ఏపీ మానవ హక్కుల ఫోరం డిమాండ్
విజయవాడ డిసెంబర్ 7 (way2newstv.in)
దిశ పై దారుణ హత్యాచారానికి పాల్పడ్డ నిందితుల ఎన్ కౌంటర్ పై దేశప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే మానవ హక్కుల సంఘాలు మాత్రం ఈ కేసును సీరియస్ గా పరిగణిస్తున్నాయి. ఇటీవలే నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా స్పందించింది. తెలంగాణ పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.. తాము వచ్చి పరిశీలించే వరకు మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించింది.
ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై హత్యానేరం కింద కేసులు
ఇక మరికొన్ని మానవహక్కుల సంఘాలు కూడా నేరం నిర్ధారణ కాకముందే నిందితులను పోలీసులు హతమార్చడం దారుణమని హైకోర్టులో పిటీషన్లు వేశాయి.తాజాగా ఈ ఎన్ కౌంటర్ పై ఏపీ మానవ హక్కుల ఫోరం కూడా స్పందించింది. ఎన్ కౌంటర్ చేసిన పోలీస్ సిబ్బందిపై హత్యానేరం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. రిమాండ్ ఖైదీలను చంపారని.. ఈ కేసును సుమోటోగా తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. నిందితులు నేరం చేశారని శిక్షలు వేయాల్సింది న్యాయస్థానమని.. పోలీసులు కాదని మానవ హక్కుల ఫోరం వ్యాఖ్యానించింది.ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా న్యాయస్థానాలు చూడాలని.. చట్టాన్ని పోలీసులు చేతుల్లోకి తీసుకోవడం తప్పని ఏపీ మానవ హక్కుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది..
No comments:
Post a Comment