Breaking News

21/09/2019

పాశ్చాత్య సంస్కృతితో దారి తప్పుతున్న మైనర్లు

హైద్రాబాద్, సెప్టెంబర్ 21, (way2newstv.in)
పాశ్చాత్య సంస్కృతి మైనర్లను పెడదారి పట్టిస్తోంది. సమాజంలోని ఆధునిక ధోరణులు యువతను నేరాల వైపు పురిగొల్పుతున్నాయి.సిటీలో పెరిగిన పార్టీ కల్చర్, అందుబాటులోకి వచ్చిన పబ్స్‌ తదితరాలు యువతతో పాటు మైనర్లనూ ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. సహ విద్యార్థులు, సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన వారితో కలిసి విలాసవంతమైన విందులు చేసుకోవడం జీవితంలో భాగంగా వారు భావిస్తున్నారు. మారిన జీవనశైలి, ఉద్యోగ–వృత్తి–వ్యాపారాల నేపథ్యంలో ఏది తప్పు, ఏది ఒప్పు అన్నది దగ్గరుండి నేర్పేంత ఖాళీ తల్లిదండ్రులకు ఉండట్లేదు. వారి తర్వాత ఆ స్థాయిలో ఈ బాధ్యతలు నిర్విర్తించాల్సిన ఉపాధ్యాయులు సైతం ఆ విషయం పట్టించుకోవట్లేదు. 
పాశ్చాత్య సంస్కృతితో దారి తప్పుతున్న మైనర్లు

గురుశిష్యుల మధ్య ఒకప్పుడు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు లేకపోవడం, విద్యా సంస్థ అంటే కేవలం చదువు చెప్పి పంపించే వ్యాపార సంస్థగా మారిపోవడం కూడా మైనర్లు, యువతపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా దశ, దిశ నిర్దేశించే వారు లేకపోవడంతో లోకం పోకడ తెలియని చిన్నారులు సైతం పెడదోవపడుతూ తీవ్రమైన నేరాలు చేస్తున్నారు.   తల్లిదండ్రుల అజమాయిషీ లేకపోవడం, పెరుగుతున్న సోషల్‌ మీడియా ప్రభావం, పార్టీ, పబ్‌ కల్చర్‌ సైతం మైనర్లను తీవ్రంగా ప్రభావితం చేసి నేరబాట పట్టిస్తున్నాయి. ఏటా పోలీసులకు చిక్కుతున్న నేరస్తుల్లో 70 శాతానికి పైగా కొత్తవారే. వీరిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో మైనర్లు ఉండడం గమనార్హం. 2014–2017 జూలై మధ్య సిటీ పోలీసులు మొత్తం 8,688 మందిని అరెస్టు చేయగా.. 6,726 మంది (77.41 శాతం) కొత్త నేరగాళ్లు. ఇందులో 634 మంది 18 ఏళ్ల లోపువారే కావడం ఆందోళన కలిగిస్తోంది. చాందిని జైన్‌ ఉదంతాన్నే తీసుకుంటే.. పరిస్థితులు ఇక్కడ వరకు రావడానికి సోషల్‌ మీడియా ప్రభావమూ ఉందని తేలింది. ఫేస్‌బుక్‌ కేంద్రంగా ఏర్పాటైన ‘నేషనల్‌ డిప్లమాట్స్‌’ అనే పేజ్‌ అనేక మంది మైనర్లు, మేజర్లను ఏకం చేసింది. వీరంతా ఈనెల 1 నుంచి 3 వరకు నగరంలోని సెంట్రల్‌ కోర్ట్‌ హోటల్‌లో గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసుకున్నారు. పగలంతా కొన్ని రకాలైన మాక్‌ సెషన్స్‌తో సజావుగానే సాగినా.. రాత్రి వేళల్లో మాత్రం శృతిమించింది. సోషలైజింగ్‌ పేరుతో మైనర్లు, మేజర్లు కలిసి పబ్‌కు వెళ్లడం, ఎక్సేంజింగ్‌ పేరుతో లింగభేదం లేకుండా గదులు మార్చుకోవడం వంటి విపరీతాలు చోటు చేసుకున్నాయి. మైనర్లను పబ్స్‌లోకి అనుమతించకూడదని, మద్యం సరఫరా చేయకూడదనే నిబంధన ఉన్నా.. ఈ మూడు రోజులూ అవి ఎక్కడా అమలుకాలేదు. ఆ గెట్‌ టుగెదర్‌లో చాందినికి పరిచయమైన మరో మైనర్‌ కారణంగానే వివాదం మొదలై హత్యకు దారితీసింది.  నగరంలో ఒంటరి జీవులు పెరిగిపోతున్నారు. పెరిగిన ఖర్చులు, జీవన ప్రమాణాల నేపథ్యంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఇల్లు వదిలి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక మంది మైనర్లు, యువత ఒంటరిగా మారుతున్నారు. దీనికితోడు వీరు సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌ ఫలితంగా  విశృంఖలంగా ఉంటున్న అశ్లీల సైట్లు, ఆ తరహా చాంటిగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా పరిచయాలు, మీటింగ్స్‌ ఏర్పాటు చేసుకుంటూ కొత్త ఆకర్షణలకు లోనవుతున్నారు. మరొపక్క పిల్లలపై పెద్దల అజమాయిషీ కూడా తక్కువగా ఉంటోంది. వీరి బాగోగులు పట్టించుకోవడం, కదలికల్ని కనిపెట్టడంలో వారు విఫలం కావడంతో పెడదారి పడుతున్న మైనర్ల సంఖ్య ఎక్కువ అవుతోందన్నది పోలీసుల మాట.  

No comments:

Post a Comment