Breaking News

26/02/2019

ప్రకటనలకే పరిమితమా..! (ఖమ్మం)

ఖమ్మం, ఫిబ్రవరి 26 (way2newstv.in): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.100కే నల్లా కనెక్షన్‌.. పేదలైతే రూపాయికే ఇస్తామని ఇటీవల ప్రకటించారు. ప్రభుత్వం ప్రజలపై కనికరం చూపుతున్నా.. కొందరు అధికారుల తీరుపై దీనికి భిన్నంగా ఉంటోంది. నల్లా తీసుకోవడానికి అవసరమైన అన్ని పత్రాలు ఉన్నా కనెక్షన్‌ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఉన్నత వర్గాలు, దారిద్య్ర రేఖ కింద జీవిస్తున్న వారు అనే తేడాల్లేవు. అందరూ ఆ విషయంలో సమానులే. ఆన్‌లైన్‌ పద్ధతి వస్తే నల్లా తీసుకోవడానికి ఖర్చు తగ్గుతుందని అనుకుంటే ఖర్చులు పెరగడంతోపాటు భారమవ్వడంతో పట్టణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజలకు పారదర్శకమైన, సులభతరమైన, వేగవంతమైన సేవలను అందించడానికి పురపాలకశాఖ 2017 మేలో ఆన్‌లైను పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రారంభంలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను అందజేయడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సేవలను పొందాలంటే మరోదారి లేకపోవడంతో ఆన్‌లైన్‌లో నల్లాలకు సంబంధించిన దరఖాస్తులను పంపారు. త్వరగా సేవలంటూ ప్రారంభమైన ‘ఈ’ పద్ధతిలో దరఖాస్తుల పరిష్కారం నానాటికి ఆలస్యం అవుతున్నాయి.


 ప్రకటనలకే పరిమితమా..! (ఖమ్మం)

ఉభయ జిల్లాల్లోని ఓ నగరపాలకం, అయిదు పురపాలకాల్లో మొత్తం 1,767 నల్లాల దరఖాస్తులను అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించారు. అందులో 518 నల్లాలకు మాత్రమే అనుమతులు లభించాయి. అధిక శాతం దరఖాస్తులన్నీ పురపాలకంలోని ఇంజినీరింగ్‌ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లుగా ఆన్‌లైన్‌ రిపోర్టులు చెబుతున్నాయి. వీటికి సంబంధించి ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? ఎప్పుడు పరిష్కారమవుతాయి? అనే విషయాలు అంతుచిక్కని ప్రశ్నలు. ఏ స్థాయిలో అనుమతులు ఆలస్యం అవుతున్నాయో అర్ధం కాని విషయం. ఆన్‌లైన్‌లో అనుమతులు ఆలస్యం అవుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రెండు జిల్లాల్లోని పట్టణవాసులు నల్లా తీసుకోవాలంటే ఆన్‌లైన్‌ విధానం ద్వారానే అనేది తెలియకపోవడంతో రెండేళ్లు గడిచినా దరఖాస్తులు మాత్రం తక్కువుగానే వచ్చినట్లుగా తెలుస్తోంది. పురపాలకాలు వీటిపై పూర్తిస్థాయిలో ప్రచారం చేయకపోవడం కూడా ఓ కారణమే. నిబంధనల ప్రకారం దరఖాస్తుదారునికి అన్ని గుర్తింపు పత్రాలు, వ్యక్తిగత పత్రాలు, ప్లాను సవ్యంగా ఉంటే 15 రోజుల్లోనే అనుమతి ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో మాత్రం 60 రోజులు దాటినా పరిష్కారానికి నోచుకోకపోవడం కొసమెరుపు. దీంతో పట్టణాల్లో పంపు ఆపరేటర్లు, ఫ్లంబర్‌తో బేరం కుదుర్చుకుని అక్రమంగా నల్లాలను తీసుకుంటున్నారు. దీంతో నల్లాబిల్లులు చెల్లించే పరిధి నుంచి తప్పించుకుంటున్నారు.
కొత్త నల్లా కోసం దరఖాస్తు వచ్చిందంటే కొందరు పురపాలక అధికారులకు, సిబ్బందికి పండగే. వినియోగదారుల పైపులు, క్లాంపులు కోసం రూ.2-3 వేలు, అదనపు ఖర్చుల పేరిట మరో రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనెక్షన్‌ ఛార్జీల పేరిట పురపాలకాలకు చెల్లించిన దానికంటే కొన్నిసార్లు ఈ అదనపు బాదుడే ఎక్కువుగా ఉంటుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వినియోగదారులు పురపాలక సిబ్బందిని ప్రశ్నిస్తే నల్లా కనెక్షన్‌ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేయడం పరిపాటైంది. వాణిజ్య కేటగిరీలో వచ్చే నల్లాలను కూడా గృహావసరాల కేటగిరీలో చూపించి నల్లా మంజూరులో మాయ చేస్తున్నారు
తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారికి రూపాయి నల్లా కనెక్షన్‌ కొనసాగిస్తూనే దారిద్య్ర రేఖకు ఎగువున(ఏపీఎల్‌) ఉన్నవారికి రూ.100కే  కనెక్షను ఇవ్వాలని నిర్ణయించారు. వాస్తవంగా అయితే ఏపీఎల్‌కు చెందిన వారు పురపాలకం నుంచి నల్లా తీసుకోవాలంటే అధికారికంగానే రూ.16,500 వరకు ఖర్చు చేయాలి. ప్లంబరు, ఆపరేటరుకు పై ఖర్చులుగా మరో రూ.4వేలు మొత్తంగా రూ.20వేల వరకు ఖర్చు చేస్తే నల్లా వచ్చేస్తుంది. ఇంత ఖర్చును కేవలం రూ.100కే కుదించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి భగీరథ నీళ్లు చేరాలి.. సురక్షితమైన నీటిని అందిచాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ అవకాశం ఎంతవరకు మేలు చేస్తుందో చూడాలి.

No comments:

Post a Comment