Breaking News

07/07/2018

ప్లాస్టిక్..పెనుభూతం..

ఆదిలాబాద్, జులై07, (way2newstv.in)   
ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి చేటు చేస్తోంది. నాణ్యతలేని ప్లాస్టిక్ సంచుల వల్ల తలెత్తుతున్న నష్టం అంతాఇంతా కాదు. ఈ విషయం తెలిసీ.. కొందరిలో మార్పు రావడంలేదు. ఇక కొన్ని పాలిథీన్ సంచులను నిషేధించినా.. అవీ వాడకంలోనే ఉన్నాయి. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ దుస్థితి. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇలాంటి సమస్యే ఉందని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్థానికంగా ప్లాస్టిక్ కవర్ల వాడకం ఎక్కువైపోయిందని.. దీంతో పర్యావరణం తీవ్రంగా ప్రభావితమవుతోందని వాపోతున్నారు. అటవీ, పర్యావరణ, పరిరక్షణ 1986 చట్టం ఉత్తర్వు 25 ప్రకారం, మున్సిపల్‌ అడ్మినిస్త్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంటు ఉత్తర్వు 128, 158 ప్రకారం 40 మైక్రాన్లు కంటే తక్కువ ఉన్న పాలిథీన్‌ సంచులను వినియోగించ కూడదు. ఈ మేరకు నిబంధనలు ఉన్నాయి. తెలుపు తప్ప ఇతర రంగుల కవర్లు వాడకూడదు. అయితే ఈ రూల్స్ జిల్లాలో సరిగా అమలుకావడంలేదు. నిబంధనలు పట్టించుకోకుండా వ్యాపారులు, ప్రజలు ఇలాంటి కవర్లను విరివిగా వాడేస్తున్నారు. వాస్తవానికి ప్లాస్టిక్ సంచుల వినియోగం తీరుతెన్నులను గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో పురపాలక కమిషనర్లుపర్యవేక్షిస్తారు. చట్టానికి విరుద్ధంగా విక్రయిస్తే స్టాకును సీజ్‌ చేసి న్యాయస్థానానికి హాజరు పరుస్తారు. కానీ జిల్లాలో నిబంధనల అతిక్రమణ ఉన్నా బాధ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.



 ప్లాస్టిక్..పెనుభూతం..

ప్లాస్టిక్ తో పర్యావరణానికి ముప్పు అని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. పర్యావరణానికే కాక జీవకోటికీ ప్రమాదమని చెప్తున్నాయి ఈ మేరకు ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలని కోరుతున్నాయి. అయితే జిల్లాలో అధికార యంత్రాంగం మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాస్టిక్ వాడకంపై సరైన చర్యలు చేపట్టడంలేదు. ఈ విషయంపై పర్యావరణ వేత్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నాణ్యత లేని పాలిథీన్‌ సంచుల వ్యాపారం జోరుగా సాగుతోందని విమర్శిస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో గోడౌన్లలో దాచి ఉంచి పలు దుకాణాలు, హోటళ్లకు తక్కువ మైక్రాన్లు ఉన్న వాటిని విక్రయిస్తున్నారు. రూ. లక్షల్లో వ్యాపారం జరుగుతున్నా సంబంధిత అధికారులు దాడులు, కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవని ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు వాడితే చేకూరే అనర్థాలపై విస్తృత ప్రచారం కల్పించాలని అంతా కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాస్టిక్ ను వాడకుండా ప్రజలు సైతం.. అవగాహనతో వ్యవహరించాలని.. అలాంటి కవర్లు ఇస్తున్న వారిని వారించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment