Breaking News

05/12/2019

సంక్రాంతి తర్వాత మున్సిపోల్స్

హైద్రాబాద్, డిసెంబర్ 5, (way2newstv.in)
లంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, హైకోర్టు సింగిల్ జడ్డి జస్టిస్ ఏ. రాజశేఖర్‌రెడ్డి 2019 నవంబర్ 29 న ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది. కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ వార్డుల విభజన ప్రక్రియ చేపట్టాలంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ డైరెక్టర్ పేరుతో మున్సిపల్ కమిషనర్లకు  లేఖలు జారీ అయ్యాయి. 
సంక్రాంతి తర్వాత మున్సిపోల్స్

రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు ఉండగా, 65 మున్సిపాలిటీల్లో వార్డుల విభజనపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వానికి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. వార్డుల విభజన చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని, వీటిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించేందుకు ఏడు రోజుల గడువు ఇవ్వాలని ఆదేశించారు. వార్డుల విభజనపై ఏ మున్సిపాలిటీలోనైనా అభ్యంతరాలు వస్తే వాటిని ఏడు రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా త్వరలో చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జనవరి మొదటిపక్షంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు ఉండగా, వీటిలో 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగియకపోవడంతో వీటికి తర్వాత ఎన్నికలు జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. మరో ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని ఈ వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పోరేషన్లు ఉండగా ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ కార్పోరేషన్ల గడువు ముగియలేదు. దాంతో మిగతా 10 మున్సిపల్ కార్పొరేషన్లకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలోనే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల కోసం ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయని అధికార వర్గాలు వివరించాయి.మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్ల వివరాలు ప్రభుత్వం నుండి అందిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నాలుగు రోజుల క్రితం హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వు ప్రతి కూడా తమకు ఇంకా అందలేదని ఈ అధికారి వివరించారు.

No comments:

Post a Comment