శ్రీకాకుళం, ఆగస్టు 13 (way2newstv.in - Swamy Naidu): రైతుకు రుణం ఇవ్వాల్సిందే.. ఇది ఉన్నతాధికారులు చెబుతున్న మాట.. ఈ మాటలు విని అప్పుదొరుకుతుందిలే అని ఆశగా బ్యాంకు దగ్గరకు వెళ్లిన అన్నదాతకు మిగిలేది మాత్రం నిట్టూర్ఫే. రకరకాల నిబంధనల పేరుతో బ్యాంకులు రైతులకు రుణాలివ్వడంలో ఆసక్తి చూపించడంలేదు. నిర్దేశించిన రుణ లక్ష్యం సగం కూడా పూర్తికాకపోవడమే ఇందుకు నిదర్శనం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. బ్యాంకులిచ్చే పంట రుణాల కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. పొలాలు దున్నుకొని.. విత్తనాలు వేసుకున్నారు.. ఇక ఎరువులు... పురుగు మందులు ఇలా రైతుకు ఖర్చే ఖర్ఛు చేతిలో డబ్బుల్లేక బ్యాంకు రుణం కోసం తిరుగుతున్న అన్నదాతకు నిరాశే ఎదురవుతోంది. బ్యాంకు అధికారులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కొర్రీలు పెడుతూ కావాలనే ఎడతెగని జాప్యం చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆందోళనతో రైతులు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది
రుణమివ్వరా..? (శ్రీకాకుళం)
జిల్లాలో సహజంగా మే నెల నుంచే రైతులు తమ పొలాలను దున్నుకోవడం ప్రారంభిస్తుంటారు. జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోయినా జులైలో ఆశాజనకంగానే కురిశాయి. ఈ సీజన్‌లో సామాన్య, మధ్య తరగతి రైతులకు విత్తనాలు, పురుగు మందులు, యూరియా తదితరాల కొనుగోలుతో పాటు ఇతర వ్యవసాయ పనుల కోసం రుణాల అవసరం తప్పనిసరిగా ఏర్పడుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆశగా బ్యాంకుల వద్దకు వెళ్లే రైతులకు అధికారుల నుంచి పలు అభ్యంతరాలు, అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఇవి కూడా ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉండటం విశేషం. ఒక బ్యాంకులో పాత బకాయిలు పూర్తిగా చెల్లించి కొత్త రుణం తీసుకెళ్లాలని తేల్చి చెబుతుండగా, మరో బ్యాంకులో వెళ్లిన వెంటనే కొత్త రుణం ఇచ్చేసి అందులో పాత రుణబకాయిలను జమచేసుకుని మిగిలిన మొత్తాన్ని ఇస్తున్నారు. మరో బ్యాంకులో అయితే ప్రతిసారీ రుణం తీసుకున్నట్లుగా.. మళ్లీ వెంటనే పాత బకాయిలు చెల్లించేసినట్లుగా చూపిస్తూ రైతులకు రుణాల మంజూరు కాగితాలకే పరిమితం చేస్తున్నారు. ఇక పట్టాదారు పాసుపుస్తకం, సాంకేతిక కారణాలు తదితర కొర్రీలుసైతం వేధిస్తున్నాయి. దీంతో పనులు మానుకుని బ్యాంకులు చుట్టూ తిరిగే బదులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించడం మంచిదన్న ఆలోచనకు కొందరు రైతులు వచ్చేస్తున్నారు. అది వారికి మరింత ఆర్థికభారమైపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులు కొన్ని బ్యాంకుల వద్దనే కాపు కాస్తూ ఈ తరహా విసిగిపోయిన వారిని తమవైపు తిప్పుకుంటున్న సందర్భాలు ఎన్నో. దీనిని ఉన్నతాధికారులు వెంటనే నియంత్రించకపోతే రైతులకు మరిన్ని ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వినిపిస్తోంది.
No comments:
Post a Comment