Breaking News

18/12/2019

మూగరోదన (కరీంనగర్)

కరీంనగర్, డిసెంబర్ 18  (way2newstv.in) : 
మూగజీవాలు సరైన వైద్యం అందక సతమతమవుతున్నాయి. చలికాలంలో ఎక్కువగా గొర్రెలు, మేకలకు వచ్చే కాలిపుండు వ్యాధి, పాడిపశువులకు సోకే గాలికుంటు వ్యాధులతో బాధపడుతున్నాయి. పాడిరైతులు, పశు పోషకులు తరచూ పశువైద్యశాలల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పనిచేయని అంబులెన్స్‌లు, వైద్యశాలలో మందుల కొరత, వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో పశువైద్యం గాలిలో దీపంగా మారింది. పల్లెముంగిట పశువులకు సోకుతున్న వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార వైద్యం పనిచేయడం లేదు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున కేటాయించిన అంబులెన్సులు సరైన సమయంలో స్పందించకపోవడంతో ఆటోలు, జీపులు, ఇతర ప్రయివేటు వాహనాల్లో  వైద్యశాలలకు తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 
మూగరోదన (కరీంనగర్)

వైద్య ఆరోగ్య శాఖలో అమలు చేస్తున్న తరహాలో అత్యవసర సేవలు అందించేందుకు పశువుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం 1962 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. నియోజకవర్గానికి ఒకటి మాత్రమే ఉండే ఈ అంబులెన్స్‌ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే పశువుల వివరాలు సేకరిస్తుంది. ఒక్కో వాహనానికి ఒక వైద్యాధికారి, కంపౌండర్‌, అటెండర్‌ సేవలందిస్తున్నారు. పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్‌ వస్తే సంచార వైద్య సిబ్బంది స్పందించడం లేదు. సాధారణంగా ఫోన్‌ చేసిన ఇంటికి వచ్చి పశువులకు ప్రాథమిక వైద్యం, చికిత్స చేయాల్సి ఉంటుంది. అనంతరం స్థానిక గోపాలమిత్రలకు పశువుల సంరక్షణ బాధ్యతలు అప్పగించి, స్థానిక వైద్యశాల నుంచి వ్యాధి నివారణ మందులను ఇచ్చే ప్రక్రియలు చేపట్టాల్సి ఉంటుంది. అత్యవసర పశువైద్య సేవలు పారదర్శకంగా ఉండేందుకు ఈ అంబులెన్సుల్లో జియోట్యాగింగ్‌ అనుసంధానం చేసినప్పటికీ నియోజకవర్గంలో ప్రతిరోజు ఒకటి రెండు కేసుల కంటే ఎక్కువగా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1962 అంబులెన్స్‌లు సకాలంలో స్పందించకపోవడంతో పోషకులు ఆటోల్లోనే పశువైద్యశాలకు తరలిస్తున్నారు. జిల్లాలో పశువులు, గొర్రెలు, మేకలకు సకాలంలో వైద్య సేవలు అందక మృత్యుఒడిలోకి చేరుతున్నాయి. గొర్రెలకు కాళ్లపుండు, సొల్లు రోగం, బద్దె పురుగు వ్యాధి, ఇతర సీజనల్‌ వ్యాధులు పీడిస్తున్నాయి. పశువులకు గాలికుంట, గుండెవాపు, జబ్బవాపు ఇతర దీర్ఘాకాలిక వ్యాధులతో సతమతమవుతున్నాయి. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గానికి ఒక్కో పశువైద్య కేంద్రం, 39 ఉప వైద్యకేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా 39 మంది గోపాలమిత్రలు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో పశువైద్యశాలలో వైద్యాధికారి, కంపౌండర్‌, అటెండర్‌ ఇతర సిబ్బంది ఉండాలి. ఉపవైద్య కేంద్రాల్లో కొన్నేళ్లుగా కంపౌండర్లను నియమించకపోవడంతో అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన సిబ్బంది సమయ పాలన పాటించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పశువులకు సోకుతున్న వ్యాధులకు ఎలాంటి మందులు ఇవ్వడం లేదు. జ్వరానికి, యాంటీబయాటిక్స్‌, ఇతర సూది మందులకు సైతం చిటీ రాసి ప్రయివేటులో తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఒకవైపు రవాణా ఖర్చులతో పాటు మందుల ఖర్చులు పశుపోషకులకు తడిసిమోపడవుతున్నాయి. పశు వైద్యశాలలకు ప్రతి త్రైమాసికంగా విడుదల చేయాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వెటర్నరీ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ఇక నుంచి పశువుల మందుల నిల్వలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మందుల అక్రమ తరలింపును అడ్డుకోవడంతో పాటు వృథా అరికట్టే విధంగా స్థానిక అవసరాలకు తగ్గట్లు మందులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పశుగ్రాస విత్తనాలు కూడా ఈ యాప్‌ నుంచే అవసరాలకు తగ్గట్లు సరఫరా చేయనున్నారు. ప్రతి వైద్యుడి స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను నిక్షిప్తం చేసి దాని ద్వారా ఆన్‌లైన్‌ ఇండెంట్‌ తీసుకుని ఆయా అవసరాలకు అనుగుణంగా మందుల పంపిణీ చేయనుండటంతో పారదర్శకత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

No comments:

Post a Comment