Breaking News

14/11/2019

కర్ణాటక రాజకీయాల్లో మరో మలుపు

బెంగళూర్, నవంబర్ 14  (way2newstv.in)
ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకే దళపతి దేవెగౌడ ఎత్తు వేశారా? కర్ణాటకలో ప్రాంతీయ పార్టీ అయిన జనతాదళ్ ఎస్ కు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కన్నా కాంగ్రెస్ ప్రధాన శత్రువు అయింది. 14 నెలల పాటు తన కుమారుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినా కాంగ్రెస్ ను శత్రువుగానే పరిగణిస్తున్నారు. అతి తక్కువ సీట్లు వచ్చినా కాంగ్రెస్ సీఎం ఆఫర్ ఇచ్చినా దేవెగౌడకు కృతజ్ఞతలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.కర్ణాటకలో వచ్చే నెల 5 వతేదీన పదిహేను అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో జనతాదళ్ ఎస్ ఒంటరిగా పోటీచేస్తుందని దేవెగౌడ పునరుద్ఘాటించారు. 
కర్ణాటక రాజకీయాల్లో మరో మలుపు

ఇందుకు రెండు కారణాలను చూపుతున్నారు. ఒకటి తన సొంత పార్టీ జేడీఎస్ ను రాష్ట్రంలో బలోపేతం చేసుకోవడం ఒంటరిగా పోటీచేయడం మంచిదని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. అలాగే మరో అంశం కాంగ్రెస్ ను ఇన్ డైరెక్ట్ గా దెబ్బకొట్టవచ్చన్న వ్యూహం అని పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.కర్ణాటకలో దేవెగౌడ ప్రాంతీయ పార్టీ జేడీఎస్ ను స్థాపించినప్పుడు సిద్ధరామయ్య కీలకంగా ఉండేవారు. ఆయన ఆ తర్వాత దేవెగౌడతో విభేదించి కాంగ్రెస్ లోకి వెళ్లి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ మీదకన్నా దేవెగౌడకు సిద్ధరామయ్య మీదే ఎక్కువ ఆగ్రహం. తన కుమారుడు ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో సిద్ధరామయ్య హస్తం ఉందని ఇప్పటికీ పెద్దాయన నమ్ముతారు. అందుకే ఇక కాంగ్రెస్ తో కుదరదని దేవెగౌడ తేల్చి చెప్పారు.నిజానికి దేవెగౌడకు బీజేపీ కంటే కాంగ్రెస్ లోనే అగ్రనాయకులు మిత్రులుగా ఉన్నారు. వారిని కాదనుకుని బీజేపీ కి మద్దతిస్తానని ప్రకటించడం కూడా పార్టీని రక్షించుకోవడం కోసమే. అయితే దేవెగౌడ ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ సామాజిక వర్గం ఓట్లతో పాటు పార్టీకి అనాదిగా వస్తున్న ఓట్లు చీలితే ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది. కొందరు బీజేపీకే నష్టమంటుండగా, దేవెగౌడ తాజా ప్రకటనతో కాంగ్రెస్ కే నష్టమని చెబుతున్నారు. ఎటూ దేవెగౌడ బీజేపీకే మద్దతిస్తారు కాబట్టి, తమ ఓట్లు బీజేపీకే వేయడం మంచిదని క్యాడర్ కూడా భావిస్తుందంటున్నారు. మరి దేవెగౌడ ఒంటరిపోరాటం ఎవరిని గెలిపిస్తుందో చూడాలి మరి.

No comments:

Post a Comment