరుకు గదులు, మెట్లు నిర్మిస్తూ ప్రమాదాలు జరిగినప్పుడు నష్టం ఎక్కువ కావడానికి కారణమవుతున్నారు. పురపాలక, అగ్నిమాపకశాఖ అధికారులు సమన్వయంతో పని చేసి రక్షణ చర్యలు చేపడితే ప్రమాదాలు జరగకుండా నివారించడంతోపాటు, జరిగినప్పుడు నష్ట తీవ్రత తగ్గించుకోవచ్చు.

No comments:

Post a Comment