Breaking News

07/07/2018

జాగ్రత్తలతోనే ఆరోగ్యం పదిలం..

విశాఖపట్నం, జులై 07, (way2newstv.in)   
వర్షాకాలంలో వ్యాధుల విజృంభణ ఎక్కువ. పరిశరాలు ఏమాత్రం శుభ్రంగా లేకపోయినా.. అనారోగ్యాలపాలవడం ఖాయం. గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. పారిశుద్ధ్య కార్యక్రమాలు సజావుగా సాగక.. సకాలంలో వైద్యం అందక పలువురు నానాపాట్లు పడుతుంటారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో అంతా జాగ్రత్తగా ఉండాలని, రోగాల వ్యాప్తిని నిరోధించే చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలిగా గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు.. పట్టణ ప్రాంతాల్లోనూ పారిశుధ్యం లోపిస్తోంది. ఇళ్ల ఎదుట వర్షం నీరు నిలిచి దుర్వాసన వస్తోంది. పారిశుధ్య నివారణ చర్యలు చేపడుతున్నా, మురికి కాలువల్లో చెత్తాచెదారం చేరి ఎప్పటిలాగానే మారుతున్నాయి. పరిసరాల పరిశుభ్రతను పాటించి, యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపడితే వ్యాధులకు తరిమికొట్టే అవకాశం ఉంటుంది. సాధారణంగా వర్షాకాలంలో దోమలు, బ్యాక్టీరియా విజృంభణ వల్ల రోగాలు ఎక్కువవుతాయి. ఈ సీజన్ లో నీటి కలుషితం సైతం ఎఫెక్ట్ చూపుతుంది. కలుషిత నీరు తాగడం వల్ల అతిసారా, దోమలతో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయని పేర్కొంటున్నారు. వాటి నివారణ మార్గాలను ఎప్పటికప్పుడు చేపడితేనే ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.



జాగ్రత్తలతోనే ఆరోగ్యం పదిలం..

దోమల ద్వారా మలేరియా, బోధకాలు, డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు తదితర రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధులు సోకితే చాలాకాలం నీరసించిపోతారు. కోలుకునేందుకు సమయం పడుతుంది. పైగా ఇలాంటి వ్యాధులు సోకితే.. చికిత్స ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది ప్రస్తుతం. నిరుపేద కుటుంబాలైతే అప్పులు చేయాల్సివస్తోంది. అందుకే వర్షాకాలంలోఅత్యంత క్రియాశీలకంగా ఉండే  దోమల విజృంభణకు అడ్డుకట్ట వేయాలని నిపుణులు తేల్చి చెప్తున్నారు. పరిశరాల్లో మురికి నీరే కాక.. వర్షపు నీరూ నిల్వలేకుండా చూసుకోవాలని అంటున్నారు. ఎందుకంటే నిల్వ ఉన్న నీటిలో దోమలు, క్రిమికీటకాదులు గుడ్లు పెడుతాయి. లార్వా, ప్యూపాలు అందులోనే పెరుగుతాయి. పెద్ద దోమలు మాత్రమే సాధారణ వాతావరణంలో ఉంటాయి. మొత్తంగా మురికినీరు దోమల సంతతి అభివృద్ధికి కేంద్రాలు. దాదాపు ఐదు రకాల దోమలు, వివిధ వ్యాధులకు కారణమవుతున్నాయి. వర్షాకాలంలో మలేరియా సోకే ప్రమాదం అధికం ఈ సీజన్ లో చాలామందికి వచ్చే జ్వరం ఇది. నీరు నిల్వ ఉన్న చోట ఆడ ఎనాఫిలస్‌ దోమలు పెరుగుతుంటాయి. ఈ దోమలే మలేరియా వ్యాపింపజేస్తాయి. అందుకే..ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని వ్యాధుల నిరోధానికి తమవంతు చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్న వైద్యలకు చూపించుకుని మందులు వాడాలని స్పష్టంచేస్తున్నారు.

No comments:

Post a Comment