Breaking News

20/07/2018

అనంత రైతులకు 765 ట్రాక్టర్లు

అనంతపురం, జూలై 20, (way2newstv.in)
రైతుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పలు పథకాలతో ఆదుకుంటోంది. ఆధునిక సాగును ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఇతర రైతులకు ఇచ్చే రాయితీలను ప్రకటించింది. అయితే పరికరాలు, యంత్రాలను ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో రాయితీ మినహాయించి రైతులు సొమ్ము చెల్లించేవారు. తాజాగా ట్రాక్టర్లకు మినహా.. మిగిలిన పరికరాలు, యంత్రాలకు పూర్తి ధర చెల్లిస్తే.. రాయితీ రైతు ఖాతాలకు నేరుగా జమ చేస్తారు.  రైతు రథం కింద 765 ట్రాక్టర్లను మంజూరు చేశారు. అందులో రిజర్వేషన్‌ కోటా ప్రకారం ఎస్సీలకు 138, ఎస్టీలకు 46, ఇతర రైతులకు 581 కేటాయించారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 50 ట్రాక్టర్లు చొప్పున కేటాయింపులు జరిగాయి.  ఎస్సీలకు 9, ఎస్టీలకు 3, ఇతరులకు 38 చొప్పున లెక్కగట్టారు. కావాల్సిన రైతులు మండల వ్యవసాయాధికారికి దరఖాస్తు చేసుకోవాలి. 



అనంత రైతులకు 765 ట్రాక్టర్లు

దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన జాబితాను జేడీఏకు పంపుతారు. జాబితాను సరిచూసి కలెక్టర్‌ ద్వారా ఇన్‌ఛార్జి మంత్రికి జాబితా పంపితే అనుమతి మంజూరు చేస్తారు. మంజూరు పత్రాలు పొందిన రైతులు, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని రాయితీ ట్రాక్టర్లు పొందాల్సి ఉంటుంది. ఫోర్‌వీల్‌డ్రైవ్‌ (ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న ట్రార్టర్లు)  రూ.2 లక్షలు, టూల్‌వీల్‌ డ్రైవ్‌ ట్రాక్టర్లకు రూ.1.50 లక్షల రాయితీ వర్తిస్తుంది.వ్యవసాయశాఖ ద్వారా యాంత్రీకరణ పథకం కింద పరికరాలు, యంత్రాలు కావాల్సిన రైతులు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వమే రైతు ఖాతాకు రాయితీని జమ చేస్తుంది. ఈ ఏడాది నుంచే కొత్తవిధానం అమలుకు శ్రీకారం చుట్టారు. యాంత్రీకరణ పథకానికి 2018-19లో జిల్లాకు రూ.26.44 కోట్లు మంజూరు చేశారు. అందులో ట్రాక్టర్లకు రూ.11.47 కోట్లు, ఇతర పథకాలకు రూ.13.97 కోట్లు విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 70 శాతం, మహిళలు, చిన్నసన్నకారు రైతులకు 50 శాతం, పెద్ద రైతులకు 40 శాతం చొప్పున రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది.యంత్రాలకు, పరికరాలకు 2,735 యూనిట్లకు రూ.9.97 కోట్లు విడుదల చేశారు. ఆర్‌కేవీవై పథకం కింద రూ.5 కోట్లు యాంత్రీకరణ పథకానికి నిధులు విడుదల చేశారు. వాటి ప్రకారం పరిశీలిస్తే.. 1,350 భూమి చదును, దుక్కి చేసే యంత్రాలకు రూ.405 లక్షలు, 366 విత్తు యంత్రాలకు రూ.161 లక్షలు, 805 పిచికారి యంత్రాలకు రూ.80.5 లక్షలు, 100 అంతరకృషి పరికరాలకు రూ.63 లక్షలు, 50 బహుళపంట నూర్పిడి యంత్రాలకు రూ.31.5 లక్షలు, 64 కస్టమ్‌హైరింగ్‌ సెంటర్లకు రూ.256 లక్షలు కేటాయించారు.రైతులు ముందుగా భూమి వివరాలు అగ్రిమిషనరీ.ఎన్‌ఐసీ.ఇన్‌లో రిజిస్టర్‌ చేసుకుంటే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వస్తుంది. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పొందిన రైతులు ఆన్‌లైన్‌లో డీబీటీ పోర్టల్‌లో వ్యవసాయ పరికరాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో కావాల్సిన పరికరం, కావాల్సిన డీలరును రైతులే ఎంపిక చేసుకోవచ్చు.

No comments:

Post a Comment