Breaking News

23/08/2019

స్మార్ట్ పనులకు బ్రేక్

విశాఖపట్టణం, ఆగస్టు 23, (way2newstv.in - Swamy Naidu)
మహా విశాఖ నగర పాలక సంస్థ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు పనులకు బ్రేక్ పడింది. ఫలితంగా పనుల్లో జాప్యం జరిగింది. నాణ్యత తగ్గింది. గత సర్కారు చేసిన అడ్డగోలు పనులపై దృష్టి సారించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం.. టీడీపీ హయాంలో ప్రారంభించి.. 25 శాతం కూడా పూర్తి కాని పనులతో పాటు టెండర్‌ దశలో ఉన్న వాటినీ నిలిపివేయాలని అన్ని శాఖలతోపాటు జీవీఎంసీని ఆదేశించింది. ఈ పనులపై పూర్తి స్థాయి సమీక్ష, పరిశీలనకు ముగ్గురు అధికారులతో కమిటీని నియమించింది.గ్రేటర్‌ పరిధిలో జరుగుతున్న స్మార్ట్‌ పనులు, టెండర్‌ దశలో ఉన్నవాటిపై విచారణకు నియమించిన ఈ త్రిసభ్య కమిటీకి ఏపీ టిడ్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌.గోపాలకృష్ణారెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ప్రజారోగ్యశాఖ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ బీహెచ్‌ శ్రీనివాసరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.వర్మ సభ్యులుగా ఉన్నారు.
స్మార్ట్ పనులకు బ్రేక్
స్మార్ట్‌ సిటీ పరిధిలో చేపట్టిన పనుల అంచనా విలువ, టెండర్ల ప్రక్రియ, పనుల్లో నాణ్యత ప్రమాణాలు.. తదితర అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.జీవీఎంసీ పరిధిలో 775 కోట్లతో 28 ప్రాజెక్టులు మంజూరు కాగా.. 19 ప్రాజెక్టుల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన 9 ప్రాజెక్టులు టెండర్‌ దశలోనే ఉన్నాయి. రూ.536.61 కోట్లతో ప్రారంభమైన 19 పనుల్లో చాలా వరకు 25 శాతం కూడా పూర్తికాలేదు. కొన్ని పనులు క్షేత్ర స్థాయిలో 25 శాతం దాటినా ఆ మేరకు నిధులు మంజూరు చెయ్యలేదు. ఏబీడీ ఏరియా సివరేజీ ప్రాజెక్టు, స్మార్ట్‌ స్ట్రీట్స్, 24/7 నీటిసరఫరా,  స్పోర్ట్స్‌ ఎరీనా నిర్మాణం, మేహాద్రిగెడ్డ సోలార్‌ పనులు, ఏబీడీ ఏరియాలో సోలార్‌ స్ట్రీట్‌లైట్స్, వుడాపార్క్‌ ఆధునికీకరణ పనులు 8 నుంచి 22 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మరో రూ.245 కోట్ల పనులకు టెం డర్లు పిలిచారు. వీటిలో నీటిసరఫరాకు స్కాడా అనుసంధానం చేసే ప్రాజెక్టు, స్మార్ట్‌ స్ట్రీట్స్‌ అభివృద్ధి, ఈ–రిక్షాలు, స్మార్ట్‌ బస్‌ షెల్టర్లు, డ్రెయిన్ల నిర్వహణకు మెకానికల్‌ స్క్రీనింగ్‌ ఎక్విప్‌మెంట్, రెజిమెంటల్‌ సెమిట్రీస్‌ అభివృద్ధి, ఖాళీస్థలాలు, శ్మశాన వాటికల అభివృద్ధి పనుల టెండర్‌ ప్రక్రియను నిలిపేశారు. వీటన్నింటిపైనా సునిశిత పరిశీలన జరిపి అవకతవకలు జరిగినట్లు తేలితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారు. ఆ నివేదిక ఆధారంగా పనులు పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందని జీవీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి.

No comments:

Post a Comment