నెల్లూరు, జనవరి 07 (way2newstv.in):
పట్టణ పేదలకు సొంతింటి వసతి కల్పించేందుకు ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం మరలా ఊపందుకోనుంది. కొత్త ప్రభుత్వం వచ్చాక గతంలో 25 శాతం లోపు జరిగిన పనులన్నీ ఆపేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటన్నింటికి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్నారు. బిడ్ల దాఖలుకుగాను కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించారు. గత నెల 26వ తేదీన టెండర్లను తెరచి వాటిలో ఎల్-1గా నిలిచిన కాంట్రాక్ట్ సంస్థల అర్హతలను పరిశీలించి పనులను అప్పగించారు. రూ.942.90 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండర్లను పిలవగా.. రూ.839.01 కోట్లకు కోట్ చేసి ఎల్-1గా నిలిచిన సంస్థ పనులను దక్కించుకుంది. మూడో దశ రివర్స్ టెండరింగ్‌తో రూ.103.89 కోట్ల ఆదా అయింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వైఎస్సార్ అర్బన్ హౌసింగ్ పథకాల కింద పట్టణ పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించాయి.
సాకారం దిశగా.. (నెల్లూరు)
ఇప్పటికే జిల్లాకు మొత్తం 58,235 ఇళ్లు మంజూరయ్యాయి. 17,415 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన అన్ని ప్రాజెక్టులను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు ఆగిపోయిన ఇళ్ల నిర్మాణం పనులకు ఇప్పుడు మరలా రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తుండటం తెలిసిందే. జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో జీ-3 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరిలో నిర్మాణాలను చేపట్టారు. లబ్ధిదారులు కొందరు తమ వాటా సొమ్మును కూడా చెల్లించారు. వారంతా సొంతింట్లో అడుగు పెట్టాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు షియర్‌వాల్ టెక్నాలజీతో నిర్మితమైనవే. కొత్త ప్రభుత్వం ఆ టెక్నాలజీకి వ్యయం ఎక్కువ అవుతుందని భావించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం జరగనుందనే దానిపై స్పష్టత రావడం లేదు. నిర్మాణాల్లో కొన్ని పునాదుల స్థాయిలో ఉన్నాయి. షియర్ వాల్ సాంకేతికతకు అనుగుణంగా వాటిని నిర్మించారు. ఒకవేళ వేరే టెక్నాలజీని అవలంభిస్తే ఇప్పటి వరకూ జరిగిన నిర్మాణాలు అందుకు సహకరిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment