Breaking News

13/08/2019

అక్రమ వెంచర్లపై లెక్కలు

బిజీ బిజీగా రెవెన్యూ అధికారులు
సంగారెడ్డి ఆగస్టు 13, (way2newstv.in)
అక్రమ వెంచర్లను, అనుమతులు ఉన్న వెంచర్లను లెక్కకట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, మున్సిపల్ శాఖలను ఆదేశించడంతో ఆయా శాఖల అధికారులు అక్రమ వెంచర్ల లెక్కలు తేల్చేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. పరిశ్రమలు గ్రామాలకు విస్తరించడం, పట్టణాల ఆధునీకరణతో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఒక్క సారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న భూముల ధరలకు ఎకరానికి రూ. కోటికి పైగానే ధరలు పలుకుతున్నాయి. పట్టణ పరిధిలోని 3కిలోమీటర్ల సర్కిల్ ఏరియాను తాజాగా మున్సిపాలిటీ రెండో శ్రేణిలోకి చేర్చారు. అయితే ముందు జాగ్రత్తగా అక్రమ లేఅవుట్ల వ్యాపారులు మున్సిపల్ పరిధిలోకి చేరుతున్న భూములను పంచాయతీ పరిధులుగా నిర్ణయించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. 
అక్రమ  వెంచర్లపై లెక్కలు 

