Breaking News

07/01/2020

కొల్లేరును కమ్మేసిన కాలుష్యం (కృష్ణాజిల్లా)

కైకలూరు, జనవరి 07 (way2newstv.in): 
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు మంచినీటి సరస్సు కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది.జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన వన్యప్రాణి అభయారణ్య క్షేత్రం గరళంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రకృతి ఒడిలో గలగలపారే నీటి ఉరవడి విషతుల్యంగా మారుతోంది. ప్రశాంతంగా, సహజసిద్ధంగా ఉండే కొల్లేరు పరిసరాలను నమ్ముకుని జీవిస్తున్న మత్స్య సంపదకు,  పక్షిజాతుల పాలిట ప్రస్తుత కాలుష్యం శాపంగా మారింది.  ఇప్పటికే దీనిపై అనేక నివేదికలు ప్రభుత్వానికి అందినా వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రశాంతంగా కనిపిస్తున్న కొల్లేరు నీటిలో భయంకరమైన విషపదార్థాలు విలయతాండవం చేస్తున్నాయి. 
కొల్లేరును కమ్మేసిన కాలుష్యం (కృష్ణాజిల్లా)

సేద్యంలో విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, కృత్రిమ సాగు, పరివాహక ప్రాంతంలో సాగుతున్న ఉప్పునీటి రొయ్యల సాగు, సమీప గ్రామాల్లో నుంచి పెద్దఎత్తున వచ్చి పడుతున్న చెత్తాచెదా రాలు వన్యప్రాణి అభయారణ్య స్వరూపాన్నే పూర్తిగా మార్చేస్తున్నాయి. సరస్సుకు నీటిని తీసుకువస్తున్న డ్రెయిన్లు పూర్తిగా కాలుష్యంతో నిండిపోవడంతో వాటి ద్వారా వస్తున్న మురుగు వల్ల ఇక్కడి నీరు తన సహజత్వాన్ని కోల్పోతోంది. స్థానికంగా ఉన్న చేపల చెరువుల్లో ఇష్టారాజ్యంగా వాడుతున్న రసాయనాలతో పాటు వనామీ రొయ్యల సాగులో వినియోగించే ఉప్పునీటిని శుద్ధి చేయకుండానే సరస్సులోకి విడుదల చేస్తున్నారు. దీంతో సరస్సులోని నీరే కాకుండా భూగర్భ జలాలు సైతం కలుషితమైపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ నీరు తాగేందుకే కాదు.. అందులో పెరిగే చేపలు కూడా ఆహారంగా పనికి రావని నిపుణులు చెబుతున్నారు. దేశంలోనే ప్రాధాన్యమున్న 14 రకాల చిత్తడి నేలల్లో కొల్లేరు నేలలకు ప్రత్యేకత ఉంది. సారవంతమైన ఈ నేలలు ప్రస్తుతం ఉప్పు, రసాయన కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఈ నీటిలోని విషపదార్థాలు కొల్లేరుకు వన్నేతెచ్చిన నల్లజాతి చేపలకు ముప్పుగా తయారవుతున్నాయి. పురుగు మందుల అవశేషాల వల్ల చేపలకు ఆహారమైన పురుగులు లేకపోవడంతో పాటు ఈ విషపదార్థాలు పెరిగినప్పుడు చేపలు చనిపోతున్నాయి. అరుదైన కొరమేను, ఇంగిలాయి, మట్టగిడస, వల్లింకాయ, నాటుగొరక, జెల్ల, బొమ్మిడాయి వంటి నల్లజాతి చేపలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఏటికేడు సరస్సులోని మత్స్య సంపద తరిగిపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో వేల కిలోమీటర్ల దూరం నుంచి సంతానోత్పత్తి కోసం వచ్చే వలస పక్షుల జీవనానికి విఘాతం కలుగుతోంది. ఏప్రిల్‌ వరకూ నీరు ఉండాల్సిన సరస్సు జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ఎండిపోయి, వ్యర్థాల మేటతో పక్షులకు ఆహారం లభించని దుస్థితి దాపురించింది. కనీసం మనిషి కాలు మోపడానికి కూడా అంగీకరించని అభయారణ్య చట్టం పరిధిలో ఉన్నప్పటికీ భారీ స్థాయిలో కాలుష్య కారకాలను డంప్‌ చేస్తుంటే పట్టించుకునే నాథులే కరవయ్యారు.  రెండు జిల్లాల్లోని కాగితం, చక్కెర పరిశ్రమల వ్యర్థాలు, విజయవాడ, ఏలూరు, గుడివాడ పట్టణాల్లోని చెత్తను సైతం సరస్సులోనే డంప్‌ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న కొన్ని పరిశ్రమల నుంచి ట్యాంకర్ల ద్వారా వ్యర్థ రసాయనాలను తెచ్చి పారబోస్తున్నారు. వ్యవసాయంలో వాడే ఆర్గో కెమికల్స్, క్రిమిసంహారకాలతో కలిసిన నీరు సరస్సులోకి చేరుతోంది. మలాథియాన్, క్లోరిఫైరిఫాస్, ఎండో సల్ఫాన్‌ వంటి పురుగు మందులతో పాలిసైక్లిన్లు, హైడ్రోకార్బన్లు, భారీ లోహాల అవశేషాలు ఈ నీటిలో పేరుకుపోతున్నాయి. సమీప గ్రామాల్లోని చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను డంప్‌ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో వాడిన సిరెంజీలు, ఇంజెక్షన్‌ సీసాలు, సెలైన్‌ బాటిళ్లు, ఇతర వ్యర్థాలు కూడా ఇందులోనే వేస్తున్నారు. రోజుకు పది టన్నుల చెత్తను సరస్సుకు చేరుస్తూ సహజత్వాన్ని దెబ్బతీస్తున్నారు

No comments:

Post a Comment