Breaking News

18/09/2019

సర్వశిక్షా అభియాన్ లో నిలువు దోపిడీ

హైద్రాబాద్, సెప్టెంబర్ 18, (way2newstv.in)
సర్వశిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస భద్రత కరువైంది. కొత్త నియామకాలు చేపట్టక ఉన్న వారిపైనే అదనపు పనిభారం మోపుతున్న ప్రభుత్వం ఆరేళ్లుగా ఇంక్రిమెంట్లు లేకుండా చేసింది. ఒక్కో ఉద్యోగి పదేళ్లుగా పని చేస్తున్నా ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కూడా లేవు. సెలవులు, ఆదివారం అంటూ రాత్రింభవళ్లు పనిచేస్తున్నా ఉన్నతాధికారుల వేధింపులూ తప్పడం లేదు. దీనికితోడు ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఎప్పుడు తొలగిస్తారోనన్న ఆందోళన వెంటాడుతోంది. ఇటీవల పెద్దపల్లి జిల్లాకు చెందిన డీఎల్‌ఎంటీ రమేష్‌ ఆత్మహత్య పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్షా అభియాన్‌లో వివిధ విభాగాల్లో సుమారు 18 వేల మంది ఉద్యోగులు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. 
సర్వశిక్షా అభియాన్ లో నిలువు దోపిడీ

2006 నుంచి మొదలు 2012 వరకు వివిధ సందర్భాల్లో ఉద్యోగాల్లో చేరారు. మండల స్థాయిలో ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, జిల్లా స్థాయి కార్యాలయంలో డీఎల్‌ఎండీ, కంప్యూటర్‌ ఆపరేటర్లు, అటెండర్లుగా పని చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అసిస్టెంట్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, టెక్నికల్‌ పర్సన్‌లుగా విధుల్లో ఉన్నారు. కేజీబీవీలో ప్రత్యేక అధికారులు, సీఆర్‌టీ, అకౌంటెంట్లు తదితర హోదాల్లో పని చేస్తున్నారు. వీరందరికీ ఆరేండ్లుగా ప్రభుత్వం వేతనం పెంచలేదు. సుప్రీంకోర్టు ఇటీవల సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా అవి అమలుకు నోచుకోలేదు. ఇదే పనిలో ఉన్న రెగ్యులర్‌ ఉద్యోగులతో పోలిస్తే వీరికి సగానికి సగం కూడా వేతనం అందడం లేదు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు పెద్దమొత్తంలో వేతనాలు అందజేస్తోంది.సర్వశిక్షా అభియాన్‌లో కాంట్రాక్టు కార్మికులపై తీవ్ర పని భారం పడుతోంది. నలుగురు నుంచి ఐదుగురు చేయాల్సిన పనిని ఇద్దరే చేస్తున్నారు. కొత్త మండలాల్లో సిబ్బందిని నియమించలేదు. ఆ పనినీ ఉన్న సిబ్బందిపైనే వేస్తున్నారు. ఆదివారాలు, పండుగ సెలవుల్లోనూ చేయాల్సి వస్తోంది. 'అర్జెంటు' అంటూ ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇటీవల నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట మండలంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆదివారం రాత్రి ఏడు గంటల తరువాత కూడా విపరీతమైన పని ఒత్తిడి ఉండటంతో కార్యాలయంలోనే కుప్పకులాడు. గతంలో సూర్యాపేటకు చెందిన ఓ ఉద్యోగి కార్యాలయం త్వరగా చేరుకోవాలన్న ఒత్తిడితో బస్సులో నుంచి కింద పడిపోయి చనిపోయాడు. వీరెవరికీ ప్రభుత్వం పైసా సాయం చేయడం లేదు. ఉన్నన్ని రోజులు పని తప్ప జీతాలు పెద్దగా ఇవ్వని ప్రభుత్వం వారు చనిపోయాక ఆ కుటుంబాలనూ పట్టించుకోలేదు.ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఇటీవల పెద్దపల్లి జిల్లాకు చెందిన డీఎల్‌ఎంటీ ఉద్యోగి రమేష్‌ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అతని ఆత్మహత్యపై తోటివారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్హత, అనుభవం ఉన్నప్పటికీ.. రమేష్‌ను సెక్టోరియల్‌ ఆఫీసర్‌గా ప్రమోట్‌ చేయకుండా మరొకరికి అవకాశం కల్పించడంతో అతను కలత చెందాడు. ఇదే అంశంపై రాష్ట్ర కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే.. పరిష్కరించాల్సిన అధికారులు హేళన చేశారని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అవమానాన్ని తట్టుకోలేక రమేష్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment