Breaking News

25/02/2019

సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఫెడరల్ ఫ్రంట్..?

హైద్రాబాద్, ఫిబ్రవరి 25, (way2newstv.in)
తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ సంగ్రామం, త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆపై లోక్‌సభ పోరు ఇలా వరుసగా ఎన్నికలు ఉండడంతో ఈ పరిస్థిని నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి, ముందుస్తు ఎన్నికలకు వెళ్లిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని టీఆర్ఎస్.. ఘన విజయం సాధించింది. ఊహించని విధంగా ఆ పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది. 119 స్థానాలకుగానూ 88 చోట్ల విజయం సాధించి, ప్రతిపక్షాలను చిత్తు చేసింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రజాకూటమి ఘోర పరాభవాన్ని చవి చూసింది. ఫలితాలు వచ్చిన రెండు రోజులకే వరుసగా రెండోసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు.


సార్వత్రిక  ఎన్నికల తర్వాతే ఫెడరల్ ఫ్రంట్..?

ప్రమాణ స్వీకారం తర్వాత కేసీఆర్.. తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు, ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం కూడా చేయించకుండానే ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాల్లో పర్యటించి, ఆయా ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు.ఈ భేటీల తర్వాత ‘ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం.. కేంద్రంలో చక్రం తిప్పుతాం’ అని పలుమార్లు స్పష్టం చేశారు. అయితే, తాజాగా దీనిపై కేసీఆర్ యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది. కేటీఆర్ మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. ‘‘జాతీయ పార్టీలు సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మళ్లీ మోదీనే గెలుస్తారన్న విశ్వాసం ఉంటే ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు.? పుల్వామా దాడి విషయంలో బీజేపీ లబ్ది కోసం ప్రయత్నిస్తోంది. భావోద్వేగాలతో గెలుపు సాధ్యం కాదు. ‘తెలంగాణ ప్రజలు ఢిల్లీని శాసిద్దాం’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తోంది. లోక్‌సభ అభ్యర్థులను సీఎం ఖరారు చేస్తారు. గతంలో 2 ఎంపీ సీట్లతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ ఎంఐఎంతో కలిసి 17 సీట్లు గెలిస్తే రాష్ట్రానికి కావాల్సిన వాటిని సాధించలేమా.? ఎంపీ స్థానాలు గెలిచాక, ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ స్థాయిలో పొత్తులు, వాటిని బట్టే ఫెడరల్ ఫ్రంట్ సమీకరణాలు ఉంటాయి’’ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కేటీఆర్ మాటలను బట్టి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను ఉపసంహరించుకున్నారన్నది స్పష్టమవుతోంది.

No comments:

Post a Comment