Breaking News

25/10/2019

కమలానికి నో హ్యాపీ

న్యూఢిల్లీ, అక్టోబరు 25 (way2newstv.in)
గెలిచామన్న ఆనందం భారతీయ జనతా పార్టీలో కన్పించడం లేదు. అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిచినా ఆనందంగా మాత్రం లేదన్నది వాస్తవం. ఇందుకు కారణం అధికారాన్ని పంచుకోవడమే. తాజాగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, శివసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల గోదాలోకి దిగాయి. మోదీ, అమిత్ షాలు ప్రచారంలో పాల్గొన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండటంతో సహజంగానే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని బీజేపీ అగ్రనేతలు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. అయినా బీజేపీ ఆశించిన స్థానాలు రాలేదు.మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా 150 స్థానాల్లో బీజేపీ, 124 స్థానాల్లో శివసేన పోటీకి దిగాయి. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం 105 స్థానాల్లోనే విజయం సాధించింది. 
కమలానికి నో హ్యాపీ

శివసేన 64 స్థానాలు దక్కించుకుంది. దీంతో గత ఎన్నికల్లో 122 స్థానాలను బీజేపీ సాధించింది. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. శివసేన విడిగా పోటీ చేసింది. అయితే ఎన్నికల అనంతరం రెండు పార్టీలు కలసి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈసారి బీజేపీ బలం గణనీయంగా మహారాష్ట్రలో తగ్గడంతో శివసేన పెత్తనం సాగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.శివసేన నుంచి ప్రతిపాదనలు బీజేపీ అధిష్టానం ముందుకు వచ్చాయి. చెరి సగం సమయాన్ని పంచుకోవాలని శివసేన నిర్ణయించింది. అంటే ముఖ్యమంత్రులుగా రెండున్నరేళ్లు శివసేన, రెండున్నరేళ్లు బీజేపీ నేత ఉండేలా ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కూడా అంగీకరించని పరిస్థితి. శివసేన బలహీనంగా ఉంటే బీజేపీ పెద్దగా లెక్క చేయదు. గత ఐదేళ్ల కాలంలో మనం అనేక సంఘటనలు చూశాం. కానీ ఇప్పుడు బీజేపీకి సీట్లు తగ్గడం, శివసేన బలం పెరగడంతో దానికి కోరలు వచ్చినట్లయింది.దీంతో బీజేపీ అధికారంలో ఉన్నా శివసేన శాసిస్తుందన్నది విశ్లేషకుల అంచనా. అధికారంలో కలసి ఉన్నప్పుడే శివసేన బీజేపీపై శివాలెత్తేది. వ్యక్తిగతంగా మోదీ, అమిత్ షాలపై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయాలు కూడా బీజేపీకి నెగిటివ్ గా వచ్చేవి. జీఎస్టీ, నోట్ల రద్దు సమయంలో బీజేపీపై శివసేన తీవ్ర విమర్శలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పులి చేతిలో చిక్కిన మేకలా బీజేపీ పరిస్థితి మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి వేరే దారిలేదు. శివసేన డిమాండ్లకు అంగీకరించాల్సిన పరిస్థితి. చెలిమి సజావుగా సాగుతుందా? లేదా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

No comments:

Post a Comment