Breaking News

13/08/2019

వానలతో బిజీబిజీగా రైతులు

అదిలాబాద్, ఆగస్టు 13, (way2newstv.in)
జిల్లాలోని ఉట్నూర్‌, తాంసి, తలమడుగు, ఇంద్రవెల్లి, నార్నూర్‌, బేల మండలాల్లో పది మిమీలకు పైగా వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో ముసురుతో కూడిన వర్షం కురిసింది.జిల్లాలో పక్షం రోజులుగా భారీ వర్షం కురవలేదు. అడపాదడపా కురిసిన అది కొన్ని మండలాలకే పరిమితమైంది. సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కురిసిన వర్షాలతో వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహించగా, జలాశయాలు నిండిపోయాయి. సాత్నాల ప్రాజెక్టు నీటి మట్టం సాధారణ నీటి మట్టానికి చేరువలో ఉంది. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో రెండు గేట్లు ఎత్తివేసి 4 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు వర్షాధారంగా సాగవుతున్న పత్తి, సోయా, కంది తదితర పంటలతో పాటు ఇతర పంటలకు వర్షం మేలు చేకూర్చింది.
వానలతో బిజీబిజీగా రైతులు

పంటలు ఏపుగా పెరుగుతున్న దశలో వర్షం అవసరం. అలాంటిది రైతులు కోరుకున్నట్లే భారీ వర్షం కురియడంతో పంటలకు మేలు చేసింది.  జిల్లా వ్యాప్తంగా 8.8 మిమీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఉట్నూర్‌లో 27.6 మిమీల వర్షం కురిసింది. ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తరువాత బేలలో 16.4, ఇంద్రవెల్లిలో 15.4, తలమడుగులో 14.8 మిమీల వర్షం కురిసింది. తాంసిలో 12.2 నార్నూర్‌లో 12.4 మిమీల వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా గంట సేపు భారీ వర్షం కురియడంతో ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లోని శివారు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ఈ వర్షం మెట్ట పంటలకు ప్రాణం పోసినా, జిల్లాలోని బోథ్‌, భీంపూర్‌, గాదిగూడ మండలాల్లో వర్షానికి ఇంకా లోటుగానే ఉంది. గుడిహత్నూర్‌ మండలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాలు సాధారణ వర్షం కురిసింది. జిల్లాలో  654.1 మిమీలు వర్షం కురియాల్సి ఉండగా 652.5 మిమీల వర్షం కురిసింది. అయితే అడపాదడపా కురిసిన వర్షాలతో పంటలను విత్తుకున్న రైతులకు ఈ వర్షం ఊరట నిచ్చింది.జిల్లాలోని 18 మండలాల్లో వర్షం లోటు ఉన్న మండలాలు మూడు ఉన్నాయి. మిగిలిన మండలాల్లో వర్షపాతం ఆశాజనకంగా ఉంది.  జిల్లాలో 1.76 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా పత్తి 1.22 లక్షల హెక్టార్లు ఉండగా, సోయా 30 వేలు, కంది 18 వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. 

No comments:

Post a Comment