Breaking News

23/07/2018

హరిత లక్ష్యం..

మెదక్‌, జులై 23, 2018 (way2newstv.in)  
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకానికి, అటవీ సంపద పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో హరితహారం కార్యక్రమం నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటిస్తోంది. ఇదిలాఉంటే.. హరితహారంలో మెదక్ జిల్లా షేర్ అధికంగానే ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానం 9. మెదక్ లో 20 మండలాలు ఉండగా.. 1.31 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే 38.78 లక్షలు గుంతలు తవ్వారు. వీటిలో మొక్కలు నాటి అవి వృక్షాలుగా ఎదిగేలా పరిపరక్షించాలని నిర్ణయించారు. ఇదిలాఉంటే వర్షాకాలం మొదలైనా ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో అవకాశం ఉన్నచోటే మొక్కలు నాటుతున్నారు. అధికారికంగా హరితహారం కార్యక్రమం ప్రారంభం కాకపోయినా ఇప్పటికే లక్షల మొక్కలు నాటారు. దీంతో మరో నెలలోనే ఈ లక్ష్యాన్ని అందుకునే ఛాన్స్ ఉంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. మొక్కలు నాటాలంటే.. గుంటల తవ్వకం త్వరితగతిన సాగాలి. ఇప్పటికే తవ్విన గుంతల్లో 22.72 లక్షల మొక్కలు నాటారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 24.71 లక్షల గుంతలు ఏర్పాటుచేయించారు. మిగతావి ఇతర శాఖల ఆధ్వర్యంలో తవ్వించారు. లక్ష్యం మేరకు నాటడానికి మరో 40 రోజుల సమయమే ఉంది. వర్షాలు పడే నాటికి గుంతలను సిద్ధంగా ఉంచితే వెంటనే మొక్కలు నాటవచ్చు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే గుంతల తవ్వకం వేగవంతమవ్వాలి.



హరిత లక్ష్యం..

నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ(డీఆర్డీఏ), అటవీశాఖకు లక్ష్యాన్ని నిర్దేశించారు. డీఆర్డీఏ, అటవీశాఖ, విద్య, పురపాలక, వ్యవసాయ, పరిశ్రమలు, ఎక్సైజ్‌, పోలీస్‌, మార్కెట్‌ కమిటీ, పశుసంవర్ధకశాఖ, గనులు, భూగర్భ, మైనార్టీ, ఎస్సీ, ఉద్యాన శాఖలకు లక్ష్యాలను నిర్దేశించి నాటేందుకు చర్యలు తీసుకున్నారు. జూన్‌లో వర్షాలు కురిసిన తర్వాత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోయినా అడపాదడపా పడడంతో మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. దీంతో జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా సంబంధిత అధికారులు రైతులకు టేకు మొక్కలు, బాదం, అల్లనేరేడు, అశోక మొక్కలు అందించనున్నారు. మరోవైపు హరితహారంలో ఇంటింటికి ఆరు, విద్యాశాఖ ద్వారా విద్యార్థులకు ఆరేసి మొక్కలు పంపిణీ చేయనున్నారు. పచ్చదనం పరచుకుంటేనే కాలుష్య కోరల్లో చిక్కుకున్న భూగోళాన్ని రక్షించుకోగలం. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణకూ ప్రాధాన్యత లభించేలా ప్రభుత్వం హరితహారం కార్యక్రమం అమలు చేస్తోంది. ప్రభుత్వ-అధికార యంత్రాంగాలనే కాక ప్రజలనూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ విరివిగా మొక్కలు నాటిస్తోంది.

No comments:

Post a Comment