అయితే ప్లాట్ల రేట్లను మాత్రం భారీగానే నిర్ణయిస్తున్నారు. పట్టణ శివారులోని ఖాంజాపూర్, పసారం కాలనీ, పాత కుంట, కోకట్‌రోడ్, చెన్‌గేశ్‌పూర్ రోడ్డు, గౌతాపూర్, కందనెల్లి, బషీర్‌మియా తండా శివార్లలో భారీగానే అక్రమ లేఅవుట్లు వెలిశాయి. పంచాయ తీలకు అయితే చదరపు మీటరుకు రూ. 45నుంచి 50వరకు డెవలప్‌మెంట్ చార్జి రుసుం చెల్లించాలి. అయితే గ్రామ కార్యదర్శులను బుట్టలో వేసుకొని రియల్టర్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. తాండూరు పట్టణ పరిసరాల్లో వెంచర్లు చేస్తున్న వారిలో 50శాతం మందికి పైగా రియల్టర్లు అక్రమ వెంచర్లనే ఏర్పాటు చేశారు.నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను ముందుగా రెవెన్యూ డివిజనల్ కార్యాలయం అధికారులకు దరఖాస్తు చేసుకొని భూమి విలువలో 10శాతం పన్ను చెల్లించి వ్యవసాయేతర భూములుగా  మార్చుకున్న తరువాతే లే అవుట్లకు పూనుకోవాలి. అలాగే రెవెన్యూ డివిజనల్ అధికారిచ్చిన ఎన్‌వోసీతో భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతోపాటు లే అవుట్ ప్లానింగ్ పత్రాలను హైదరాబాద్‌లోని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్  అధికారికి సమర్పించి నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి పన్నులు చెల్లించి ఆమోదం పొందాలి. డీటీసీపీ అధికారులు లేఅవుట్ల స్థలాలను స్వయంగా పరిశీలించి బెటర్‌మెంట్ చార్జీలు నిర్ధారిస్తారు. ఆయా ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్ధారించిన మార్కెట్ ధరల మేరకు బెటర్‌మెంట్ చార్జీలు నిర్ధారించి అనుమతులు ఇస్తారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఉన్న ప్రదేశాల్లో చదరపు మీటరుకు రూ. 50వరకు అనుమతి రుసుంగా చెల్లించాలి. తాండూరు ప్రాంతంలో మున్సిపల్ పరిధిలో చదరపు గజం కనీస విలువ రూ. 2వేల వరకు ఉండగా శివారు పంచాయతీల పరిధిలో రూ. 1500 వరకు ఉంది. వీటిని పరిగణలోకి తీసుకోవడంతో పాటు భూమి విలువను బట్టి రూ. 350నుంచి 450వరకు డెవలప్‌మెంటు చార్జీలు కట్టాలి. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకునేందుకు తాజాగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు ఆదేశా లు జారీ చేసింది. గతంలో పెద్దేముల్ మండల పరిధిలోని తాం డూరు పట్టణ శివారులోని కందనెల్లి సమీపంలో వెలిసిన అక్ర మ వెంచరుపై రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపించడం గమనార్హం. తాజాగా అక్రమ లేఅవుట్లు వెలిస్తే వాటిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నాలుగేండ్ల క్రితం ఇవే భూముల ధరలు ఎకరాకు రూ. 20లక్షల లోపే ఉండేవి. భవిష్యత్‌లో ధరలు మరింత పెరుగుతాయన్న కారణంతో, అలాగే నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో దాచుకునే సొమ్ముకు వివిధ నిబంధనలు, ఐటీ పేరిట బాదుడుకు గురవుతుండడంతో పలువురు తమ వద్ద ఉన్న డబ్బులను ప్లాట్ల కొనుగోళ్లకు ఎక్కువగా వెచ్చిస్తున్నారు. దీంతో కొనుగోళ్లకు ఉన్న డిమాండ్‌తో రియల్టర్లు మరింతగా రెచ్చిపోతున్నారు. తాండూరు పట్టణంలో బైపాస్ రోడ్డుతో పాటు పట్టణ ఆధునీకరణ పనులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు- ఆరు కాయలు అన్న చందంగా విరాజిల్లుతున్నది. దీంతో తాండూరు పట్టణ శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలు కాలరాసి 90శాతం లేఅవుట్లను అనుమతులు లేకుండానే నిర్వహిస్తు న్నారు. దీంతో ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతోపాటు అటు అక్రమ లేఅవుట్లతో ప్లాట్ల కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే వెంచర్లు ఏర్పాటు చేయడంతో ఈ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నిలువునా మోసపోతున్నారు. తాండూరు పట్టణ శివార్లలో తాండూరు - కొడంగల్ రోడ్డు మార్గంలో, తాండూరు - హైదరాబాద్ రోడ్డు మార్గంలో, తాండూరు - చించోళి రోడ్డు మార్గంలో అక్రమ లే అవుట్లు విచ్చల విడిగా వెలిశాయి. పట్టణ పరిధిలో, శివారు ప్రాంతాల్లో దాదాపు 10కి పైగా కొత్త వెంచర్లు వెలిశాయి. వీటికి తోడు గతంలో అనుమతులు లేకుండా ఏర్పాటైన వెంచర్లు కూడా 10-12 వరకు ఉన్నాయి. కొందరు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఏకంగా బ్రాంచి కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి, భూమి ప్రదేశాన్ని బట్టి కూడా డెవలప్‌మెంట్ చార్జీలను డీటీసీపీ నిర్ణయిస్తుంది. నిబంధనల ప్రకారం రెండున్నర ఎకరాల పైబడి ఉన్న వెంచర్ ఏర్పాటు చేస్తే 10 శాతం ఓపెన్‌ల్యాండ్ వదులాలి. అలాగే 35 శాతం స్థలాన్ని రోడ్ల కోసం వదులాలి. ఇలా మొత్తం స్థల విస్తీర్ణంలో 45శాతం స్థలాన్ని వదిలి చేపట్టిన ప్లాట్లకు డీటీపీసీ ప్లాన్ ఫైనల్ చేసిన తరువాత డీటీసీపీ నుంచే నేరుగా సంబంధిత మున్సిపాలిటీకి లేదా పంచాయతీకి అప్రూవల్ కోసం పంపిస్తారు. అయితే డీటీసీపీకి దరఖాస్తు చేసుకునే వైనంలోనే అక్రమాలు మొదలవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా లేని ప్లాట్లకు కూడా డీటీపీసీలోని కొందరు అక్రమార్కులకు ముడుపులు చెల్లించి వెంచర్ల వ్యాపారస్తులు నిబంధనలను పాటించకుండానే అనుమతులు పొందుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఉన్న లేఅవుట్లకు.. ఉదాహరణకు వెయ్యి చదరపు గజాలకు రూ.చార్జీలు స్థానిక మున్సిపాలీటీలు వసూలు చేయాలి. సంబంధిత పంచాయతీలకు కూడా ఇదే విధంగా డెవలప్‌మెంట్ చార్జీలు చెల్లించి లే అవుట్లకు అప్రూవల్ తీసుకోవాలి.తాండూరు శివారులో ఏర్పాటైన పలు వెంచర్లకు ఇలాంటి అనుమతులేవి లేకపోవడం గమన్హాం. దీంతో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కోరిన సమయంలో మున్సిపాలిటీ లకు 200 చదరపు గజాలకు రూ. 70నుంచి 80వేల వరకు జరిమానాగా చెల్లించవలసి వస్తున్నది. ఇదే ప్లాట్లకు అనుమతులు ఉంటే ఇందులో సగం డబ్బులు కొనుగోలు దారుకు ఆదా అవుతాయి. అయితే డాక్యుమెంటేషన్ రుసుం, ఓపెన్ ల్యాండ్  రుసుం పేరిట మున్సిపాలిటీలు ఇండ్ల నిర్మాణానికి అనుమతిచ్చే సమయంలో భారీగా అపరాధ రుసుంను వసూలు చేయడం తప్పని సరిగా మారింది. దీంతో ప్రధానంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారిపైనే అదనపు భారం పడుతున్నది. రియల్టర్లు ఇలా నిబంధనలను తుంగలో తొక్కి ఒక వైపు ప్లాట్ల విక్రయం చేపడుతుండగా మరి కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. అసైన్డ్ భూములను, నాలాలను కబ్జా చేసి మరీ ప్లాట్లుగా మారుస్తున్నారు. 

No comments:

Post a Comment