Breaking News

21/10/2019

ప్రతి శాఖ పైన జగన్ మార్క్...

గుంటూరు, అక్టోబరు 21, (way2newstv.in)
అధికారంలోకి వచ్చాక పాలన ఎవరి ఇష్టం వారిది. ఎవరి స్టయిల్ లో వారు వెళతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యవహారశైలితో పాలన చేస్తున్నారు. నిత్యం ప్రతి శాఖలపై సమీక్షలు చేస్తూ కొత్తనిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి శాఖలోనూ ఏదో ఒక మార్పు తీసుకు వస్తున్నారు. అంతేకాదు సంక్షేమ పథకాలకు ముందుగానే క్యాలండర్ ను రూపొందించుకుని దాని కనుగుణంగా వాటిని అమలు చేస్తున్నారు జగన్.ప్రస్తుతం సంక్షేమ పథకాలు, శాఖల్లో విన్నూత్న మార్పులపైనే దృష్టి పెట్టిన జగన్ ప్రధాన అంశాలను మాత్రం కొంత పక్కన పెట్టారనే చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిత్యం పోలవరం ప్రాజెక్టు అంశం నానుతూ ఉండేది. 
 ప్రతి శాఖ పైన జగన్ మార్క్...

ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని చంద్రబాబు కొంత హడావిడి చేసేవారు. కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.అయితే నవంబరు నెల నుంచి పోలవరం పనులు ప్రారంభమవుతాయని ప్రభుత్వం చెబుతుంది. వరదల సమయం కావడంతో నిర్మాణ పనులు నిలిపేశామని చెప్పటంలో కొంత అర్థం ఉందనిపిస్తోంది. ఇక చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టు అయిన రాజధాని అమరావతిని సయితం జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అది జగన్ కు అప్రధాన అంశంగా మారింది. దీనిపై వేసిన కమిటీ నివేదిక ప్రకారం అడుగులు ఎలా ముందుకు వేయాలో జగన్ నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత అంశాలు సహజంగానే మారిపోతాయి. చంద్రబాబు చెప్పినట్టే జగన్ ప్రభుత్వం చేయాలంటే ఎలా కుదురుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరోలో సయితం అమరావతి, పోలవరంను జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని తీర్మానించారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే పథకాలను జగన్ గ్రౌండ్ చేయడంతోనే టీడీపీ నేతలకు దిక్కు తోచడం లేదని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఏ అంశాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో తమ అధినేత జగన్ కు తెలుసునని అంటున్నారు. మొత్తం మీద జగన్ స్టయిల్ ఆఫ్ ఫంక్షనింగ్ టీడీపీకి తలనొప్పిగా మారిందనే చెప్పాలి.

No comments:

Post a Comment