Breaking News

13/08/2019

కృష్ణ.. కృష్ణా...

మచిలీపట్నం, ఆగస్టు 13(way2newstv.in - Swamy Naidu): కృష్ణా విశ్వవిద్యాలయం స్థాపించి ఇప్పటికి దశాబ్దకాలం కావస్తున్నా సమస్యలు వీడిపోలేదు. భవనాల కొరత, మౌలిక సదుపాయాల లేమి, విద్యార్థులకు దూరంగా వసతి గృహ సదుపాయం, అంతంతమాత్రపు వసతులతో ఇంజినీరింగ్‌ కళాశాల.. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్‌లో విశ్వవిద్యాలయానికి అత్యధిక మొత్తంలో నిధులు కేటాయిస్తారని అంతా ఆశగా ఎదురుచూశారు. బడ్జెట్‌లో రూ.5.9 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఉన్న సమస్యల దృష్ట్యా అవి సరిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం మరికాస్త చొరవ చూపితే విద్యార్థుల కష్టాలు కడతేరతాయని అందరూ ఆశిస్తున్నారు. అవసరాల దృష్ట్యా కనీసం రూ. 60 కోట్లు ఉంటే గానీ సమస్యలు అధిగమించలేని పరిస్థితి ఉంది.విద్య, క్రీడలు, సాంస్కృతిక విభాగాల పరంగా మంచి పేరే ఉంది. విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాల విద్యార్థులు ఈ అంశాల్లో దూసుకుపోతున్నారు. 
కృష్ణ.. కృష్ణా...
వసతుల లేమి శాపంగా మారడంతో పీజీ కళాశాలలు, క్యాంపస్‌లో పూర్తిస్థాయి ప్రవేశాలు రావడం లేదనేది వాస్తవం. యూనివర్సిటీకి 2ఎఫ్‌ అనే ధ్రువపత్రం ఉంది. యూజీసీ నుంచి పూర్తిస్థాయిలో కేంద్ర నిధులు పొందాలంటే 12బి ధ్రువపత్రం కావాలి. అలా కావాలంటే నాక్‌ బృందం సందర్శించి సొంత భవనాలతో పాటుగా ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ఓ ఆచార్యుడు, ఇద్దరు అసోసియేట్‌ ఆచార్యులు, నలుగురు సహాయ ఆచార్యులు, ప్రయోగశాల అటెండర్‌, స్వీపర్‌, క్లర్క్‌, ప్యూన్‌, స్టోర్‌ ఇన్‌ఛార్జిలతో కూడిన పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలి. అప్పుడే నాక్‌ బృందం ఆమోదముద్ర వేసి 12బి ధ్రువపత్రాన్ని అందజేస్తోంది. ఈ పరిస్థితుల్లో భవనాల విషయం ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నది. రుద్రవరంలో 102 ఎకరాల్లో రూ. 82 కోట్ల నిధులతో సొంత భవనాలు నిర్మాణమైనా వాటిలోకి వెళ్లే పరిస్థితి లేదు. వాటిని అప్పగించాలంటే గుత్తేదారు సంస్థకు రూ. 13 కోట్లు బకాయిలు చెల్లించాలి. కనీసం ఆ నిధులు కూడా బడ్జెట్‌లో సమకూర్చకపోవడంతో విద్యార్థులకు మరికొంతకాలం పాటు నిరీక్షణ తప్పేలా లేదు. అద్దెల రూపంలో రూ.లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి కూడా తప్పేలా లేదు.నూతన భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా అత్యంత కీలకంగా మారనుంది. భవనాల నిర్మాణంతో పాటుగా సమావేశ గదుల్లో ఏసీలు, సుందరీకరణ, నడక దారులు, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి వాటి ఏర్పాటుకు మాత్రమే గుత్తేదారు సంస్థతో గత ప్రభుత్వం ఒడంబడిక కుదుర్చుకుంది. మిగిలిన సదుపాయాలన్నీ విశ్వవిద్యాలయ పరంగా, ప్రభుత్వ సహకారం తీసుకునో ఏర్పాటు చేసుకోవాలని భావించినా ఆ విధంగా జరగలేదు. తరగతి గదులకు ఏసీల కొనుగోలు, పైప్‌లైన్‌, కనెక్టివిటీ రోడ్డు, సోలార్‌ పవర్‌ప్లాంట్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించలేకుంటే విద్యార్థులు ఇబ్బందులు పడతారు. రుద్రవరంలో తాగునీటి సదుపాయం లేకపోవడంతో శుద్ధ జల ప్లాంటును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. గ్రంథాలయం కూడా ఏర్పాటుకావాల్సి ఉంది. వాటిలో విలువైన పుస్తకాలు కూడా ఏర్పాటు చేయాలి. వీటన్నింటి నిమిత్తం కనీసం రూ. 20 కోట్లు కావాల్సి ఉంది. నూతన భవనాల్లో పార్కింగ్‌, 3.5 కిమీల మేర నిర్మించే దీని నిర్మాణానికి సుమారు రూ. 7 కోట్ల వ్యయమవుతుంది. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ కళాశాల కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈడేపల్లిలోని ఓ పురాతన అద్దె భవనంలో ఈ కళాశాలను నిర్వహిస్తున్నారు. మౌలిక సదుపాయాల పరంగా ఎంతమాత్రం సంతృప్తికరమైన పరిస్థితుల్లేవు.విద్యార్థులకు అవసరమైన అధునాతన ప్రయోగశాలలు, వసతి గృహ సదుపాయం, సొంత భవనాలు వంటివి ఏర్పాటైతే ఇంజినీరింగ్‌ విభాగాన్ని విస్తరించేందుకు వీలుంటుంది. ఇటీవల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల దృష్ట్యా ఇంజినీరింగ్‌ కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఏర్పడింది. పలువురు ప్రజాప్రతినిధుల జోక్యంతో ఇబ్బందుల నుంచి బయటపడింది. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు తాత్కాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వసతుల కల్పన మాత్రం ఇబ్బందికరంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంజినీరింగ్‌ కళాశాలను కాపాడుకోవాలంటే పూర్తిస్థాయిలో వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వాల్సి ఉంది. భవనాలు, వసతిగృహం, ల్యాబ్‌లు తదితర వసతులు కల్పించాలంటే కనీసం రూ.25 కోట్లు నిధులు కావాల్సి ఉంది. సమస్యల నుంచి గట్టెక్కాలంటే కనీసం రూ.60 కోట్లు అవసరం ఉంది. గత నియామకాల్లో జరిగిన అవకతవకలు తదితర వ్యవహారాలన్నింటిపైనా ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం వల్లే నిధులు అనుకున్న విధంగా కేటాయింపు జరపలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

No comments:

Post a Comment