Breaking News

21/10/2019

భవిష్యత్తుకు భరోసా.. (కరీంనగర్)

కరీంనగర్, అక్టోబర్ 21 (way2newstv.in): 
పుడమి నుంచి నల్లబంగారం వెలికితీసే సింగరేణి.. నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఏటా ఆర్మీ, పోలీసు ఉద్యోగాలకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండగా పౌష్టికాహారంతో పాటు వసతి కల్పిస్తోంది. దీంతో ప్రతిసారీ పదుల సంఖ్యలో యువకులు ఉద్యోగాలు సాధిస్తున్నారు. సింగరేణి రామగుండం-1, 2 డివిజన్లలో నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో తర్ఫీదు పొందిన అభ్యర్థులు 32 మంది ఇటీవలి పోలీసు నియామకాల్లో మంచి ప్రతిభ కనబరిచారు. 
భవిష్యత్తుకు భరోసా.. (కరీంనగర్)

రెండు ప్రాంతాల్లోని శిబిరాల నుంచి 32 మంది కానిస్టేబుళ్లుగా, నలుగురు ఎస్‌ఐలుగా ఉద్యోగాలు సాధించారు. సింగరేణి యాజమాన్యం పోలీసు ఉద్యోగాలతో పాటు ఆర్మీ ఎంపిక పరీక్షలకు కూడా యువతను సన్నద్ధం చేస్తోంది. గతేడాది పోలీసు ఉద్యోగాలకు మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించింది. ఉదయం, సాయంత్రం దేహదారుఢ్యంపై సాధన చేయిస్తూనే రాత పరీక్షలకు సన్నద్ధం చేసింది. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు పరుగు, దేహదారుఢ్యంలో శిక్షణ ఇవ్వడంతో పాటు సాయంత్రం రాత పరీక్షకు సంబంధించిన పుస్తకాలతో సన్నద్ధం చేయించారు. శారీరక శ్రమ కలిగించే కసరత్తుతో పాటు లాంగ్‌, హైజంప్‌లు, షార్టుపుట్‌, 100 మీటర్ల పరుగు, 800 మీటర్ల పరుగు పోటీలు నిర్వహించి అభ్యర్థుల్లో ఆత్మస్థైర్యం నింపారు. ఇందులో కొంత వెనుకంజలో ఉన్న అభ్యర్థులకు సాయంత్రం మళ్లీ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే వారు. రాత పరీక్షకు సంబంధించి జనరల్‌ నాలెడ్జి, కరెంట్‌ అఫైర్స్‌, నిత్యం దినపత్రికలు చదివేలా అలవాటు చేశారు. నిరంతరం చదవడంతో పాటు సాధారణ అంశాలు తెలుసుకోవడం ద్వారా రాత పరీక్షలోనూ ప్రతిభ కనబరచడానికి అవకాశం ఏర్పడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి స్థానికంగా వసతి సౌకర్యం కల్పించారు. పోలీసు నియామకాల్లో పాటించే మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థులను తీర్చిదిద్దారు. 100, 800 మీటర్ల పరుగులో ఎన్ని నిమిషాల్లో గమ్యం చేరుకోవాలో అంతకంటే తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని అధిగమించేలా అభ్యర్థులను తీర్చిదిద్దారు. దీంతో పాటు చినప్స్‌, బైటక్‌లు కొట్టివ్వడం ద్వారా వారిలో సామర్థ్యం పెరిగింది. శిబిరంలో శిక్షణ పొందే అభ్యర్థులకు పౌష్టికాహారం అందజేశారు. ప్రతి అభ్యర్థికి రోజుకు రూ.30 చొప్పున వెచ్చించి గుడ్డు, అరటిపండ్లు, పాలు సమకూర్చారు. ఉదయం దేహదారుఢ్య శిక్షణలో అలసిపోయే వారిలో పౌష్టికాహారం ద్వారా ఉత్తేజం నింపారు. ఇది పోలీసు నియామక పరీక్షల్లో సునాయాసంగా ఎంపిక కావడానికి ఆస్కారం ఏర్పడింది. గతేడాది ఆర్జీ-1, 2 ప్రాంతాల్లో నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాల శిక్షణ శిబిరంలో 250 మందికి సుమారు రూ.3 లక్షల వరకు వెచ్చించారు.

No comments:

Post a Comment