Breaking News

18/10/2019

రాజధానిపై నీలినీడలు

విజయవాడ, అక్టోబరు 18 (way2newstv.in)
రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో అమరావతిపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. రాజధాని విషయంలో గత ప్రభుత్వం శివరామకృష్ణన్‌ కమిటీ సూచనలు పట్టించుకోలేదని, అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. తాజాగా, మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజధానిపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఏ ప్రాంతాభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై అధ్యయనానికే నిపుణుల కమిటీని నియమించామని తెలిపారు. ఈ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి నివేదికను రూపొందిస్తుందని బొత్స స్పష్టం చేశారు. మరో మూడు నాలుగు రోజుల్లో నిపుణుల కమిటీ తన పర్యటనలు ప్రారంభిస్తుందని పేర్కొన్నారు.
రాజధానిపై నీలినీడలు

కమిటీ నివేదికలోని సిఫార్సులపై క్యాబినెట్‌లో చర్చించి, ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. హైకోర్టు విషయంలో రాయలసీమ, అమరావతి, ఉత్తరాంధ్రలో వస్తున్న డిమాండ్లను కూడా కమిటీ పరిశీలిస్తుందని మంత్రి తెలియజేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి కమిటీ అధ్యయనం చేస్తుందని బొత్స వివరించారు.మరోసారి శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను మంత్రి బొత్స ప్రస్తావించారు. ఈ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా.. గత ప్రభుత్వం మంత్రి పి.నారాయణ నేతృత్వంలో కమిటీ వేసి ఆయన సిఫార్సుతో అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుతం తాత్కాలిక సెక్రటేరియట్‌ ప్రాంతంలో వర్షం పడితే ముంపునకు గురయ్యే ప్రమాదముందని అన్నారు. ఇక్కడ ఒక భవనం నిర్మించాలంటే పునాదులు 100 అడుగుల లోతులో తవ్వాల్సి వస్తుందని, దీనికి ఖర్చు చాలా ఎక్కువవుతుందన్నారు. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగమై, అవినీతి చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ఇబ్బందులు ఎదురువుతాయని, వీటన్నింటనీ నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు.అమరావతిలో నిలిచిపోయిన పనుల్లో అవసరమైన వాటి పూర్తిచేస్తామని, అవసరం లేనివి నిలిపేస్తామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ వ్యయం అధికంగా ఉందని, అందుకే పునాది దశలో ఉన్న 50వేల ఇళ్లకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామని బొత్స స్పష్టం చేశారు.

No comments:

Post a Comment