Breaking News

01/01/2020

టీడీపీలో మూడు రాజ‌ధానుల కాక

విశాఖపట్టణం, జనవరి 1 (way2newstv.in )
రాజ‌ధాని అమ‌రావ‌తి ఎఫెక్ట్‌..రాజ‌కీయ పార్టీల‌ను అల్లాడిస్తోంది. మూడు రాజ‌ధానుల ప్రతిపాదనతో సీఎం జ‌గ‌న్ అన్ని పార్టీల‌నూ సందేహంలోకి నెట్టేశారు. వ్యతిరేకిస్తే ఒక తంటా.. వ్యతిరేకించ‌క‌పోతే.. మ‌రో తంటా అనే విధంగా పార్టీల ప‌రిస్థితి ఉంది. ఇదిలా ఉంటే.. ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో మూడు రాజ‌ధానుల ప్రతిపాద‌న మ‌రింత‌గా కాక రేపుతోంది. అమ‌రావ‌తి ప్రాంతం స‌హా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల టీడీపీ నేత‌లు ఈ ప్రతిపాద‌న‌ను వ్యతిరేకిస్తున్నారు. అదే స‌మ‌యంలో మూడు రాజ‌ధానులతో తమ‌కు న్యాయ రాజ‌ధాని ద‌క్కుతుంద‌ని కాదంటే ఇంకొంచెం ఏదైనా ల‌భిస్తుంద‌ని సీమ ప్రాంతంలో ముఖ్యంగా టీడీపీకి ప‌ట్టున్న అనంతపురం, క‌ర్నూలు ప్రాంత టీడీపీ నాయ‌కులు భావిస్తున్నారు.
టీడీపీలో మూడు రాజ‌ధానుల కాక

దీంతో ఇప్పుడు మూడు రాజ‌ధానుల‌ను వ్యతిరేకిస్తే.. వ్యక్తిగ‌తంగా ప్రజ‌ల నుంచి త‌మ‌పై వ్యతిరేక‌త పెరుగుతుంద‌ని వారు అనుకుంటున్నారు. దీంతో ఒక‌పక్క చంద్రబాబు రాజ‌ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. త‌మ్ముళ్లు మాత్రం సైలెంట్ అయిపోతున్నారు. అడ‌పా ద‌డ‌పా మాట్లాడుతున్నా.. హైకోర్టుకు మించిన విధంగా త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని మాత్రమే వారు కోరుతున్నారు త‌ప్ప.. రాజ‌ధానుల‌కు తాము వ్యతిరేకం అని చెప్పేందుకు ఎక్కడా ఎవ‌రూ సాహ‌సం చేయ‌డం లేదు. ఇక‌, విశాఖ స‌హా ఉత్తరాంధ్ర జిల్లాల నాయ‌కులు ఈ విష‌యంలో త‌ర్జన భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు విశాఖలో రాజ‌ధానిని స్వాగ‌తించారుఅయితే, విజ‌య‌న‌గ‌రం జిల్లా కు చెందిన మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఫైర‌య్యారు. ఇక‌, శ్రీకాకుళం జిల్లాలో కూడా వాడి వేడిగానే ప‌రిస్థితి ఉండ‌డం గ‌మనార్హం. రాజాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి కొండ్రు ముర‌ళి మోహ‌న్ జ‌గ‌న్ నిర్ణయాన్ని వెను వెంటనే స్వాగ‌తించారు. అంతేకాదు, చంద్రబాబును తాను ఒప్పిస్తాన‌ని ఆయ‌న వ‌కాల్తా పుచ్చుకున్నారు. విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌లి వ‌స్తే.. ఉత్తరాంధ్ర జిల్లాల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న చెప్పుకురావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మిగిలిన నాయ‌కులు లోలోన ఆనంద ప‌డుతున్నా..పైకి మాత్రం గంభీరంగా ఉన్నారు. వ‌ద్దని చెబితే.. ప్రజ‌ల‌తో తంటా.. కాదంటే.. అధినేత‌తో తంటా అనేవిధంగా ప‌రిస్థితి ఉండడం గ‌మ‌నార్హం.ఇదిలావుంటే, అవ‌స‌ర‌మైతే.. పార్టీ మారేందుకు తాము రెడీ అంటూ.. కొంద‌రు నాయకులు అనుచ‌రుల వ‌ద్ద చెబుతుండ‌డం ఇప్పుడు అధినేత‌కు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌డం లేదు. దీంతో ఆయ‌న ఎవ‌రినీ ఒత్తిడి చేయ‌డం లేదు. మీమీ అభిప్రాయాలు చెప్పండి.. అంటూ గ‌తంలో ప్రతి విష‌యంలోనూ చంద్రబాబు నాయ‌కుల‌పై ఒత్తిడి తెచ్చేవారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయ‌న ఎవ‌రినీ పిల‌వ‌డంలేదు., వారి అభిప్రాయాల‌ను కోర‌డం లేదు. సో.. మొత్తంగా టీడీపీలో అధినేత ఒత్తిడి చేస్తే.. జంపింగుల ప‌ర్వం స్టార్టవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

No comments:

Post a Comment