Breaking News

03/12/2019

నెల్లూరులో వర్షాలు..

నెల్లూరు డిసెంబర్ 03  (way2newstv.in)
తమిళనాడులో భారీ వర్షాల ప్రభావం జిల్లాపై పడింది. దాంతో నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడుకు దగ్గరగా ఉన్న తడ, సూళ్లూరుపేట, వాకాడు తీర ప్రాంతాల్లో అలల తాకిడి కూడా తీవ్రంగా ఉన్నట్లు అధికారులు అంటున్నారు.జిల్లా వ్యాప్తంగా 37.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో తడలో అత్యధికంగా 95.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా, సూళ్లూరుపేటలో 67.8, నాయుడుపేట 68.6, బాలాయపల్లిలో 47.2, సైదాపురంలో 46.8, డక్కిలి 44.8, వెంకటాచలంలో 46.2, ముత్తకూరులో 48.0. నెల్లూరులో 60.6, పొదలకూరులో 47.0, జలదంకిలో 59.4, బోగోలు 62.6, కలిగిరి 52.2, దగదర్తి 68.6, రాపూరు 42.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 
 నెల్లూరులో వర్షాలు..

అత్యల్పంగా వరికుంటపాడు మండలంలో 9.2 మిల్లీమీటర్లు నమోదైంది. మిగతా మండలాల్లో చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుంచి ఆదివారం అందిన సమాచారం మేరకు 48 గంటలపాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీ వద్ద వరద ప్రవాహం మరింతగా పెరిగింది.బ్యారేజీ వద్ద 35 ఎంసీఎఫ్‌టీల సామర్థ్యానికి 9 మీటర్లు ఎత్తుకు నీటి నిల్వకు చేరుకుంది. దాంతో మూడు గేట్లు ఎత్తివేసి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేశారు. దిగువ ప్రాంతాల్లో తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 500 క్యూసెక్కులు తూపిలి, కల్లూరు, ఇతర చెరువులకు పంపిస్తున్నారు. ముట్టెంబాక, దుర్గవరం, కోడివాక, తిరుమూరు, దుగరాజపట్నం చెరువులకు మరో నాలుగు రోజుల్లో నీటిని నింపేలా చర్యలు తీసుకొంటున్నామని బ్యారేజీ ఏఈ సుబ్బారావు చెప్పారు.2015 నవంబరు తర్వాత ఇంతటి వరద ప్రవాహం రావడంతో వాకాడు, కోట, చిట్టమూరు మండలాల నుంచి పలువురు వచ్చి బ్యారేజీని సందర్శిస్తున్నారు.నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం ప్రాంతాల్లో కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. వెంకటగిరి సమీపంలోని వెలిగొండలో కురిసిన వర్షాలకు నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు నిర్మించిన సోమశిల- స్వర్ణముఖి లింక్‌ కాలువకు ఐదు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో కాళంగి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సువర్ణముఖిలో వరదనీరు చేరడంతో కళకళలాడుతోంది. పాముల కాలువ, కన్నా కాలువ, కరిపేట కాలువ ఉద్ధృతంగా ప్రవహించి నీరంతా పులికాట్‌ సరస్సులోకి చేరుతోంది. తడ మండలం పరిధిలో ప్రవహిస్తున్న కాళంగి నదీపరివాహక ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి.

No comments:

Post a Comment