Breaking News

30/08/2019

నిధులు ఇవ్వని కార్పొరేట్ కంపెనీలు...

అర్ధాంతరంగా నిలిచిపోతున్న ఆర్వో వాటర్ ప్లాంట్స్
నెల్లూరు, ఆగస్టు 30, (way2newstv.in)
సీఎస్సార్‌ నిధులతో ప్రాజెక్ట్‌ల ప్రభావిత గ్రామాల్లో ప్రజల దాహార్తి తీర్చే ఆర్వో వాటర్‌ ప్లాంట్లు నిర్వహించే దిక్కులేక మూతపడ్డాయి. మరికొన్ని ప్లాంట్లలో అభివృద్ధి పనులు పడకేశాయి.సామాజిక బాధ్యత కింద ప్రాజెక్ట్‌లు తమ ఆదాయంలో రెండు శాతం నిధులను ప్రభావిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయాల్సి ఉంది. సెమ్‌కార్ఫ్‌ గాయత్రి పవర్‌ కాంప్లెక్స్‌ నిర్వాహకులు ఇప్పటి వరకు రూ.25 కోట్ల మేరకు సీఎస్సార్‌ నిధులు వ్యయం చేసినట్టు చెబుతున్నారు. రాష్ట్ర మంత్రులు ఆంక్షలు పెట్టిన తర్వాత నేలటూరులోని ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు రూ.2 కోట్ల సీఎస్సార్‌ నిధులను ఇటీవల కలెక్టర్‌కు డిపాజిట్‌ చేశారు. దీంతో చేపట్టాల్సిన పనులు, కల్పించాల్సిన సౌకర్యాలపై కలెక్టర్‌కు కనీసం ప్రతిపాదనలు పంపించే అధికారం కూడా తమకు లేదని జెన్‌కో ఇంజినీర్లు స్పష్టం చేశారు. 
నిధులు ఇవ్వని కార్పొరేట్ కంపెనీలు...

బడి చుట్టూ ప్రహరీగోడ, స్కూల్‌ ముందు నీళ్ల బోరు ఏర్పాటు చేసే అధికారం కూడా కోల్పోయామన్నారు.ముత్తుకూరు మండలంలో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసిన 13 ఆర్వో వాటర్‌ ప్లాంట్లల్లో ప్రస్తుతం ఏడు ప్లాంట్లు మూతపడ్డాయి. మిగిలిన ప్లాంట్ల నిర్వహణకు తలపెట్టిన టెండర్లను రద్ధు చేయడంతో ఇవి కూడా ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా రెండు థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌లకు కేంద్రంగా ఉన్న నేలటూరు పంచాయతీలోని టైడు వాటర్‌ ప్లాంట్లు మూతపడడం విశేషం. ఇవి కాకుండా ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద ఏర్పాటైన ఆరు ప్లాంట్లల్లో మూడు మూతపడ్డాయి. మూత పడ్డ ఆర్వో ప్లాంట్లు, ప్రజల కష్టాలు పట్టించుకునే అధికారులు, నాయకులు కరువయ్యారు. తాగునీటి కోసం అల్లాడిపోయే ప్రజలు ప్లాంట్ల పరిస్థితి వివరించేందుకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మినరల్‌ వాటర్‌ను తాగేందుకు అలవాటు పడ్డ పేదలు ప్రస్తుతం నీళ్ల క్యాన్లు కొనుగోలు చేయలేక అల్లాడిపోతున్నారు.సామాజిక బాధ్యత నిధులను ప్రాజెక్ట్‌ల ప్రతినిధులు కలెక్టర్‌కు డిపాజిట్‌ చేయడంతో తీరప్రాంత గ్రామాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. మరమ్మతులకు గురైన ఆర్వో ప్లాంట్‌ను రిపేరు చేయించే దిక్కు లేకుండా పోయింది. తాగునీటి కోసం తీరప్రాంత గ్రామాల్లో అలజడి మొదలైంది. పనులు కోసం ప్రజలు పదే పదే కలెక్టర్‌ వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. స్థానికంగా నెలకొన్న ఈ సమస్యలను ఎవరు పరిష్కరిస్తారనేది ప్రశ్నార్థకమైంది. కనీసం తాగునీటి కష్టాలు తొలగించేందుకైనా అత్యవసర కమిటీని ఏర్పాటు చేయాలి. మూతపడ్డ ఆర్వో ప్లాంట్లను తెరిపించాలి. మిగిలిన ప్లాంట్లు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

No comments:

Post a Comment