Breaking News

19/09/2019

పక్కనే ప్రమాదం.. (విజయవాడ)

విజయవాడ, సెప్టెంబర్ 19 (way2newstv.in):
నగరంలోని పలు ప్రాంతాల్లో జనావాసాల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. వీటి యజమానుల పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో డంపింగ్‌ యార్డ్‌లుగా మారిపోయాయి. వర్షాకాలం కావడంతో వాటిపైగుబురుగా పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. ఈ స్థలాల్లో తాగేసిన కొబ్బరి బొండాలు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ సామగ్రి, పాత టైర్లు వంటివన్నీ ఏళ్ల తరబడి పడేశారు. వర్షం పడగానే వాటిలో నీళ్లు చేరి.. ప్రమాదకరమైన డెంగీ, మలేరియా వంటి వ్యాధులకు కారణమయ్యే దోమలు పెరిగిపోయాయి. ఈ ఖాళీ స్థలాలకు చుట్టూ ఉన్న ప్రతి ఇంటిలోనూ డెంగీ, టైఫస్‌, మలేరియా వంటి జ్వరాల బారినపడిన బాధితులు ఉన్నారు. ఆస్పత్రుల్లో చేరి వారం పది రోజులు చికిత్స పొంది ఆర్థికంగా, మానసికంగా చితికిపోతున్నారు. 
పక్కనే ప్రమాదం.. (విజయవాడ)

కొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు.ప్రస్తుతం విజయవాడ నగరంలో ఇళ్ల మధ్యలో ఇలాంటి ఖాళీ స్థలాలు 15,300 వరకూ ఉన్నాయని నగరపాలక సంస్థ రికార్డుల్లో అధికారికంగా నమోదై ఉంది. వీటిలో 70 శాతానికి పైగా ఇలాగే డంపింగ్‌ యార్డులుగా, ముళ్ల పొదలతో నిండిపోయి.. విష కీటకాలు, పాములు, ప్రమాదకరమైన దోమ జాతులకు ఆవాసాలుగా మారి ప్రాణాలను హరిస్తున్నాయి. విజయవాడ చరిత్రలోనే లేనంత దారుణంగా ప్రస్తుతం విషజ్వరాలు దాడి చేస్తున్నాయి. ప్రతి వీధిలోనూ వందల మంది డెంగీ, మలేరియా, టైఫాయిండ్‌ వంటి జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల తాకిడి తట్టుకోలేక మంచాలను ఏర్పాటు చేయలేక.. తిరిగి వెళ్లిపోమనేంత తీవ్రంగా పరిస్థితి ఉంది.నగరంలోని చాలా వీధుల్లో కూరగాయలు, ఇస్త్రీ బండ్లు వంటివి పెట్టుకుని బతికే అనేక మంది విషజ్వరాలబారిన పడి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుల తరబడి చికిత్స పొందుతున్నారు. ఓ ఖాళీ స్థలం డంపింగ్‌ యార్డ్‌గా మారిపోయి ఉంటే.. దాని చుట్టూ ఉండే ప్రతి ఇంటిలోనూ జ్వరపీడితులు ఉన్నారు. నిత్యం వచ్చే నగరపాలక సంస్థ సిబ్బంది చెత్తను రహదారుల పక్కన, ఇళ్ల నుంచి సేకరించి తీసుకెళ్లడం వరకే పరిమితమవుతున్నారు. కానీ.. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఖాళీ స్థలాల్లోని చెత్త, చెదారంపై దృష్టి పెట్టడం లేదు. విషజ్వరాలను అరికట్టడానికి ఫాగింగ్‌ చేస్తున్నాం, శుభ్రం చేస్తున్నాం అంటూ ప్రధాన కారణమైన ఈ స్థలాల గురించి పట్టించుకోకపోవడం దారుణం. ప్రస్తుతం చెత్తపై గుబురుగా మొక్కలు పెరిగిపోయి.. అన్ని రకాల విషకీటకాలకూ ఆవాసాలుగా ఈ ఖాళీ స్థలాలు మారిపోయాయి. ఇవే ఇప్పుడు నగరాన్ని అత్యంత తీవ్రమైన జ్వరాలబారిన పడేలా చేస్తున్నాయి. నగరంలోని ఖాళీ స్థలాల యజమానుల్లో చాలా మంది విదేశాల్లో, దూరంగా ఎక్కడెక్కడో ఉంటున్నారు. అందుకే.. వీటివల్ల కలిగే అనర్థాల గురించి వాళ్లకు పట్టడం లేదు. వాటి చుట్టూ ఉండే సామాన్యులు బలైపోతున్నారు. ఈ ఖాళీ స్థలాల నుంచి వచ్చే దోమలు, కీటకాలు కుట్టడంతో అప్పటివరకూ ఆరోగ్యంగా ఆడుకుంటున్న చిన్నారులు.. కేవలం వారం రోజుల్లోనే మృత్యువాత పడే పరిస్థితి ఎదురవుతోంది. వందల మంది చిన్నారులు డెంగీ, మలేరియా వంటి జ్వరాలతో ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చూసినా.. ఈ విషయం అర్థమైపోతుంది.ప్రమాదకరంగా మారిన ఈ ఖాళీ స్థలాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన ఖాళీ కొబ్బరి బొండాలు, పారేసిన సామగ్రి, వాహనాల టైర్లలోనే ప్రస్తుతం ఎడిస్‌ ఈజిప్టై దోమలు పెరిగి.. జనాల ప్రాణాలను హరిస్తున్నాయి. గత రెండు నెలల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ కేసులు జిల్లాలో అధికారికంగా 8300 నమోదైనప్పటికీ.. అనధికారికంగా కనీసం మరో మూడు నాలుగు రెట్లు అధికంగా బాధితులు ఉన్నారు. రోజు రోజుకూ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. ఇళ్లలో నుంచి బయటకొస్తే చాలు.. ఏదో ఒక దోమకాటు బారిన పడి డెంగీ, మలేరియా బాధితులుగా మారుతున్నారు. వీటిచుట్టూ ఉండే నివాసితులు జ్వరాల బారిన పడి వైద్యం కోసం చేస్తున్న ఖర్చు రూ.లక్షల్లో ఉంటోంది. గతంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రవీణ్‌ప్రకాష్‌ ఉన్నప్పుడు ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తున్న ఈ ఖాళీల స్థలాలు, వాటి యజమానులపై తీవ్రస్థాయిలో చర్యలు చేపట్టారు. తర్వాత నివాస్‌ ఉన్నప్పుడూ ఇలాంటి స్థలాల వద్ద ఎర్రని బోర్డులను పాతి.. రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్‌) చట్టం, ప్రజారోగ్య చట్టాల కింద చర్యలు చేపట్టారు. ఈ స్థలాలన్నింటినీ వాటి యజమానులు కచ్చితంగా మెరకలుగా చేసి ఎవరికీ ఇబ్బందిలేకుండా చూసుకోవాల్సి ఉంది. వారు చేయకపోతే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే గతంలో మెరకలుగా చేసి దానికి అయ్యే ఖర్చును యజమానుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. ఇంకా స్పందించకపోతే.. స్థలాలను స్వాధీనం చేసుకుని.. వేలం వేసేందుకూ అధికారం ఉంది. కానీ.. ప్రస్తుతం అటు అధికారులు స్పందించక.. ఇటు యజమానులకూ పట్టక.. నగరం జ్వరాలమయంగా మారిపోయింది. ప్రాణాలను హరించేంత ప్రమాదకరంగా మారిన ఈ అనధికారిక డంపింగ్‌యార్డ్‌లపై అధికారులు కన్నెర్రజేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారడం ఖాయం.

No comments:

Post a Comment