Breaking News

20/07/2018

మెదక్ లో పెరిగిన పత్తి సాగు

మెదక్‌, జులై 20,  (way2newstv.in)  
వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో మెదక్ రైతన్నలు పత్తిసాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగు ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 2,10,394 ఎకరాలు. ఇందులో పత్తి విస్తీర్ణం 23,910 ఎకరాలు ఉంటుందని అధికారుల అంచనా. అయితే అంచనాలకు మించి 33,700 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పత్తి పంట వేశారు. వర్షపాతం కొనసాగుతుండటంతో మరో 4-5 వేల ఎకరాల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనావేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఈసారి పత్తి పంట సాధారణ విస్తీర్ణాన్ని మించి సాగైంది. మద్దతుధర పెరగడం వల్లే పత్తి సాగు ఈ స్థాయిలో పెరిగిందని అధికారులు అంటున్నారు. 



మెదక్ లో పెరిగిన పత్తి సాగు

గత సీజన్‌ వరకు పత్తి పంట ధర క్వింటాలుకు రూ.4,020 ఉండేది.  ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు కేంద్రం మద్దతు ధరను రూ.5,150గా నిర్ణయించింది. క్వింటాలుకు రూ. 1,130 పెరిగింది. దీంతో రైతన్నలు పత్తిపంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ధర పెరగడంతోపాటు బీటీ పత్తి విత్తనాలు రావడంతో తెగుళ్ల బెడద తగ్గి మంచి దిగుబడులు వస్తుండటం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు సాగుకు ప్రాధాన్యతనిచ్చారు. ఏటా మొక్కజొన్న సాగు చేసే రైతులు కూడా ఈదఫా పత్తి పంటనే వేశారు. మొక్తజొన్న పంటతో పోల్చితే పత్తికి నీటి అవసరం తక్కువ. ఒకసారి వర్షం పడితే మళ్లీ పదిహేను రోజుల వరకు పడకున్నా ఇబ్బంది ఉండదు. దీంతో మొక్కజొన్న సాగుచేసే రైతులు పత్తి సాగు చేపట్టారు. మద్దతు ధర పెరగడంతో పాటూ.. నీటి అవసరం తక్కువగా ఉంటుందన్న కారణాలతో రైతన్నలు తెల్లబంగారం సాగుపై దృష్టి సారించారు. ఈ సీజన్ లో పత్తి సాగు పెరగడంతో దిగుబడి కూడా భారీగానే ఉండనుంది. నాలుగు లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే.. పంట చేతికి అందిన తర్వాత పత్తి రైతులు నష్టపోకుండా దళారుల మాయాజాలానికి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో గోల్ మాల్ కు అడ్డుకట్టవేయాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.

No comments:

Post a Comment