Breaking News

22/02/2019

ఆరోగ్య రక్ష ఎక్కడ.. (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, ఫిబ్రవరి 22 (way2newstv.in): 
మారుమూల గ్రామాల్లో నివసించే గిరిపుత్రులకు పౌష్టికాహారం అందక రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన గిరిజన సంక్షేమశాఖ వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు సన్నద్ధమైంది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడతో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడటంపై దృష్టి సారించింది. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వైద్యబృందం వచ్చి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పరీక్షలు నిర్వహించగా.. రక్తహీనత ఉన్నవారే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వాటిని అధిగమించేందుకు ప్రతి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య సమన్వయకర్తను నియమించి, ఔషధాలు అందుబాటులో ఉంచి ప్రాథమిక ఆరోగ్యసేవలు అందిస్తున్నారు. వారికి ట్యాబ్‌లను అందజేసి వాటి ద్వారా ఆరోగ్యస్థితిని తెలుసుకొని నేరుగా హైదరాబాద్‌ సంక్షేమ భవన్‌లోని ప్రత్యేక ఆరోగ్యకేంద్రం ద్వారా చికిత్సలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.


ఆరోగ్య రక్ష ఎక్కడ.. (ఆదిలాబాద్)

జిల్లావ్యాప్తంగా 54 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉండగా అందులో బాలికలకు 17, బాలురకు 37 పాఠశాలలున్నాయి. మొత్తం 18,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 10,553 మంది విద్యార్థులకు హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉండి రక్తహీనతతో బాధపడుతున్నారు. దంత సమస్యలతో 1061, కంటి సమస్యలు 109, చర్మ సమస్యలతో 40 మంది బాధపడుతున్నట్లు ఆరోగ్య పరీక్షల ద్వారా  నిర్ధరించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 24 గంటల పాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని సమీక్షించి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆరు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల రక్త నమూనాలు, దంత, కంటి సమస్యలపై వివరాలు సేకరించింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం జిల్లాలో పర్యటించి.. విద్యార్థుల ఆరోగ్య వివరాలను సేకరించి గిరిజన సంక్షేమశాఖకు అందించింది. ఒక్కో గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థుల పేరు, చిరునామాలతో పాటు రక్తనమూనాలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించి వారి వివరాలు సేకరించారు. వైద్యపరీక్షల్లో సేకరించిన వివరాల ప్రకారం వారి ఆరోగ్యస్థితి ఈ కార్డుల్లో నమోదవుతుంది. విద్యార్థికి వైద్యం అవసరమైనప్పుడు ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా సదరు విద్యార్థి ప్రాథమిక ఆరోగ్య వివరాలు, వారి అనారోగ్య పరిస్థితిని సులువుగా తెలుసుకునే వీలుంటుంది. ఈ ప్రక్రియ అంతా హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌లోని ప్రత్యేక ఆరోగ్యకేంద్రంలో ఆన్‌లైన్‌లో నమోదైనట్లు గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారులు తెలిపారు.
గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఈ విద్యాసంవత్సరం జూన్‌ ప్రారంభం నుంచి ప్రతి పాఠశాలలో ఆరోగ్య సమన్వయకర్తను నియమించింది. ఇందులో టెస్టింగ్‌ టేబుల్‌, సిక్‌బెడ్‌ వంటివి అందుబాటులో ఉంచారు. ప్రతి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సిక్‌రూం పేరిట ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి గిరి విద్యార్థులకు ప్రాథమిక వైద్యసేవలు అందిస్తున్నారు. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు, ఎలర్జీ, కడుపునొప్పి, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలకు ఔషధాలను అందించి నయం చేస్తున్నారు. హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్న వారిని గుర్తించి ఆయా మోతాదులో ఔషధాలు అందించి రక్తహీనతను అధిగమించేలా చూస్తున్నారు. వారికి త్వరలో హెల్త్‌కిట్స్‌ కూడా అందించనున్నారు. అందులో స్టెతస్కోప్‌, బీపీ నమోదు చేసే పరికరం, వెయిట్‌ మిషన్‌, శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్‌ వంటివి ఉంటాయి. వారికి అందించిన ట్యాబ్‌ల ద్వారా సాంకేతికతను ఉపయోగించి విద్యార్థుల క్లిష్టమైన ఆరోగ్య సమస్యలపై వీడియో కాల్స్‌ ద్వారా అనారోగ్యం బారినపడిన విద్యార్థులను పరీక్షిస్తారు. హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌లో గల ప్రత్యేక ఆరోగ్య కమాండ్‌ కేంద్రం ద్వారా అక్కడి వైద్యులు వారిని ట్యాబ్‌ల ద్వారా పరిశీలించి, వారి అనారోగ్య స్థితిని తెలుసుకొని అక్కడి నుంచి ఆరోగ్య సూచనలు అందిస్తారు. ఈ కేంద్రం ద్వారా 24గంటల పాటు సేవలు అందిస్తారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటే సమీపంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని ప్రధాన ఆసుపత్రుల వివరాలు సూచించి అక్కడ వైద్య చికిత్సలు అందించేలా సూచనలు చేస్తారు.

No comments:

Post a Comment