ఏలూరు, సెప్టెంబర్ 17 (way2newstv.in):
ఓ వైపు వరద ఉద్ధృతి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు పునరావాస ప్రక్రియ నత్తను తలపిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా పునరావాస ప్యాకేజీ రాక ముంపు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు లేవు. పోలవరం కాఫర్ డ్యామ్ నిర్మాణంతో మునిగిపోయిన గ్రామాల ప్రజలకు పునరావాసంతో పాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ మంజూరు విషయంలోనూ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇప్పటివరకు జరిగిన పనులకు జనవరి నుంచి నిధులు మంజూరు కాలేదు. కాఫర్‌డ్యామ్ నిర్మాణంతో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 42 గ్రామాలకు ముంపు ముప్పు ఉండటంతో ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని నిర్ణయించింది.
పునరావాసమేదీ..? (పశ్చిమగోదావరి)
ఇందుకుగాను జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, పోలవరం, గోపాలపురం, కొయ్యలగూడెం మండలాల్లో పునరావాస గృహాలు నిర్మిస్తున్నారు. పోలవరం మండలంలోని గిరిజనేతరులకు గోపాలపురం మండలం సాగిపాడులో గృహాలు నిర్మిస్తున్నారు. గిరిజనులకు పోలవరం పరిధిలోని ఎల్‌ఎన్‌డీపేటలో నిర్మాణాలు చేపడుతున్నారు. మొత్తం 572 ఇళ్ల నిర్మాణాల్లో 112 మాత్రమే శ్లాబ్ దశలో ఉండగా.. ఎక్కువ శాతం పునాదుల స్థాయిలోనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గిరిజనేతరులకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి సమీపంలోని తెల్లవారిగూడెంలో నిర్మిస్తున్న గృహాలు ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. అదే గ్రామంలో కొయిదా గ్రామస్థుల కోసం నిర్మిస్తున్న 170 ఇళ్ల నిర్మాణాలు మాత్రం శ్లాబ్ దశకు చేరాయి. గిరిజనుల కోసం జీలుగుమిల్లి, బుట్టాయగూడెంలలో నిర్మిస్తున్న గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. కుక్కునూరు మండలంలోని కొందరు గిరిజనులకు అదే గ్రామంలోని మెరక ప్రాంతాల్లో గృహాల నిర్మాణం చేపట్టారు. వేలేరుపాడు మండల గిరిజనులకు అదే మండలంలోని గిరిజన గ్రామాల్లో పునరావాసం కల్పిస్తున్నారు. 2010లో ఖాళీ చేసిన ఎనిమిది గ్రామాలకు మినహా మిగిలిన ఏ ఒక్క గ్రామానికి పునరావాసం కల్పించలేదు. వరద వచ్చినప్పుడల్లా అధికారులు వచ్చి వెళ్తున్నారే తప్ప ప్రయోజనం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆయా గ్రామాల్లో 2017 జూన్ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికి పరిహారం చెల్లించాలి. ఒక్కో గిరిజనేతరుడికి రూ.6.36 లక్షలు, గిరిజనుడికి రూ.6.86 లక్షలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా ఆ పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు ప్రకటించిన పరిహారం ముంపు ప్రాంత ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పునరావాస కాలనీలు పూర్తయిన తర్వాత నిర్వాసితులు గృహాల్లోకి వెళ్లే లోపు పరిహారం ఇస్తారని సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. బకాయిలు విడుదల కాకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు. గృహాలు నిర్మిస్తేనే పరిహారం వస్తుంది. ఇలా ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి అటు పరిహారం రాక.. ఇటు పునరావాసరం లేక రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. పునరావాస కాలనీల నిర్మాణం జరిగితే ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటారు. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం వారి గృహ నిర్మాణాలకు స్థలాలను ఎంపిక చేసి పనులు చేపట్టింది. కానీ సంబంధిత గుత్తేదారులకు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు బిల్లులు మంజూరు కాలేదు. ఇప్పటికి ఎనిమిది నెలలు గడిచినా బిల్లులు రాకపోవడంతో పనులు మందగించాయి. కొన్నిచోట్ల పనులు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
No comments:
Post a Comment