Breaking News

05/12/2019

సీఎస్ రేసులో మిశ్రా, సోమేష్

హైద్రాబాద్, డిసెంబర్ 5, (way2newstv.in)
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ నెలాఖర్లో రిటైర్ అవుతున్నారు. తొలుత జోషి పదవీకాలాన్ని పొడిగిస్తారా, లేక కొత్త సీఎస్ను నియమిస్తారా అన్నదానిపై కొంత సందిగ్ధత నెలకొంది. కానీ జోషి పదవీకాలాన్ని పొడిగించే పరిస్థితులు కనబడటం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దాంతో కొత్త సీఎస్ ఎవరనేదానిపై చర్చ మొదలైంది. ఉన్నవారిలో సీనియర్లు బీపీ ఆచార్య, బినోయ్ కుమార్ లకు సీఎస్ పదవి దక్కే అవకాశం తక్కువని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న బినోయ్ కుమార్  రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా లేరని అధికారులు చెప్తున్నారు. తర్వాతి సీనియర్ ఐఏఎస్  అజయ్ మిశ్రా సీఎస్ పోటీలో ఉన్నారు. అయితే వచ్చే ఏడాది జులై నాటికి ఆయన రిటైర్ కానున్నారు. 
సీఎస్ రేసులో మిశ్రా, సోమేష్

ఈ ఏడు నెలల కోసం ఆయనకు సీఎస్ గా చాన్స్ ఇస్తారా, లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ అజయ్ మిశ్రా కాకుంటే సోమేశ్ కుమార్ కు పదవి దక్కే చాన్స్ ఉందని అంటున్నారు సీనియారిటీని పరిశీలిస్తే జోషి తర్వాత అజయ్ మిశ్రా ఉన్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మిశ్రా 1960 జూలై 16న జన్మించడంతో ఆయన పదవీ విరమణ 2020 జూలై వరకు ఉంటుంది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న మిశ్రా తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయితే 2020 జూలై వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారుల సీనియారిటీని పరిశీలిస్తే బిబు ప్రసాద్ ఆచార్య (బీపీ ఆచార్య) ప్రథమ స్థానంలో ఉన్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆచార్య ప్రసుత్తం డాక్టర్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. జోషి కన్నా ముందే ఆయనకు సీఎస్ పదవి లభించాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల ఆయనకు అవకాశం ఇవ్వకుండా జోషీని 2018 జనవరిలోసీఎస్‌గా నియమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలుత సీఎస్‌గా పనిచేసిన రాజీవ్ శర్మ పదవీ విరమణ చేయగానే, ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఆ పదవిలోనే ఆయన నేటికీ కొనసాగుతున్నారు. రాజీవ్ శర్మ తర్వాత కే. ప్రదీప్ చంద్ర చీఫ్ సెక్రటరీగా నియామకం అయినప్పటికీ, కేవలం నెలరోజులు మాత్రమే పనిచేశారు. ప్రదీప్ చంద్ర తర్వాత ఎస్‌పీ సింగ్‌ను చీఫ్ సెక్రటరీ పోస్టు వరించింది. ఎస్‌పీ సింగ్ తర్వాత ఎస్‌కే జోషిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు అన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అజయ్ మిశ్రా సీఎస్‌గా నియామకం అయినప్పటికీ, కేవలం ఏడు నెలలే ఉంటారు. మిశ్రా కాకుండా ఇతర పేర్లను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సోమేశ్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. సోమేశ్ కుమార్ 2023 లో పదవీ విరమణ చేస్తారు. వీరు కాకుండా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న బినయ్‌కుమార్, పుష్పా సుబ్రహ్మణ్యం, హీరాలాల్ సమారియా తదితరులు కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారుల్లో సీనియర్లే. తెలంగాణ అటవీ శాఖలో ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేశ్వర్ తివారీ కూడా సీనియర్ అయినప్పటికీ ఆయన మరోమూడు నెలల్లో రిటైర్డ్ అవుతున్నారు. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తే పుష్పా సుబ్రహ్మణ్యంకు అవకాశం రావచ్చని తెలుస్తోంది.

No comments:

Post a Comment