Breaking News

21/10/2019

నాట్యం బంద్(కర్నూలు)

కర్నూలు, అక్టోబర్ 21  (way2newstv.in): 
ప్రభుత్వ పాఠశాలల్లో ఘల్లుఘల్లుమని మోగిన మువ్వలు మూగబోయాయి. ఈ విద్యాసంవత్సరంలో నృత్యశిక్షణకు అనుమతి లభిస్తుందని ఎదురుచూసిన నృత్యగురువులకు నిరాశే మిగిలింది. నాలుగు నెలలైనా వారి సేవల కొనసాగింపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెలుగువారికే ప్రత్యేకమైన కూచిపూడి నృత్య శిక్షణను రెండేళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. భాషా సాంస్కృతికశాఖ, కూచిపూడి నాట్యారామంల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 197 మంది నాట్య గురువులకు శిక్షణనిచ్చారు. వారు రాష్ట్రంలోని 40 వేల మంది విద్యార్థులకు నాట్యశిక్షణను ఇచ్చారు. ఈ తరగతులు చిన్నారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేవి. ఈ విద్యాసంవత్సరంలో వీరి సేవలను కొనసాగించకపోవడంతో ఆసక్తి ఉన్న విద్యార్థులు నృత్యకళకు దూరమవుతున్నారు. 
నాట్యం బంద్(కర్నూలు)

కూచిపూడి నాట్యారామం ఛైర్మన్‌ కూచిబొట్ల ఆనంద్‌ ఆధ్వర్యంలో సిద్ధేంద్రయోగి, కూచిపూడి నాట్య కళాపీఠం ప్రధానాచార్యులు డాక్టర్‌ వేదాంతం రామలింగేశ్వరశాస్త్రి ‘కూచిపూడి ప్రాథమిక శిక్షణ కరదీపిక’ను పాఠ్యాంశంగా రూపొందించారు. 2017 ఆగస్టులో ప్రభుత్వ పాఠశాలల్లో సాంస్కృతిక అక్షరాస్యతే లక్ష్యంగా నాట్యాన్ని కూచిపూడి నాట్యారామం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపికైన ప్రతి గురువు వారానికి 2 గంటలపాటు 5 పాఠశాలల్లో విద్యార్థులకు నాట్యశిక్షణ ఇచ్చేవారు.. ప్రతి పాఠశాలలో సుమారు 30-40 మంది విద్యార్థుల వరకు నాట్యం నేర్చుకుంటున్నారు. ఒక్కొక్కరు 200 మందికి ఈ కళను నేర్పేవారు. 2017-18లో శిక్షణ పొందిన 200 మందిలో 131 మంది గురువులను మాత్రమే ఎంపిక చేశారు. 2018-19లో అదనంగా మరో 66 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. కూచిపూడి నాట్యగురువులు డాక్టర్‌ వేదాంతం రామలింగశాస్త్రి ఆధ్వర్యంలో నాట్యారామంలో వీరు శిక్షణ తీసుకున్నారు. అందరూ కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో నృత్య విద్యను బోధించేవారు. నాట్యశిక్షణ ఇచ్చేవారికి నెలకు రూ. 12 వేలు గౌరవ వేతనం చెల్లించారు. జిల్లాలో గతేడాది 7 మంది గురువులను నియమించి ఒక్కొక్కరు 5 పాఠశాలల ప్రకారం 35 పాఠశాలల్లో నృత్యవిద్యను నేర్పించారు. 2018-19లో మరో 20 మందిని ఎంపికచేసి శిక్షణను పూర్తి చేయించారు. వీరి ద్వారా మరో 100 పాఠశాలల్లో 4వేల మందికి శిక్షణ ప్రారంభించారు. నృత్యగురువుల సేవలను కొనసాగిస్తారని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. దీంతో పాఠశాలల్లో నృత్యశిక్షణ ఆగిపోయింది. మాకు జీవనోపాధి పోయింది. పాఠశాలల్లో నాట్యశిక్షణను ప్రవేశపెట్టడం వల్ల మన సంస్కృతీ, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం విద్యార్థులకు దక్కుతుంది. పిల్లలకు మంచి నడవడిక, ఆరోగ్యం, చక్కని ఆలోచనా విధానాలు అలవడతాయి.

No comments:

Post a Comment