Breaking News

24/08/2018

17 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ

విజయవాడ, ఆగస్టు 24, (way2newstv.in)
ఏపీలో రూ.17వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు అంతర్జాతీయ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి, సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ ముఖ్య ప్రతినిధులు సమావేశం అయ్యారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సి ఉంది. కానీ, కేంద్రం ఆ హామీని నెరవేర్చడం లేదు. కడపలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అధ్యయన సంస్థ మెకన్సీ నివేదిక కూడా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2200 ఎకరాలను కేటాయించింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఇనుప ఖనిజం నిల్వలనూ రిజర్వు చేసి ఉంచింది.ఇటీవలే టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆమరణ దీక్షకూ దిగారు.



17 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ 

 అయినా మోదీ సర్కారులో కదలిక లేకపోవడంతో రాష్ట్ర ఖనిజాభిృద్ధి సంస్థ, ప్రైవేట్‌ సంస్థల కలయికలో జాయింట్‌ వెంచర్‌పై కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇది తెలుసుకొన్న ఒక అంతర్జాతీయ కంపెనీ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ఆసక్తి కనబరిచింది. ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌ను సంప్రదించింది. అయితే తమ సంస్థ పేరును ఎక్కడా వెల్లడించవద్దంటూ ఆ కంపెనీ యాజమాన్యం షరతు పెట్టింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేంతవరకూ సంస్థ పేరును పొక్కనీయబోమంటూ ఆ కంపెనీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. సీఎం చంద్రబాబుతో ఆ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. వనరులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కడపసహా ఇతర ప్రాంతాల్లోనూ ప్లాంటు ఏర్పాటుకు గల అవకాశాలపై అన్వేషణ చేస్తామని వెల్లడించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. భారీస్థాయిలో ఇనుప ఖనిజం నిక్షేపాలున్న కడపలోనే స్టీల్‌ ప్లాంటును స్థాపించేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని ఈడీబీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాయలసీమ యువతకు వేలాదిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెబుతున్నాయి.

No comments:

Post a Comment