Breaking News

21/10/2019

దిగులు తీర్చిన కృష్ణమ్మ (కృష్ణాజిల్లా)

మచలీపట్నం, అక్టోబర్ 21 (way2newstv.in): 
ఇటీవలి వరకు ఒట్టిపోయిన కృష్ణా నది.. వరదల పుణ్యమాని నీటితో కళకళలాడుతోంది. ఎగువన ప్రాజెక్టుల నిర్మాణంతో కిందకు చుక్క నీరు రాని పరిస్థితుల్లో జీవనది అయిన కృష్ణా ఎండిపోయింది. చివరలో ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తాగు, సాగునీటికి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయకట్టుకు పట్టిసీమ నీరు ఆదుకుంది. గత రెండు నెలలుగా పరిస్థితులు మారాయి. రెండు జిల్లాల్లో పెద్దగా వర్షాలు లేకపోయినా.. ఎగువన కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టులలో సమృద్ధిగా నీరు కనిపిస్తోంది. నదిలో నీటి ప్రవాహం సమృద్ధిగా ఉండడంతో పట్టిసీమ ప్రాజెక్టు మోటార్లను కూడా ఆపేశారు. ఫలితంగా విద్యుత్తు బిల్లు ఆదా కానుంది. 
దిగులు తీర్చిన కృష్ణమ్మ (కృష్ణాజిల్లా)

ప్రకాశం బ్యారేజికి ఇన్‌ఫ్లో అధికంగా ఉండడం వల్ల మిగులు నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. గత రెండు నెలల్లో 567.33 టీఎంసీల మేర నీరు పోయింది. దీని వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. నదికి 661.53 టీఎంసీల మేర నీరు వచ్చింది. కాలువల ద్వారా 94.20 టీఎంసీల నీటిని ఉపయోగించుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సీజన్‌లో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదు అవుతోంది. కృష్ణాలో 17.5 శాతం, గుంటూరులో 10.9 శాతం కురవాల్సిన వానల్లో కొరత కనిపిస్తోంది. అయినా సాగునీటికి ఇబ్బందులు తప్పాయి. గతంలో ఎన్నడూ లేని ఈ ఏడాది ఆగస్టులో కృష్ణా నదికి వరదలు రావడమే కారణం. అంతకు ముందుకు ఏడాదికి మిగులు నీరు ఉంటే గొప్ప అనుకునే పరిస్థితి నుంచి ఎక్కువ రోజులు మిగులు కనిపించింది. గత 60 రోజుల్లో 51 రోజులు నదిలో నీటి ప్రవాహం కనిపించింది. ఈ స్థాయిలో నీరు ఉండడంతో ఎక్కడా కొరత కనిపించలేదు. ఆగస్టు, 13 నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. 2009లో అధికంగా నీరు వచ్చింది. ఈ పరిమాణాన్ని ఈ ఏడాది అధిగమించనట్లు అయింది. అప్పట్లో 506.68 టీఎంసీల మేర నీటిని వృథాగా వదిలారు. ఈ ఏడాది అక్టోబరు, 15 వరకు చూస్తే.. 567.33 టీఎంసీలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎక్కువ రోజులు నీరు బ్యారేజిలోకి వచ్చింది. 2017లో చుక్క నీటిని కూడా కిందకు వదల్లేదు.నదికి ఓ వైపు గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, కొల్లూరు, కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు, రేపల్లె మండలాలు ఉన్నాయి. మరో వైపు కృష్ణా జిల్లాలో పెనమలూరు, కంకిపాడు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలు ఉన్నాయి. నదిలోని నీరు లేక సముద్రంలోని ఉప్పు నీరు ఏటేటా ముందుకు చొచ్చుకువస్తోంది. ఈ పరిస్థితి వరదల కారణంగా మారింది. నదిలో తగినంతగా నీరు ఉండడం వల్ల సముద్ర జలాలు వెనక్కి వెళ్లాయి. గత నాలుగేళ్లుగా కృష్ణా డెల్టాను గోదావరి జలాలే ఆదుకుంటున్నాయి. ఈసారి ఆ అవసరం లేకపోయింది. నిరంతరం బ్యారేజికి ఇన్‌ఫ్లో ఉండడంతో పట్టిసీమ మోటార్లను నిలిపారు. ప్రతి ఏటా సీజన్‌ పూర్తి అయ్యే సరికి గోదావరి నీటిని ఎత్తిపోసినందుకు విద్యుత్తు బిల్లు రూ. కోట్లలో వచ్చేది. ఈసారి ఇప్పటి వరకు కేవలం 21.67 టీఎంసీల మేర మాత్రమే ఎత్తిపోశారు. కేవలం మూడో వంతు మాత్రమే అవసరం వచ్చింది. నదికి రెండు వైపులా ఏడాది పొడవునా పంటలు వేస్తారు. దీంతో నీటి కొరతను అధిగమించేందుకు బోర్ల ద్వారా ఉద్యాన పంటలకు నీటిని అందించాల్సి వచ్చేది. ప్రస్తుతం చాలా రోజులు నీరు పారడం వల్ల భారీగా బోరు బావులు రీఛార్జి అయ్యే అవకాశం ఉంది. భూగర్భ నీటి మట్టాలు పెరుగుతున్నాయి. రెండు నెలల పాటు నదిలో నీరు పారడంతో కనీస నీటి ప్రవాహం పెరిగింది. వర్షం పడకపోయినా నదిలో నిత్యం 5వేల నుంచి 6 వేల క్యూసెక్కుల వరకు ఉంటోంది. దీని వల్ల బ్యారేజిలో నీటి నిల్వలు తగ్గకుండా ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. మరో వైపు సాగర్‌ కుడి, ఎడమ కాలువలకూ నీటిని వదిలారు. వీటి పరిధిలోని ఆయకట్టులోని వృథా నీరు వాగుల ద్వారా తిరిగి కృష్ణా నదిలో వచ్చి కలుస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లో, పులిచింత నుంచి నీటిని విడుదల చేయకపోయినా ఇప్పట్లో ఇబ్బందులు తలెత్తకపోవచ్ఛు

No comments:

Post a Comment