Breaking News

24/08/2019

కత్తి మీద సాములాగా డబుల్ బెడ్ రూమ్...

హైదరాబాద్‌,ఆగస్టు 24, (way2newstv.in)
తెలంగాణ రాష్ర్టంలో పేదలందరికీ ఇళ్లు ఇస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది.. శాంపుల్‌గా హైదరాబాద్‌లో కొన్ని ఇళ్లను చూపించింది.. వాటిని చూసిన ప్రజలు సర్కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆ ఊహల్లోనే విహరిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో రకంగా ఉంది.. ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గృహ నిర్మాణ శాఖ మంత్రి సొంత జిల్లా ఆదిలాబాద్‌లో అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ ఒక్క అడుగు ముందుకు వేయలేదంటే... పరిస్థితి ఇట్టే అర్ధమవుతుంది. 
కత్తి మీద సాములాగా డబుల్ బెడ్ రూమ్...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా కారణంగా కొన్ని లక్షల కుటుంబాలకు అదో సుందర స్వప్నంగా మారింది.. తెలంగాణ రాష్ర్టంలో ఇదో పాపులర్‌ స్కీమ్‌.. టీఆర్‌ఎస్‌కు ఓట్ల వర్షాన్ని కురిపించిన పధకం. చాలా మంది వీటిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ డబుల్‌బెడ్‌రూమ్‌ కలను కళ్లెదుట నిలిపిన కేసీఆర్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి.. బిల్లుల చెల్లింపులకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది.. హైదరాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలో ఏడు లక్షల రూపాయలతో డబుల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్లను నిర్మించిన టీఆర్‌ఎస్‌ సర్కారు ...ఇదే తరహాలో రాష్ర్టమంతా నిర్మిస్తామని గ్రేటర్‌ ఎన్నికలకు ముందు సగర్వంగా ప్రకటించింది.. ఆ ఇళ్లను చూసిన పేదలంతా త్వరలో తాము కూడా అలాంటి ఫ్లాట్‌లలో ఉండబోతున్నామని మురిసిపోయారు. గవర్నర్‌..కేంద్రమంత్రులు.. రాష్ర్టమంత్రులు.. ఎమ్మెల్యేలు..ఎంపీలు ఇలా ఎందరెందరో ఐడీహెచ్‌ కాలనీని సందర్శించి ప్రభుత్వంపై ప్రసంశలు కురిపించారు.. ప్రభుత్వం కూడా డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కమిటీలు వేసింది. సంక్షేమ పథకాలలో రాజకీయ జోక్యం తగదంటూ హైకోర్టు ఆదేశించడంతో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు వేసింది.. ఏడాది దసరా రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలో ప్రజాప్రతినిధులు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేసి దాదాపు ఏడాది కావస్తున్నా.. పథకం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. సాక్షాత్తు తెలంగాణ గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సొంత జిల్లా ఆదిలాబాద్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండు పడక గదుల ఇళ్లు గత తొమ్మిది నెలల నుంచి ఊరిస్తూనే ఉన్నాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ పథకం తమకు వర్క్‌అవుట్‌ కాదన్న భావనతో కాంట్రాక్చ ర్లు విముఖత చూపుతున్నారట! వారిని ఒప్పించేందుకు జిల్లా కలెక్టర్‌ జగన్మోహన్‌ ప్రభుత్వ అనుమతితో టెండర్లలో కొన్ని మార్పులు చేసి వెసులుబాటు కలిపించారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి నాలుగు వందల ఇళ్ల చొప్పున తొలి విడతగా నాలుగువేల ఇళ్లను మంజూరు చేసింది ప్రభుత్వం. పేదలు అధికంగా ఉండటం.. ఇళ్లు తక్కువగా మంజూరు కావడంతో అదనంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి అయిదు వందల ఇళ్లు.. మంచిర్యాలకు 250 ఇళ్లను కేటాయించింది ప్రభుత్వం.. మొత్తం నాలుగు వేల 750 ఇళ్ల నిర్మాణం జరగవలసి ఉండగా.. ఇప్పటికీ ఎక్కడా నిర్మాణ పనులు మొదలు కాలేదు.పట్టణ ప్రాంతాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల నిర్మాణం ఎక్కడేసిన గొంగళి అన్న చందంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఇళ్లు నిర్మించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది ప్రభుత్వం. తొలి విడతలో ఎనిమిది వందల 81 ఇళ్లను నిర్మించాలని పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ విభాగం నిర్ణయించింది.. ఇందులో భాగంగా నిర్మల్‌లోని 221 ఇళ్లకు మూడుసార్లు టెండర్లు పిలిచినా గుత్తెదారులు ముందుకు రాలేదు. దీంతో కొన్ని మార్పులు చేశారు. బిట్‌ విలువ అయిదు కోట్ల రూపాయల నుంచి మూడు కోట్లకు.. ఆ తర్వాత రెండు కోట్ల రూపాయలకు తగ్గించారు. ఇలా నిర్మల్‌..ఖానాపూర్‌.. బెల్లంపల్లి... చెన్నూరు.. ఆసిఫాబాద్‌ నియోజకవర్గాలలో 881 ఇళ్లను 23 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. అయిదు లక్షల నాలుగు వేల రూపాయలతో ఇళ్లు.. లక్షా పాతిక వేలతో మౌలిక వసతులు.. మొత్తంగా ఆరు లక్షల 29 వేల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ఇళ్లకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు ఇళ్ల నిర్మాణ వ్యయం రోజురోజుకీ పెరుగుతుండటంతో పాటు తమకు లాభంగా ఉండే 13.61 శాతాన్ని టెండర్ల నుంచి తొలగించడంతో గుత్తెదారులెవ్వరూ ఈ వంక చూడటం లేదుడబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల విషయంలో ప్రజాప్రతినిధులు పెద్దగా ఇంట్రస్ట్‌ చూపకపోవడానికి మరో కారణం కూడా ఉంది. వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం.. ప్రభుత్వమేమో నియోజకవర్గానికి నాలుగు వందల ఇళ్లు మంజూరు చేయడంతో వాటిని ఎవరికి ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట ప్రజాప్రతినిధులు

No comments:

Post a Comment