Breaking News

14/11/2019

బీజేపీ, శివసేన రాజీ ఫార్ములా

ముంబై, నవంబర్ 14  (way2newstv.in)
మహారాష్ట్ర రాజకీయాలు శివసేనకు ఒక గుణపాఠంగా చెప్పాలి. రాజకీయాల్లో కుప్పిగంతులకు అవకాశం లేదని మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. శివసేన తనకు తానుగా బలవంతుడనని నమ్మి అన్ని పక్షాల గడపలను తొక్కి పరువును పోగొట్టుకుంది. ఫలితంగా ఇప్పుడు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చింది. శివసేన అంచనాలన్నీ తప్పు అని తేలాయి. తమకు బద్ధవిరోధులైన కాంగ్రెస్, ఎన్సీపీలను నమ్మి మోసపోయిందన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.దాదాపు 35 ఏళ్ల మిత్ర బంధం శివసేన, బీజేపీది. బాల్ ధాక్రే బతికున్నప్పటి నుంచి ఈ బంధం కొనసాగేది. 
బీజేపీ, శివసేన రాజీ ఫార్ములా

తండ్రి ఆశయం మేరకే శివసేన అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానని చెబుతున్న ఉద్ధవ్ థాక్రే అదే బాల్ థాక్రే తీవ్రంగా వ్యతిరేకించిన ఎన్సీపీతో చేతులు కలపడాన్ని శివసైనికులు సయితం అంగీకరిచండం లేదు. కాంగ్రెస్ కావాలనే మద్దతు ఏర్పాటు చేయడంలో తాత్సారం చేసిందన్నది శివసేనకు స్పష్టంగా అర్థమయింది.మరోవైపు రాజకీయాల్లో డక్కామొక్కీలు తిన్న శరద్ పవార్ తన సీనియరీటీని ఉపయోగించి శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోగలిగారన్న అనుమానం కూడా వారిలో ఉంది. నిజానికి శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు బీజేపీని నిలువరించాలంటే వెంటనే ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతిచ్చి ఉండేవి. తొలుత గవర్నర్ దృష్టికి తమ ప్రతిపాదన తీసుకెళ్లిన తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాం గురించి ఆలోచించేవారు. కానీ కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం చర్చల పేరుతో కాలయాపన చేసి గవర్నర్ శివసేనకు ఆ అవకాశం ఇవ్వకుండా అడ్డుకోగలిగారంటున్నారు.ఇప్పుడు శివసేన బీజేపీతో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ కూడా కొంత తగ్గి తమతో కలసి రావాలని పిలుపునివ్వడం ఇందులో భాగమే. ముఖ్యమంత్రి పదవి కోరుకోకుంటే శివసేనతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఇందులో ఎలాటి భేషజాలకు బీజేపీ వెళ్లదు. అదే సమయంలో శివసేన కూడా తన డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. అయితే రాష్ట్రపతి పాలన విధించడంతో ఆరు నెలల సమయం ఆలోచించడానికి ఉంది. మరో వైపు శివసేన కొత్త షరతులు పెట్టడం వల్లనే తాము వెనక్కు తగ్గామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనపై అమిత్ షా స్పందించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 18 రోజులు గడిచినా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాకపోవడం వల్లనే రాష్ట్రపతి పాలనను విధించామన్నారు. అన్ని పార్టీలకూ తగిన సమయమే ఇచ్చామన్నారు అమిత్ షా. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఎవరైనా తగిన బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలనుకుంటే ఆరు నెలల సమయం ఉందని చెప్పారు. తాము ఎన్నికల ప్రచారంలోనే దేవేంద్ర ఫడ్నవిస్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించామని అమిత్ షా గుర్తు చేశారు. అప్పుడు శివసేన అభ్యంతరం వ్యక్తం చేయకుండా, ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త డిమాండ్లు పెట్టిందని, అందుకే శివసేన షరతులకు తాము అంగీకరించలేదని అమిత్ షా స్పష్టం చేశారు ఎప్పుడైనా శివసే, బీజేపీ ఒక్కటయ్యే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.

No comments:

Post a Comment