Breaking News

18/12/2019

నిధుల్లేవ్.. పనుల్లేవ్.. (విజయనగరం)

విజయనగరం, డిసెంబర్ 18 (way2newstv.in):   
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేసింది. రూర్బన్‌ శ్యామ్‌ ప్రకాష్‌ ముఖర్జీ పథకం ఆరంభ శూరత్వంగానే కనిపిస్తోంది. సరిగ్గా మూడేళ్ల పాటు ఈ పథకానికి విధించిన గడువు 2020 మార్చినెలతో పూర్తి కానుంది. దాదాపు మూడు నెలల పాటే కాలం మిగిలింది. మరి నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రగతి కనిపిస్తుందా..అంటే లేదనే చెప్పాలి. కేటాయించిన నిధుల్లో ఇంత వరకు 30 శాతం వరకే విడుదలయ్యాయి. ప్రతిపాదించిన పనుల్లో అధిక శాతం పనులు మొదలు కాని పరిస్థితి. నిధుల్లేక పనులు కాక ఈ పథకం నీరసించిపోతుంది. జాతీయ రూర్బన్‌ పథకం కింద రాష్ట్రంలో జిల్లాకు ఒక మండలాన్ని చొప్పున ఎంపిక చేయగా మన జిల్లాకు సంబంధించి గరివిడి మండలానికి చోటుదక్కింది. మండలంలో 50 వేల జనాభా పరిధి గల 20 గ్రామ పంచాయతీలను ఒక క్లస్టరుగా గుర్తించారు. 
నిధుల్లేవ్.. పనుల్లేవ్.. (విజయనగరం)

ఎంపికైన గరివిడి, కోడూరు, గెడ్డపువలస, తాటిగూడ, కె.ఎల్‌.పురం, దువ్వాం, తోండ్రంగి, శేరీపేట, శివరాం, చుక్కవలస, కాపుశంభాం, కొండశంభాం, ఏనుగువలస, ఎం.దుగ్గివలస, గదబవలస, రేగటి, కుమరాం, కె.పాలవలస, వెంకుపాత్రునిరేగ, మందిరవలస పంచాయతీలను సకల వసతులతో పట్టణ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. సిమెంటు రహదారులు, కాలువలు, తాగునీటి వనరుల అభివృద్ది, ఇంటింట కుళాయిలు, భూగర్భ మరుగుపారుదల వ్యవస్థ, సామాజిక భవనాలు, ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలు, వ్యవసాయ గోదాములు, డిజిటల్‌ పంచాయతీలు, పాఠశాలల్లో డిజిటల్‌ తరగతి గదులు వంటి ఎన్నో పనులతో పనులతో గ్రామాలు రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని చెప్పారు. పథకం పూర్తికి విధించిన మూడేళ్ల కాలపరిమితిలో ఇప్పటికే దాదాపు 33 నెలలు కావస్తోంది. మరో మూడు నెలలే గడువు మిగిలి ఉంది. గుర్తించిన పనుల్లో 30 శాతం వరకే పూర్తి చేయగలిగారు. మిగతా మూడు నెలల్లో 70 శాతం పనులు పూర్తయ్యే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా 20 గ్రామాల్లో 101 సిమ్మెంటు రహదారుల నిర్మాణానికి రూ.2.35 కోట్లు ఖర్చు చేశారు. 14 గ్రామ పంచాయతీల్లో డిజిటల్‌ సేవలందించేందుకు రూ.12.47 లక్షలు వెచ్చించారు. గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా గ్రామాల్లో అదనపు నీటి ట్యాంకులు నిర్మాణం, ఇంటింట కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా పనులకు రూ.3.53 కోట్లు నిధులు వ్యయం చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా సీడ్‌ ప్రొసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు రూ.4.25 లక్షలు వెచ్చించారు. ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులకు రూ. 3.60 లక్షలు ఖర్చుచేశారు. గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారి జీవనోపాధికి బాటలు వేసేందుకు అవసరమైన శిక్షణా తరగతుల నిర్వహణకు రూ.1.2 కోట్లు కేటాయించారు. యువతకు కంప్యూటర్‌తో పాటు చేతివృత్తులపై శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ద్వారా శిక్షణ కేంద్ర భవనాన్ని నిర్మించాల్సి ఉంది. రైతాంగం నాణ్యతతో కూడిన అధిక దిగుబడులను సాధించేలా వారికి శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించేందుకు, యాంత్రీకరణ పరికరాలతో ఆధునిక సాగుపట్ల అవగాహన కల్పించడానికి రూ.50 లక్షల నిధులు కేటాయించారు. ఆరు చోట్ల పంట ఆరబోత కల్లాలను నిర్మించాలని ప్రతిపాదించినా ఎక్కడా మొదలకాలేదు. నియోజకవర్గ, మండల స్థాయిలో వ్యవసాయ భవనాలను, రైతులు పండించిన పంటను నిల్వ ఉంచుకునేందుకు గోదాములను నిర్మించాల్సి ఉంది. గ్రామాల్లో 24 సామాజిక భవనాలు, ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాలకు 9 సొంత భవనాలను నిర్మించాల్సి ఉంది. మరుగుదొడ్లతో కూడిన బస్సుషెల్టర్లు 5 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. పశువైద్య సేవలందించేందుకు వెటర్నరీ భవన నిర్మాణం జరగాల్సి ఉంది. 28 అంగన్‌వాడీ కేంద్రాలకు బేబీ టాయిలెట్స్‌తో పాటు నీటి పారుదల వ్యవస్థ సదుపాయం కల్పించాలి. 20 గ్రామాల్లోనూ శ్మశానవాటికల చుట్టూ ప్రహరీల నిర్మాణం, రక్షిత మంచినీటి పథకాల ట్యాంకు చుట్టూ రక్షణగోడలను ఏర్పాటు జరగాలి. 4,500 వరకు నివాసిత గృహాలున్న కొండపాలెం (గరివిడి) మేజరు పంచాయతీలో భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ ఏర్పాటుకు సర్వేచేసి ప్రణాళికలు సిద్ధం చేసినా పనులు మొదలు కాలేదు.

No comments:

Post a Comment