అమరావతి, జూలై 10 (way2newstv.in)
భారత దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఘన చరిత్ర ఉందని, సుసంపన్నమైన వారసత్వాన్ని కలిగి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సింగపూర్ పర్యటనలో సోమవారం ఆయన ప్రపంచ నగరాల ప్లీనరీ సెషన్‌లో ‘పట్టణీకరణ-నీరు, పర్యావరణం, ప్రజా రవాణా నిర్వహణ’ అనే అంశంపై మాట్లాడుతూ దేశచరిత్రలో అమరావతి స్థానం ప్రత్యేకమన్నారు. రాజధాని నిర్మించడమంటే ఎంతో కష్టసాధ్యమైన పని అని, ఒక వైపు ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబిస్తూనే మరోవైపు ఆధునికత అద్దాలని, ఇది అంత సులువైన అంశం కాదని చంద్రబాబు వివరించారు. రాజధాని అమరావతి ఐదున్నర కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా నిర్మిస్తున్నామని, ఎక్కడా రాజీపడకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాల్లో అమరావతిని నిలపాలన్నదే తమ ధ్యేయమన్నారు. నివాసయోగ్యమైన నగరాల రూపకల్పనలో నీరు, పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడానికి సాంకేతికత, మౌలిక సదుపాయల కల్పన అత్యంత అవసరమని తెలిపారు. నవనగరాల సమాహారంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం కోరుతున్నట్లు తెలిపారు.
ఘనమైన వారసత్వం, ఆధునికత, ప్రాచీనతల సమాహారం అమరావతి ప్రపంచ నగరాల ప్లీనరీలో ముఖ్యమంత్రి చంద్రబాబు
వనరుల నిర్వహణలో సాంకేతికత
వనరుల నిర్వహణలో వైజ్ఞానిక, సమాచార సాంకేతికత మనకు ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాధనాల ద్వారా భూగర్భ, ఉపరితల నీటి వనరులు, ఉష్ణోగ్రతలు, గాలి నాణ్యత తదితర సమాచారాన్నికచ్చితంగా తెలుసుకోవచ్చని, వనరులను సమర్ధంగా వినియోగించి ప్రజలకు మెరుగైన జీవనం అందించడానికి ఈ సమాచారం దోహదపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సమర్థ నిర్వహణ పద్ధతుల ద్వారా తమ రాష్ట్రంలో భూగర్భజలాలను పెంచగలిగినట్లు చంద్రబాబు చెప్పారు. నదుల అనుసంధానం, శుద్ధిచేసి భూగర్భ జలాల పునర్వినియోగం, వ్యర్థ నీటి నిర్వహణ తదితర చర్యలతో మెరుగైన ఫలితాలను సాధించినట్లు ఆయన వివరించారు. అనుసంధానం, జల సంరక్షణ చర్యల ద్వారా తాగునీటికే కాకుండా వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు కూడా తగినంత నీటిని ఇవ్వగలిగే పరిస్థితిని తీసుకొచ్చామని, కరవు ఛాయలను తరమికొట్టామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో ద్రవ, ఘన వ్యర్ధాల నిర్వహణను సమర్థమైన పద్ధతులలో చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. తాము పునరుత్పాదక ఇంథనంపై ప్రధానంగా దృష్టి పెట్టామని, హరిత రాజధాని అమరావతికి ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని, మరిన్ని సదుపాయాలు కల్పించాలన లక్ష్యంతో రాజధానిలో 5-10-15 అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అత్యవసర గమ్యాలను చేరుకోవడానికి 5 నిమిషాలు, సామాజిక అవసరాలకు 10 నిమిషాలు, కార్యక్షేత్రానికి చేరుకోవడానికి 15 నిమిషాలు అనే భావనను అమలుచేస్తున్నామన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు దీర్ఘకాలంలో జీవజాలానికి హానిచేస్తాయన్న ఉద్దేశంతో పైసాపెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, తొలి దశలో 5 లక్షల మంది రైతుల భాగస్వామ్యంతో జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్ వైపు మళ్లించామన్నారు. ఏ పని చేసినా విజయవంతం కావాలంటే అది సమర్థ నాయకత్వం ద్వారానే సాధ్యమవుతుందని, అప్పుడే తలపెట్టిన కార్యక్రమం మరింత సజావుగా, ప్రభావవంతంగా ముందుకు సాగుతుందని సీఎం అన్నారు.
ఇవే పద్ధతులను అనుసరిస్తూ సవ్య దిశలో పయనించడం ద్వారా ప్రపంచంలో నివాసయోగ్యమైన నగరాలను తీర్చిదిద్దుకోవచ్చునని సమావేశానికి హాజరైన నగరపాలకులకు తాను సూచిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
No comments:
Post a Comment