నల్గొండ, నవంబర్ 1, (way2newstv.in)
ఎన్నో ఆశలతో పత్తి సాగుచేసిన రైతుల ఆశలు ఆవిరయ్యాయి. సిరులు కురిపిస్తుందనుకొని ఆరుగాలం శ్రమించి అప్పులు చేసి సాగుచేసిన తెల్లబంగారం చేతికందే దశలో వరుస వర్షాలతో నేలపై పడిపోతోంది. భూమి తడరాకుండా కురుస్తున్న వర్షాల ధాటికి పత్తిపంట తడిసి నల్లబడి పోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు దిగుబడి గణనీయంగా తగ్గిపోతుండగా మరోవైపు పత్తి రంగు మారుతుండటంతో పెట్టుబడులు కూడ తిరిగి రాని పరిస్థితుల్లో తాము చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురవుతున్నారు. గత రెండేళ్లుగా పత్తి పంటకు మంచి ధర పలుకుతుండటంతో ఈ పంటను సాగుచేస్తే భారీ లాభాలు ఆర్జించవచ్చునన్న ఆశతో జిల్లాలో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపారు.
వానలతో నల్లబడిన పత్తి
ఇదే ఆశతో తమకున్న భూములతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని మరి పత్తి వేశారు. ఇప్పుడు అధిక వర్షాలతో కాసిన పత్తి తడిసి అందులోని విత్తనాలు చేలోనే మొలకలేస్తుండటంతో రైతులకు కౌలు డబ్బులు కూడ రాని దుస్థితి నెలకొంది.సూర్యాపేట జిల్లా రైతులు వరి తర్వాత అత్యధికంగా పత్తి పంటనే సాగుచేస్తుంటారు. ఈ యేడు జిల్లావ్యాప్తంగా రైతులు 52,350 హెక్టార్‌లో పత్తిని సాగుచేశారు. ఈ సీజన్ ప్రారంభంలో సకాలంలో వర్షాలు పడకపోవడంతో రైతులు అదునులో వేసిన పత్తి గింజలు మెలకెత్తకపోవడంతో ఒక్కో రైతు రెండు, మూడుసార్ల చొప్పున విత్తనాలు వేశారు. ఆలస్యంగా వరుణుడు కరుణించి వర్షాలు కురియడంతో పత్తి చేలకు జీవం పోసినట్టయింది. భారీ వర్షాలు కురియడంతో జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సాగుచేసిన పత్తి చేలు ఏపుగా పెరిగాయి. దీంతో ఈసారి తమకు ఢోకాలేదని రైతులు సంతోషించారు. పంట చేతికందే దశలో గత ఇరవై రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో చేలోనే పత్తి కాయలు నేలకు వరుగుతున్నాయి. తడిసిపోయి తీసే పత్తిలో ఉన్న గింజలు మొలకెత్తుతున్నాయి. ముసురు వీడక అధిక తేమకారణంగా పత్తి నల్లబడి పోయింది. ఫలితంగా దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. అనుకూల వాతావరణ పరిస్థితులుంటే ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా వరుస వానలతో 5 నుండి 7 క్వింటాళ్లకు దిగుబడి పడిపోయింది. దీంతో ఈ లెక్కన జిల్లాలో 13 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేయగా అందులో సగం కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు. దుక్కి దున్ని నాటి నుండి విత్తనాలు, ఎరువులు, కలుపుతీత, క్రిమిసంహారక మందుల వినియోగం, కూలీల ఖర్చు లెక్కలు వేస్తే ఎకరాకు రైతులకు రూ.20వేల మేర పెట్టుబడి అవుతుంది. అయితే ఈసారి అదునులో వర్షాలు రాకపోవడంతో రెండు, మూడుసార్లు విత్తనాలు వేయడం వల్ల రూ.25 నుండి రూ.30 వేల వరకు వ్యయం చేశారు. పత్తి రంగు మారి నాణ్యత తగ్గడంతో ధర కూడ పలికే అవకాశం లేకపోవడంతో ఈసారి తమకు నష్టాలు ఖాయమంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అది సాధ్యం కాని పరిస్థితుల్లో రంగుమారిన పత్తినైనా మద్దతుధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని తమకు అండగా నిలవాలని కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment