Breaking News

10/07/2018

గ్రామీణానికి ఆర్ధిక చేయూత

జోగులాంబ గద్వాల,జులై 10, 2018 (way2newstv.in)
నగరాలు, పట్టణాలే కాక పల్లెలనూ అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ కృషిచేస్తోంది. దీనికోసం పెద్దమొత్తంలోనే నిధులు వెచ్చిస్తోంది. సంక్షేమ కార్యక్రమాలతో పాటూ అభివృద్ధి పనులనూ వేగవంతం చేస్తూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇకం కేంద్రం కూడా తమ వంతుగా కొంత ఆర్ధిక సహకారం అందిస్తోంది. ఈ క్రమంలోనే పల్లెలకు దన్నుగా ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాకే కాక మొత్తం ఉమ్మడి పాలమూరు అంతటికీ కలిపి సుమారు రూ. 71.54 కోట్లు మంజూరు అయ్యాయి. కేంద్రం నుంచి నేరుగా వచ్చే ఈ నిధులు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఉపయోగపడనున్నాయి.. ఏడాదికి రెండుసార్లు గ్రామ పంచాయతీలకు జనాభా ప్రకారం విడు  దల చేసే ఈ నిధులతో మౌలిక వసతులు సమకూర్చుకోవాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులు ఉమ్మడి జిల్లాకు మంజూరు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం 4080 జీవో విడుదల చేసింది. 



గ్రామీణానికి ఆర్ధిక చేయూత

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని స్పష్టంచేస్తూ నిధులు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది సర్కార్. ఇదిలాఉంటే జిల్లాల్లో జనాభా ప్రకారం కేంద్రం నిధులను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో 29,84,816 మంది ఉన్నారు. ఈ లెక్క ప్రకారం రూ.71.54 కోట్లు విడుదల చేసింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు మొదటి విడత, అక్టోబరు నుంచి మార్చి వరకు రెండో విడతలో కేంద్రం నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులు  గ్రామాలకు అందుతాయి. ఒక్కో వ్యక్తికి రూ.239.63 ప్రకారం నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులను గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే ఈ నిధులతో గ్రామాల్లో మురుగు కాలువలు, సీసీ రహదారుల నిర్మాణం, తాగునీటి వసతి, విద్యుత్తు దీపాల ఏర్పాటు, విద్యుత్తు బిల్లుల చెల్లింపులు లాంటివి చేస్తారు. అంతేకాక పంచాయతీల్లో తాత్కాలిక పద్ధతిపై పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు సైతం ఈ నిధుల్లోంచే ఇస్తారు. అంతేకాక పంచాయతీ భవనం మరమ్మతులు, పర్యవేక్షణ, కార్యాలయ వస్తు సామగ్రికి వ్యయాలూ ఈ నిధుల్లోంచే ఖర్చు చేస్తారు. బోర్ల మరమ్మతులకు సైతం ఈ డబ్బులే వెచ్చిస్తారు.  

No comments:

Post a Comment