విజయవాడ, జనవరి 7 (way2newstv.in)
ఏపీ ఎన్నికల్లో జనసేన పక్షాన ఒకే ఒక్కడు గెలిచారు. ఆయనే తూర్పుగోదావరి జిల్లా రాజోలు శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరాజయం పాలుకావడంతో గెలిచిన రాజోలు ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ రాష్ట్రంలో సెలబ్రిటీ గా మారిపోయారు. ఆయన ప్రతి చర్య చర్చనీయమే ఇప్పుడు. గెలిచిన తొలిరోజుల్లో వైసిపి సర్కార్ పై పోరాట వైఖరి అవలంబించి దెబ్బతిన్న రాపాక వరప్రసాద్ గత కొంతకాలంగా గేర్ మార్చి అధికార పార్టీకి, జగన్ కి జై కొట్టేస్తున్నారు.అసెంబ్లీ సాక్షిగా, బహిరంగంగా కూడా రాపాక వరప్రసాద్ జగన్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నట్లు వైసిపి నేతలు కూడా చేయలేకపోతున్నారు. అధినేత పవన్ ఏ వ్యాఖ్యలు చేసినా దానికి భిన్నంగా రాపాక వరప్రసాద్ కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది.
పార్టీదో దారి...ఎమ్మెల్యేది మరో దారి
ఇదేమిటి అని ప్రశ్నిస్తే అది తన వ్యక్తిగత అభిప్రాయమని ఒక పార్టీలో భిన్న వాదనలు రావడం తప్పేమీ కాదంటున్నారు. అంతే కాదు రాజధానిగా అమరావతి పై పవన్ వైఖరికి ఆయన సోదరుడు చిరంజీవే భిన్నంగా స్పందించారని తాను మెగాస్టార్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నా అంటూ చెబుతున్నారు. ఇలా ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాల్లో రాపాక రాపాక వరప్రసాద్ జనసేనకు ఏ మాత్రం కలిసి రావడం లేదు. అయినా ఆయనపై పార్టీ అధినేత పవన్ ఎలాంటి చర్యలు చేపట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.రాపాక వరప్రసాద్ పై పవన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటే అది ఆయనకు వరంగా మారుతుందని జనసేన లో ఆందోళన ఉంది. దళిత ఎమ్యెల్యేని సహించలేకే పవన్ గెంటేశారనే ప్రచారం పార్టీని మైనస్ చేస్తుంది. అదీ గాక పార్టీ సస్పెండ్ చేసినా బహిష్కరించినా రాపాక వరప్రసాద్ శాసనసభ్యత్వాన్ని స్పీకర్ ను డిస్క్వాలిఫై చేయాలని కోరే అర్హత జనసేన కోల్పోతుంది. ఉన్న ఒక్క ఎమ్యెల్యే పోతే ఏపీ శాసన సభలో జనసేనకు ప్రాతినిధ్యమే కరువు అవుతుంది. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని రాపాక స్పీకర్ ను కోరి పూర్తి స్థాయిలో జగన్ కి జై కొట్టే అవకాశం ఉందని గ్రహించే ఆయనపై క్రమశిక్షణ చర్యలకు వెనకాడుతుంది జనసేన అధిష్టానం. దాంతో రాపాక వరప్రసాద్ ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, దానికి అధిష్టానం రెస్పాన్స్ ఏమిటి అనేది ఆసక్తికరం అవుతూ వస్తుంది.
No comments:
Post a Comment