మహబూబ్ నగర్, నవంబర్ 29, (way2newstv.in)
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రెండవ అతి పెద్ద ప్రాజెక్టుగా పరిగణిస్తున్న పాలమూరుకు నీటి లభ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీని కింద ఆయకట్టును కుదించి ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నది. దీని కోసం నీటిపారుదల శాఖలో కసర త్తు ప్రారంభమైంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజుకు రెండు టీఎంసీలు తర లించటం ద్వారా 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. సవరించిన అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ. 52,000 కోట్లు ఖర్చవు తుందని అంచనా వేశారు. కర్నాటక లోని ఆల్మట్టి ఎత్తు పెంచటానికి అనుమతిం చటం, పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని రెట్టింపు చేయాలని ఏపీ నిర్ణయించటం వంటి కారణాలతో పాటూ కొన్ని రాజకీయ సమీకరణాలతో పాలమూరు ఎత్తిపోతల పథకం ఆయకటున్టు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
తగ్గనున్న పాలమూరు ఎత్తిపోతల పథకం
ఈ మేరకు డిజైన్‌లో మార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మార్పుల కోసం ఇంజినీర్లకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలిసింది.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు కేవలం ఒక టీఎంసీ తరలించటం ద్వారా 60 రోజుల్లో 60 టీఎంసీల నీటినే వినియోగించుకునే విధంగా ఎత్తిపోతల పథకంలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మొదటి దశలో జంట టన్నెళ్ల బుదులుగా ఒకటే టన్నెల్ పనులు కొనసాగించాలని, ఇప్పటికీ ప్రారంభం కాని పనుల్లో మార్పులు చేయాలని ఇంజినీర్లును ఆదేశించినట్టు తెలిసింది. గతంలో 120 టీఎంసీలు ఎత్తిపోసే విధంగా పాలనా పరమైన ఆదేశాలు జారీ చేయగా వీటిలో డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీలు, జంటనగరాల తాగునీటి అవసరాలకు 20 టీఎంసీలు పోగా మిగిలిన 70 టీఎంసీల నీటితో పూర్వపు పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12,30,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించారు. డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీలు తరలిస్తే పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుందని అధికార పార్టీకి చెందిన పాలమూరు జిల్లా ప్రజా ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. కేవలం 70 టీఎంసీలతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరివ్వటం అసాధ్యమని విశ్రాంత ఇంజినీర్లు కూడా అభిప్రాయపడ్డారు. దీనితో కేవలం పూర్వపు పాలమూరు జిల్లాలోని 7.00 లక్షల ఎకరాలకే ఈ ప్రాజెక్టును పరిమితం చేయాలనే ఆలోచన కూడా వచ్చింది. నాలుగవ దశలోని ఉధండాపూర్ రిజర్వాయర్ నుంచి 760 మీటర్ల ఎత్తులో ఉన్న ఐదవ దశలోని కేపీ లక్ష్మీదేవిపల్లికి నీరు తరలించే ఐదవ దశ పనులను కేవలం సర్వేకే పరిమితం చేశారు. ఫలితంగా పూర్వపు రంగారెడ్డి జిల్లాకు నీరందించే పను లపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా గతంలో చేవె ళ్ల ప్రాంతానికి గోదావరి నీటిని అందించాలనే ప్రతిపాదన జలయజ్ఞంలో ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రీడిజైన్ పేరుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల ప్రాంతాన్ని మినహాయించారు. గోదావరి, కృష్ణా నీటిలో ఏవి వస్తాయో తెలియక రంగారెడ్డి జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు ఆయోమయంలో ఉన్నారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 60 టీఎంసీలకు కుదిస్తే దీనికి ప్రత్యామ్నాయంగా రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలతో పాటూ జంటనగరాల తాగునీటికి కూడా గోదావరి నీరు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రంలోనే ఎత్తైన ప్రదేశంగా ఉన్న కేపీ లక్ష్మీదేవిపల్లికి గోదావరి నీటిని తరలిస్తే దక్షిణ తెలంగాణకు అవసరమైనంత నీరు సరఫరా చేయవచ్చని ఇంజినీర్లు భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని 3.70 లక్షల ఎకరాలకు సాగునీరందించటానికి ప్రతిపాదించిన డిండి ప్రాజెక్టుకు కూడా బస్వాపూర్, శివన్నగూడెం రిజర్వాయర్ల ద్వారా గోదావరి నీటిని అందించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఈ ప్రతిపాదనలపై త్వరలోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి.
No comments:
Post a Comment