Breaking News

29/11/2019

తెలంగాణ స్కూళ్లలో వాటర్ బెల్

హైద్రాబాద్, నవండర్ 29, (way2newstv.in)
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ‘నీటి గంట’ మోగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో కలెక్టర్ చొరవ తీసుకుని పాఠశాలల్లో నీటి గంట మోగించాలని నిర్ణయం తీసుకోగా, ఇతర జిల్లాల్లో కూడా ఈ విధానం అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. పాఠశాలల్లో నీటి గంట అంశాన్ని పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా కేరళ పభుత్వం పాఠశాలల్లో నీటికి సమయం కేటాయిస్తూ బడి గంట కార్యక్రమాన్ని చేపట్టింది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని ప్రారంభించాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు నాలుగుసార్లు పాఠశాలల్లో ‘నీటి గంట’ మోగించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉదయం 9.30 గంటలు, 11.15 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 3.15 గంటలకు ‘నీటి గంట’ మోగిస్తారు.  
తెలంగాణ స్కూళ్లలో వాటర్ బెల్

ఉన్నత పాఠశాలల్లో ఉదయం 10.05 గంటలు, మధ్యాహ్నం 12.30 గంటలు, మధ్యాహ్నం 2.30 గంటలు, సాయంత్రం 4.10 గంటలకు మోగిస్తారు. ఆ వెంటనే తరగతులకు రెండు నిమిషాలు విరామం ఇస్తారు.పాఠశాలల్లో హాజరు శాతం తక్కువగా ఉండటానికి విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతుండటమే కారణమని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 4 నుంచి 6 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు సరిగా తీసుకోకపోతే డీహైడ్రేషన్‌తో సతమతం కావాల్సి వస్తోంది. ఈ సమస్య పిల్లల్లో అధికంగా కనిపిస్తోంది. స్కూల్‌బ్యాగ్‌తోపాటు లంచ్‌బాక్స్, వాటర్‌బాటిల్ పంపినా నీరు సరిగా తాగడం లేదు. అడిగితే ఖాళీ సమయం దొరకడం లేదని విద్యార్థులు సమాధానం చెబుతారు.ఒక రోజు మొక్కకు నీరు పెట్టకుంటే వాడిపోతాయని కంగారు పడుతాం. శరీరానికి నీరు ఎంతో అవసరం. అనారోగ్యంతో ఆసుపత్రికి తీసుకెళ్లితే నీళ్లు బాగా తాగించండి అని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే నీటి గంట నినాదం తెరమీదికి వచ్చింది.నీటిని తరచుగా తీసుకోవడం వల్ల ప్రతీ అవయవం సక్రమంగా పని చేస్తుంది. రోజులో కనీసం నాలుగు లీటర్ల తీసుకోవాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది. వేసవిలో నీరు తాగుతున్నప్పటికీ శీతాకాలంలో చలి కారణంగా ఆ విషయం తెలియదు. మోతాదులో నీరు తీసుకోకపోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతుంటారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు కూడా తాగు నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఇంటి నుంచి తెచ్చుకున్న నీరు సరిపోని పరిస్థితి ఉంటోంది. పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు లేక పిల్లలు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ బడుల్లో సరైన తాగునీటి వసతులు లేవు.కొన్ని ప్రాంతాలలో పిల్లలు ఇంటి నుంచే లీటర్ బాటిల్‌లో నీరు తెచ్చుకుంటున్నారు. అవే సాయంత్రం వరకు తాగాలి. కొందరు పిల్లలు అరలీటర్ కూడా తాగడంలేదు. నీళ్లు తాగితే తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుండడం కూడా కారణంగా నీరు తాగడం లేదని తెలుస్తోంది. మరోవైపు అధ్వానంగా మూత్రాశాలల నిర్వహణ, కొన్ని చోట్ల అసలే లేకపోవడంతో పిల్లలు నీరు తాగడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా బాలికలకు ఇది పెద్ద సమస్యగా మారింది.పాఠశాలల్లో విరామ సమయాలు ఇస్తున్నా నీటిని తాగేలా ప్రోత్సహించాలి. మూడు గంటలకు ఒకసారి సమయాన్ని కేటాయించాలి. ఈ విషయంలో బాలికలు వెనుకంజలో ఉన్నారు. తాగు నీరు అందుబాటులో ఉంటున్నా మూత్రశాలలకు వెళ్లేందుకు సంకోచించడం వంటి కారణాలతో వెనుకడుగు వేస్తున్నారు. సదుపాయాల లేమి ఇబ్బందులకు గురి చేస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన నీటి వసతి లేదు. వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల ఉన్న నీటిని తాగే పరిస్థితి లేదు. నీటిని తాగేందుకు తరగతి మధ్యలో ఉపాధ్యాయుడిని అడిగితే ఏమైనా అంటాడేమో అనే భావన ఉంది. నీటి గంట మోగించే ముందు ఈ సమస్యలు అధిగమించాల్సిన అవసరం ఉంది.పాఠశాలల్లో నీటిని తాగకుంటే ఆ ప్రభావం పిల్లలపై ఉంటుంది. వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా మూత్రంలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. కిడ్నీలో రాళ్లు, శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఎలక్ట్రోబైట్స్ తగ్గిపోతాయి. మల బద్దకం ఏర్పడుతుంది. అపెండిసైటీస్‌కు అవకాశం ఉంది. జ్వరాలు, నిస్సత్తువ,చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.తరచు నీటిని తీసుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. తరగతుల సమయంలో రోజుకు కనీసం నాలుగుసార్లు విద్యార్థులతో నీళ్లు తాగిస్తే సాధారణ అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. దాంతో విద్యార్థులు తగినన్ని నీళ్లు తాగేందుకు వీలుగా విద్యా శాఖ పాఠశాలల్లో ‘నీటి గంట’ విధానం అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.

No comments:

Post a Comment