Breaking News

01/11/2019

వివేక్ కు కనిపించని ఫ్యూచర్

అదిలాబాద్, నవంబర్ 1, (way2newstv.in)
రాజకీయాల్లో అంతే. ఒక నిర్ణయం కొందరిని అందలం ఎక్కిస్తే… అదే నిర్ణయం మరికొందరిని పాతాళంలోకి తోస్తోంది. ఒకసారి తప్పటడుగు వేస్తే సహజమనుకోవచ్చు. కానీ పదే పదే వేస్తే దాన్ని ఏమంటారు. తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అన్నది వారికే తెలియాలి. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. అలాగే అధికారం కూడా ఎవరికీ శాశ్వతం కాదు. ఈతర్కాన్ని అర్థం చేసుకోకుండా గడ్డం వివేక్ పార్టీలు మారుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఏపార్టీలోనూ ఆయన పట్టుమని పదిరోజులు ఉండని పరిస్థితి.తండ్రి అలాగా….గడ్డం వెంకటస్వామి…. ఆయనకు గుడెసెల వెంకటస్వామిగా పేరు. ఆయన తన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే గడిపారు. 
వివేక్ కు కనిపించని ఫ్యూచర్

అధికారంలో ఉన్నా, లేకపోయినా మరో వైపు చూడలేదు. కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మకమైన నేతగా ఉన్నారు. అలాంటి గడ్డం వెంకటస్వామి మరణించిన తర్వాత ఆయన కుమారులు వేసే రాజకీయ తప్పటడుగులు వారి పొలిటికల్ లైఫ్ ను ఇబ్బంది పెట్టాయి. గడ్డం వెంకటస్వామి పెద్ద కుమారుడు వినోద్ గతంలో కాంగ్రెస్ లో ఉండగా మంత్రి పదవిని నిర్వహించారు. తర్వాత ఆయన అనేకసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు.మరో కుమారుడు గడ్డం వివేక్ 2009 ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం పోరాడారు. ప్రత్యేక రాష్ట్రానికి అడ్డం పడుతున్న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ను వదిలేసి టీఆర్ఎస్ లో చేరారు. అక్కడ ఉండకుండా 2014 ఎన్నికల సమయానికి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో గడ్డం వివేక్ టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ లో కంటిన్యూ అయి ఉంటే మరోసారి ఎంపీ అయ్యేవారు వివేక్.ఇక 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి కాంగ్రెస్ కు రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ లోకి వచ్చారు. టీఆర్ఎస్ లోకి వచ్చినా కేసీఆర్ గడ్డం వివేక్ కు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. అయితే 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం వివేక్ మరో తప్పు చేశారు. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓటమికి పరోక్ష సహకారం అందించారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. దీంతో గడ్డం వివేక్ కు 2019 ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు టీఆర్ఎస్. దీంతో ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిపోయారు. గడ్డం వివేక్ నిలకడలేని మనస్తత్వమే ఆయనను రాజకీయంగా దెబ్బతీసిందని సన్నిహితులు సయితం అంగీకరిస్తున్నారు.

No comments:

Post a Comment