Breaking News

24/08/2019

భాగ్యనగర్ లో స్మార్ట్ కాప్స్

హైదరాబాద్‌,ఆగస్టు 24, (way2newstv.in)
వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్న హైద్రాబాద్ నగర పోలీసులు ఆచరణలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. హైదరాబాద్ కాప్స్ పేరిట రూపొందించిన యాప్‌తో సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సరిగ్గా విధులు నిర్వహిస్తున్నారా? లేదా అనే అంశం తో పాటు, వారిలో జవాబుదారితనాన్ని పెంచుతూ, వారికి కొన్ని ఖచ్చితమైన బాధ్యతలను అప్పగించారు. వారికి అప్పగించిన బాధ్యతలు సక్రమంగా చేస్తున్నారా లేదా అనే విషయం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాల్సిన అవసరం లేదు. కమిషనర్ కార్యాలయంలో ఎవరు ఏ పనిచేస్తున్నారనే అంశం ఖచ్చితంగా తెలుసుకునే వీలుంది. ప్రతి ఉద్యోగి పనిని ఉన్నతాధికారులు పరిశీలించేందుకు అవకాశముండడంతో, తమ విధులను ఖచ్చితంగా నిర్వర్తించి మంచిపేరు తెచ్చుకోవాలని ఆలోచనతో గ్రౌండ్‌లెవల్‌లో ఉండే సిబ్బంది పనిచేస్తున్నారు. 
భాగ్యనగర్ లో స్మార్ట్ కాప్స్

క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది మొబైల్ పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విజిబుల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ చేస్తూ ఎవరికి కేటాయించిన పరిధిలో వారు జవాబుదారితనంతో కూడిన విధి నిర్వహణ చేయడంతో చాలావరకు నేరాలను తగ్గించే వీలుంటుంది. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెండు మూడు సెక్టార్లుగా విభజిస్తారు. ఈ సెక్టార్లకు ఎస్సై స్థాయి అధికారి ఇన్‌చార్జీగా వ్యవహరిస్తారు. దానితో పాటు ఒక్కో సెక్టార్‌లో ఒక మొబైల్ పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తారు. వీరు ఖచ్చితంగా వారికి కేటాయించిన సెక్టార్‌లో విధులు నిర్వహించాలి. నేరస్తులపై నిఘా, నేర నివారణ, విజిబుల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్, అత్యవసర స్పందనతో పాటు ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశాలుంటే ఆ ప్రాంతాలపై నిఘా ఉంచడం, బందోబస్తులలో పాల్గొనడం ఇలా విధులను కేటాయించారు. ప్రతి ఒక్కరూ ప్రతీ రోజూ ఈ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.  విధి నిర్వాహణకు సంబంధించిన వివరాలను, తన విధులు ముగియగానే డెయిలీ రిపోర్టు యాప్‌లో ఉండే ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. సిబ్బంది ఏమి చేయాలి, ఏమి చేస్తున్నారనే విషయం ఖచ్చితంగా యాప్ నుంచి తెలిసిపోతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్, వి.ఇబుల్ పోలీసింగ్ ఈ మూడు తప్పని సరిగా ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరముంటుంది. ఈ యాప్‌తో సేవలు వేగవంతమవ్వడంతో పాటు, సమయం వృథాను పూర్తిగా నివారించారు. అంతా యాప్ ద్వారానే కమ్యూనికేషన్ కొనసాగిస్తుండడంతో సమయం ఆదా అవుతుంది.హైదరాబాద్ పోలీసులు పాత నేరస్తుల డాటాను సేకరించి, వారు ప్రస్తుతం ఎక్కడున్నారనే విషయాలపై సమగ్ర సర్వే నిర్వహించి సుమారు 4 వేల మంది డాటాబేస్‌ను తయారు చేశారు. హైదరాబాద్ కాప్స్ మొబైల్ యాప్‌తో ఈ డాటాబేస్ యాక్సెస్ చేసుకునే అవకాశముంది. దీంతో క్షేత్ర స్థాయిలో నిత్యం ఆయా సెక్టార్లలో తిరిగే సిబ్బంది, వీరిని తనిఖీ చేయాలి. తనిఖీ చేశారా లేదా అనే విషయం కమిషనర్ కార్యాలయానికి తెలిసిపోతుంది. మొబైల్ యాప్‌కు జియో ట్యాగింగ్ ఉంటుంది. ఫలాన ప్రాంతంలో ఉన్న పాత నేరస్తుడి దగ్గరకు వెళ్లగానే అతడికి సంబంధించిన వివరాలు తనిఖీకి వెళ్లిన సిబ్బంది మొబైల్‌యాప్‌లోకి వస్తాయి. అందులో పొందుపరిచిన వివరాలను సిబ్బంది నింపాలి.మొబైల్ యాప్‌లో క్రైమ్ మ్యాపింగ్ అప్లికేషన్ ఉంటుంది. క్రైమ్ ప్రోన్ ఏరియాలు(తరుచూ క్రైమ్ జరుగుతున్న ప్రాంతాలు) గుర్తించి దాని ప్రకారం గస్తీ నిర్వహణను కట్టుదిట్టం చేసుకోవాలి. జరుగుతున్న నేరాలను బట్టి పెట్రోలింగ్, గస్తీని పెంచుకోవాలి. క్రైమ్ హాట్‌స్పాట్‌లలో అనుమానితులు ఎవరైనా కన్పిస్తే వారిని తనిఖీ చేయాలి. దీనిని పుట్ పెట్రోలింగ్ సిబ్బంది చూసుకోవాలి. స్థానికులతో మాట్లాడి నేర నివారణకు సంబంధించిన సూచనలు తీసుకోవాలి, ఇటీవల ఎవరైనా కొత్త వారు, అనుమానితులు ఆ ప్రాంతానికి వచ్చారా, తిరుగుతున్నారా అనే విషయాలను తెలుసుకోవాలి. స్థానికంగా ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్‌తో కలిసి నేర నివారణ చర్యల్లో వారిని కూడా భాగస్వాములు చేయాలి. తాజా నేరాలకు సంబంధించిన నేరస్తులు, అనుమానితుల ఫొటో ఆల్బంను స్థానికులకు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్సుకు చూపిస్తూ నేరాలను అదుపునకు సహకారం తీసుకోవాలి. ఒక సంఘటన జరగగానే ఆ ప్రాంతానికి చేరుకునే వారిలో స్థానికంగా ఉండే పెట్రోలింగ్, బ్లూకోల్ట్ సిబ్బంది ఉంటారు. డయల్ 100 నుంచి సమాచారం వచ్చిందంటే నిమిషాలలో ఘటన స్థలానికి వెళ్లాలి. డయల్ 100 నుంచి హైదరాబాద్ కాప్స్‌కు అనుసంధానం చేశారు. డయల్ 100కు ఎవరైనా ఫోన్ చేయగానే అక్కడి నుంచి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం రావడంతో, ఘటనకు సంబంధించిన ప్రాంతంలో ఉండే పెట్రోలింగ్ సిబ్బంది మొబైల్‌కు సమాచారం వెళ్తుంది. సమాచారం తీసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలి. సమస్య యొక్క స్వభావం, అత్యవసర కాల్స్‌కు స్పందన, అక్కడి ప్రాంతానికి చేరుకున్న సమయం, సమస్యను పరిష్కరించేందుకు తీసుకున్న సమయాన్ని నోట్ చేయాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment