డల్లాస్ కు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులు
వినోద్ ను కోరిన అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్
డల్లాస్ నవంబర్ 14 (way2newstv.in)
దక్షిణ అమెరికా ప్రాంతాలకు తెలంగాణ నుంచి ఫార్మా ఉత్పత్తులు సరఫరా చేయాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్, ఫోర్ట్ వర్త్ శాఖ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కోరారు.అమెరికా పర్యటనలో ఉన్న వినోద్ కుమార్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతూ డల్లాస్ చేరుకున్నారు.ఈ సందర్భంగా అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్, ఫోర్ట్ వర్త్ అధ్యక్షులు నీల్ గోనుగుంట్ల నేతృత్వంలోని ప్రతినిధుల బృందం వినోద్ కుమార్ తో సమావేశమైనది. పలు అంశాలపై ఇష్టాగోష్ఠి గా చర్చించారు.
దక్షిణ అమెరికాకు తెలంగాణ ఫార్మా ఉత్పత్తులు
దక్షిణ అమెరికాలో పెద్ద సంఖ్యలో ఎన్నారై లు స్థిర పడ్డారని, భారత సంతతికి చెందిన వారు మాతృ దేశం, ముఖ్యంగా తెలంగాణ లోని హైదరాబాద్ ఫార్మా ఉత్పత్తుల ను ఇష్ట పడతారని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వినోద్ కుమార్ కు వివరించారు.ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కార్గో విమాన సర్వీసుల ద్వారా తెలంగాణ ఫార్మా ఉత్పత్తులను డల్లాస్, ఫోర్ట్ వర్త్ తో పాటు దక్షిణ అమెరికాకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు వినోద్ కుమార్ ను కోరారు.డల్లాస్, ఫోర్ట్ వర్త్, దక్షిణ అమెరికా లో తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున నివాసం ఉంటున్నందున హైదరాబాద్ నుంచి డల్లాస్ కు నేరుగా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు ప్రారంభించడానికి కృషి చేయాలని వారు వినోద్ కుమార్ ను కోరారు.మూడు సార్లు పార్లమెంటు సభ్యులు గా పనిచేసిన అనుభవం ఉండటం, కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి తమ విజ్ఞప్తి ని సాకారం చేయాలని వారు వినోద్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ లో చేయనున్న నూతన విద్యా పాలసీ -2019 చట్టంతో ఇప్పటి వరకు విదేశీ యూనివర్శిటీ లకు దేశంలో ఉన్న నిషేధం తొలగి పోనుందని, ఇది తెలంగాణ కు మహర్దశ కలిగించనుందని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ లో అమెరికా యూనివర్శిటీల ఏర్పాటుకు పూర్తి సహకారాన్ని అందిస్తామని వారు వినోద్ కుమార్ కు హామీ ఇచ్చారు.ఈ ఇష్టాగోష్ఠి చర్చల్లో ఎన్నారై తెలంగాణ ప్రతినిధులు డాక్టర్ దేవయ్య, దయాకర్ పుష్కూర్ , తదితరులు పాల్గొన్నారు. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్, ఫోర్ట్ వర్త్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని సాకారం చేసేందుకు కృషి చేస్తానని బోయినపల్లి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. దక్షిణ అమెరికాకు తెలంగాణ హైదరాబాద్ నుంచి ఫార్మా ఉత్పత్తుల సరఫరా చేసేందుకు ప్రభుత్వంతో చర్చిస్తామని వినోద్ కుమార్ తెలిపారు. ఎయిర్ ఇండియా సర్వీసుల విషయంలో కేంద్ర ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకుంటామని వినోద్ కుమార్ అన్నారు.
No comments:
Post a Comment